పంచాయితీ ఎన్నికల ప్రసహనం ముగిసింది. అధికార పార్టీకి సహజంగా వుండే అడ్వాంటేజ్ కారణంగా వైసీపీ సత్తా చాటింది. వైసీపీ, ఆ పార్టీ అనుకూల మీడియా చెబుతున్న స్థాయిలో కాకపోయినా, మిగతా ఏ రాజకీయ పార్టీకీ అందనంత ఎత్తులో వుంది వైసీపీ, పంచాయితీ ఎన్నికల ఫలితాల్లో. నిజానికి ఈ ఎన్నికలు పార్టీల గుర్తులతో జరగలేదు. అయినాగానీ, స్పష్టంగా ఆయా పార్టీల మద్దతుదారులు, ఆయా పార్టీల జెండాలతో ప్రచారాలు చేసిన దరిమిలా, విషయం సుస్పష్టం. ఇంతకీ, ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీ పరిస్థితేంటి పంచాయితీ ఎన్నికల్లో.? చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలో టీడీపీకి తగిలిన దెబ్బ చాలు, రాష్ట్రంలో టీడీపీ ప్రస్తుత పరిస్థితి ఏంటో చెప్పడానికి. కొన్ని చోట్ల టీడీపీ గెలిచినా, తదుపరి సార్వత్రిక ఎన్నికల్లో అధికారం సాధించడానికి ఈ జోరు సరిపోదు. నిజానికి, అసలు అధికారం అనే రేసులో టీడీపీ వున్నట్లే కనిపించలేదు ఫలితాలు చూస్తే. చాలా చోట్ల రెండో స్థానంలోకి జనసేన వచ్చింది. అసలు జనసేన ఈ స్థాయిలో ఫలితాలు సాధించడం అధికార పార్టీకి కూడా ఆశ్చర్యం కలిగిస్తోంది.
అయితే, టీడీపీకి జనసేన షాకిచ్చింది గనుక, వైసీపీ కొంతవరకు హ్యపీగానే వున్నట్టుంది జనసేన ఎదుగుదల చూసి. కానీ, తదుపరి సార్వత్రిక ఎన్నికల నాటికి వైసీపీకి జనసేన ప్రత్యామ్నాయంగా మారితేనో.? ఆ పరిస్థితి పంచాయితీ ఎన్నకల్లోనే కొన్ని చోట్ల కనిపించింది. దీన్ని వైసీపీ మాత్రమే కాదు, టీడీపీ సహా టీడీపీ అనుకూల మీడియా, వైసీపీ అనుకూల మీడియా కూడా జీర్ణించుకోలేకపోతున్నాయి. దాంతో, జనసేన విజయాన్ని తక్కువ చేసి చూపేందుకు ప్రయత్నిస్తున్నాయి. అయితే, ఇక్కడ జనసేనకు ఇంకో పెద్ద సమస్య కూడా వుంది. అదే బీజేపీతో స్నేహం. జనసేన తాము సొంతంగా పంచాయితీ ఎన్నికల్లో మెరుగైన ప్రదర్శన ఇచ్చినట్లుగా చెప్పుకోవడాన్ని బీజేపీ జీర్ణించుకోలేకపోతోంది. దాంతో, ముందు ముందు జనసేనకు బీజేపీ సహకారం కొంతమేర తగ్గే అవకాశాలున్నాయి. బీజేపీ, జనసేన సంగతి పక్కన పెడితే, టీడీపీ ఇప్పుడు ఆత్మరక్షణలో పడిపోయింది. 2024 లేదా అంతకన్నా ముందే జరిగే సార్వత్రిక ఎన్నికల్లో అధికారం దక్కించుకోవాలంటే ఎలాగైనా పుంజుకోవాల్సిందే.. కానీ, ఎలా.? ఈ ప్రశ్నకైతే టీడీపీ దగ్గర సమాధానం ప్రస్తుతానికి లేదు.