ఐటి అధికారులే షాకయ్యారు..వందల కోట్లేమయ్యాయ్ ?

తెలుగుదేశంపార్టీ రాజ్యసభ సభ్యుడు సిఎం రమేష్ ఇళ్ళు, కార్యాలయాలపై దాడులు చేసిన ఐటి అధికారులకు పెద్ద షాకే తగిలింది. మూడు రోజులుగా రమేష్ సోదాలు జరుపుతున్న ఐటి అధికారులకు విస్తుపోయే వివరాలు బయటపడినట్లు సమాచారం. రిత్విక్ ప్రాజెక్ట్స్, రిత్విక్ ప్రాపర్టీస్ లాంటి సంస్ధలు నడుపుతున్న రమేష్ బ్యాంకు లావాదేవీల ద్వారా కాకుండా బ్యాంకుల నుండి నేరుగా వందల కోట్ల రూపాయలు నగుదుగానే చేతికి తీసేసుకునే వారట.

 

మామూలుగా ఏ కంపెనీ కూడా తన నగదు లావాదేవీలను బ్యాంకుల ద్వారానే జరుపుతాయి. ఎవరికి డబ్బులు చెల్లించాలన్నా అవతల వాళ్ళ ఖాతాలకు బ్యాంకు ద్వారానే నేరుగా డబ్బులు ట్రాన్స్ ఫర్ చేసేస్తారు. చివరకు ఉద్యోగులకిచ్చే జీతాలను కూడా బ్యాంకుల నుండే బదిలీ చేయటం అందరికీ తెలిసిందే. అటువంటిది వందల కోట్ల రూపాయలను నేరుగా చేతికి ఎందుకు తీసుకున్నట్లు ?

 

అటువంటిది బ్యాంకులకు చేరుతున్న వందల కోట్ల రూపాయలను రమేష్ తమ కంపెనీ ఖాతాల్లోకి పడకుండా నేరుగా డబ్బును డ్రా చేయటంలో మతలబు ఏంటో అర్ధం కావటం లేదు. ఇరిగేషన్ కాంట్రాక్టులను పెద్ద ఎత్తున చేపట్టిన రిత్విక్ ప్రాజెక్ట్స్ ఖాతాలోకి ప్రభుత్వం నుండి డబ్బులు పడాలంటే ముందు బ్యాంకు ఖాతాలో పడాలి. బ్యాంకు ఖాతా నుండి రిత్విక్ కంపెనీ అకౌంట్లోకి బదిలీ అవుతుంది. కానీ ఇక్కడ రిత్విక్ కంపెనీ అకౌంట్లోకి బదిలీ అయ్యేలోగానే రమేషే నేరుగా బ్యాంకు ఖాతా నుండి వందల కోట్లను డబ్బులు డ్రా చేసినట్లుగా అలహాబాద్ బ్యాంకు మేనేజర్ ఐటి అధికారులకు చెప్పినట్లు ప్రచారంలో ఉంది. అదే విషయాన్ని మేనేజర్ నుండి రాతమూలకంగా ఐటి అధికారులు స్టేట్మెంట్ రూపంలో తీసుకున్నారట.

 

బ్యాంకు ఖాతా నుండే నేరుగా తీసుకున్న వందల కోట్ల రూపాయలను రమేష్ ఎక్కడికి తరలించారు ? అన్నదే ఇపుడు మిస్టరీగా మారింది. ఆ డబ్బును ఢిల్లీకి తరలించారని ప్రచారం జరుగుతోంది. అది నిజమే అయితే ఢిల్లీలో ఎవరికి ఇచ్చారన్నది ప్రధాన ప్రశ్న. అటువంటి అంశాలపైనే అధికారులు రమేష్ ను ప్రశ్నిస్తున్నారట.

 

ఐటి అధికారులు కొండను తవ్వి ఎలుకను కూడా పట్టలేరని పైడి భింకం ప్రదర్శిస్తున్న రమేష్ లోపల మాత్రం బాగా టెన్షన్ పడుతున్నట్లు స్పష్టంగా తెలిసిపోతోంది. పైగా ఇంట్లో దొరికిన రెండు డిజిటల్ లాకర్లలో కూడా విలువైన డాక్యుమెంట్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారట. బహుశా రెండు మూడు రోజుల్లో రమేష్ కు సంబంధించి ఆశ్చర్యకరమైన వివరాలు వెలుగు చూడవచ్చనే ప్రచారం జరుగుతోంది. చూడాలి ఆ సమాచారం ఏమిటో ?