కడప జిల్లా పొద్దుటూరులో టీడీపీ నేత హత్య జరిగితే, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్, హుటాహుటిన అక్కడికి వెళ్ళిపోయి నానా హంగామా చేశారు. ‘మా పార్టీ నేతనే హత్య చేస్తారా.? స్థానిక ఎమ్మెల్యే మీద కేసు పెట్టాలి.. కమిషనర్ మీద కేసు పెట్టాలి..’ అంటూ నారా లోకేష్ ఆవేశంతో ఊగిపోయారు. కానీ, జరిగిన ఘటన వెనుక పెద్ద కథే నడిచిందంటూ పోలీసులు అసలు చిట్టా విప్పేశారు. చంద్రబాబు హయాంలోనే సదరు టీడీపీ మీద నాలుగు క్రిమినల్ కేసులు నమోదయ్యాయట. అంతకు ముందూ ఆయన మీద చాలా కేసులున్నాయట. ఇటీవలి కాలంలో మరికొన్ని కేసులు ఆయన మీద నమోదయ్యాయట. ఈ చిట్టా మొత్తాన్ని వైసీపీ విప్పింది. తమ మీద వచ్చిన ఆరోపణల నేపథ్యంలో వైసీపీ, చాలా జాగ్రత్తగా అన్ని విషయాల్నీ మీడియా ముందుంచింది. గతంలో సదరు టీడీపీ నేత, వైసీపీలోనే వుండేవారట. అప్పుడు టీడీపీ నుంచి బెదిరింపులు ఎదుర్కొన్నరట. ఇది ఫ్యాక్షన్ రాజకీయ హత్యను తలపిస్తోంది కదా.! చంద్రబాబు హయాంలో మంత్రిగా పనిచేసిన నారా లోకేష్‌కి ఇలాంటి ఫ్యాక్షన్ హత్యల గురించి తెలియదని ఎలా అనుకోగలం.? నిజానికి, ఇది ఫ్యాక్షన్ హత్య కాదు..
ఫ్యాక్షన్ నేల మీద జరిగిన రాజకీయ హత్య. ఆ రాజకీయంతోపాటు ఇంకా చాలా కారణాలు ఈ హత్య వెనుక వున్నాయి. ఇలాంటివి టీడీపీలో చాలానే జరిగాయి. కర్నూలు జిల్లాలో వైసీపీ ముఖ్య నేత ఒకర్ని ప్రత్యర్థులు హత్య చేస్తే.. ఆ ఘటనపై అప్పటి అధికార పార్టీ ఎంత తేలిగ్గా మాట్లాడిందో చూశాం. అదే పని ఇప్పుడు వైసీపీ చేస్తోంది. సాక్షాత్తూ అప్పటి ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మీద కోడి కత్తితో విశాఖ విమానాశ్రయంలో ఓ వ్యక్తి దాడి చేస్తే, ‘పబ్లిసిటీ కోసం వైఎస్ జగన్ తనంతట తాను చేయించుకున్న దాడి’ అని టీడీపీ నేతలు వెకిలి వ్యాఖ్యలు చేశారు. సరే, ఆ కేసు ఇప్పటికీ ఎందుకు తేలలేదు.? అన్నది వేరే చర్చ. ‘బస్తీ మే సవాల్.. పోలీసులు, ఎమ్మెల్యే మీద కేసు నమోదు చేసేదాకా మృతదేహాన్ని కదలనివ్వం..’ అని తెగేసి చెప్పిన నారా లోకేష్, ఆ తర్వాత మనసు మార్చుకున్నారు. పార్టీ పట్ల, పార్టీలో నేతల పట్ల టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌కి వున్న ‘బాధ్యత’కు ఇంతకన్నా నిదర్శనం ఇంకేం కావాలి.?