Indian Woman: భారత మహిళకు యూఏఈలో మరణశిక్ష.. ఏం జరిగిందంటే..

ఉద్యోగం కోసం విదేశాలకు వెళ్లిన ఓ భారతీయ మహిళకు అక్కడి కోర్టు మరణశిక్ష విధించడమే కాకుండా, దానిని అమలు చేయడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఉత్తరప్రదేశ్‌కు చెందిన షెహజాది ఖాన్‌ యూఏఈలో ఓ చిన్నారి మరణానికి కారణమని తేలడంతో ఫిబ్రవరి 15న ఆమెకు మరణశిక్ష అమలు చేశారు. అయితే, ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కుటుంబ సభ్యులు ఆమెను కాపాడేందుకు ఎంతో ప్రయత్నించినా, చివరకు ఫలితం లేకుండానే ఆమె ప్రాణాలు కోల్పోయింది.

జైలు అధికారులు షెహజాదిని మరణశిక్ష అమలు చేసే ముందు చివరి కోరిక ఏంటని అడగగా, ఆమె తన కుటుంబంతో మాట్లాడాలని అభ్యర్థించింది. అనుమతి పొందిన ఆమె కుటుంబ సభ్యులతో ఫోన్‌లో మాట్లాడి, తాను నిర్దోషినని కన్నీరు పెట్టుకుంది. చివరి క్షణంలోనూ ఆమె తనపై విధించిన శిక్ష అన్యాయమని చెప్పినప్పటికీ, అక్కడి ప్రభుత్వం తన నిర్ణయాన్ని మార్చుకోలేదు.

షెహజాదికి యూఏఈలో చోటుచేసుకున్న సంఘటన ఆమె జీవితాన్ని తలకిందులు చేసింది. 2020లో యూపీలో అగ్నిప్రమాదంలో గాయపడిన ఆమె, కష్టకాలం నుంచి బయటపడేందుకు ఉద్యోగం కోసం వెతుకుతుండగా ఓ వ్యక్తి మాటలు నమ్మి యూఏఈ వెళ్లింది. అయితే, అక్కడ పని కల్పిస్తానని చెప్పి ఆమెను ఓ కుటుంబానికి విక్రయించారు. ఫైజ్‌, నాడియా అనే దంపతుల ఇంట్లో పనిమనిషిగా ఉన్న ఆమెకు వారి చిన్నారి సంరక్షణ బాధ్యత అప్పగించారు.

అనుకోకుండా ఆ చిన్నారి మరణించడంతో, తల్లిదండ్రులు షెహజాదిపై హత్య ఆరోపణలు మోపారు. అయితే ఆమె మాత్రం చిన్నారి ఆరోగ్యం గురించి తల్లిదండ్రుల నిర్లక్ష్యమే (మెడిసిన్ వాడకంలో) మరణానికి కారణమని చెప్పినా, అక్కడి కోర్టు ఆమె వాదనను తిరస్కరించింది. తీవ్ర ఆరోపణలు మోపిన దర్యాప్తు సంస్థలు, ఆమెను నేరస్తురాలిగా నిలిపాయి. చివరికి భారత ప్రభుత్వ ప్రయత్నాలు కూడా ఫలించకపోవడంతో, షెహజాదికి మరణశిక్ష అమలైంది. ఈ ఘటన ఇప్పుడు భారతదేశంలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

వాడొక చెత్తనాకొ*కు || Director Geetha Krishna EXPOSED Posani Arrest Case || Pawan Kalyan || TR