ఆటలో గెలుపోటములనేవి సర్వసాధారణం.. ఇది చాలా సందర్భాల్లో విన్నాం. గెలవడం, ఓడిపోవడం కంటే కూడా.. పోరాడటం అనేదానికి ఎక్కువ గుర్తింపు లభిస్తుంటుంది. అదే కీలకం కూడా.! టీ20 వరల్డ్ కప్ 2022 పోటీలకు సంబంధించి టీమిండియానే టైటిల్ ఫేవరెట్. మంచి విజయాల్ని కూడా ఈ టోర్నీలో టీమిండియా ఆయా మ్యాచ్‌లలో సాధించింది. కానీ, సెమీస్‌లో దారుణమైన పరాజయాన్ని చవిచూసింది. తొలుత బ్యాటింగ్ చేసి 168 పరుగులు సాధించిన టీమిండియా, ప్రత్యర్థిని కట్టడి చేయడంలో మాత్రం పూర్తిగా విఫలమైంది.
అసలు ఏం బౌలింగ్ చేశారు టీమిండియా బౌలర్లు.?
అన్న ప్రశ్న భారత క్రికెట్ అభిమానుల నుంచి వస్తోంది. ఆట మీద అస్సలేమాత్రం ఇష్టం లేనట్టుగా బౌలర్లు బౌలింగ్ చేశారన్నది కోట్లాది మంది భారత క్రికెట్ అభిమానుల ఆవేదన.
ముందే చెప్పుకున్నట్లు.. ఆటలో గెలుపోటములు సహజం. కానీ, కనీసం పోరాడలేని తత్వాన్ని ఏమనుకోవాలి.?
ఒక్కటంటే ఒక్క వికెట్ తీయలేకపోయింది టీమిండియా.. పదహారు ఓవర్లలో ఇంగ్లాండ్ విజయాన్ని అందుకుంది. ఈ పదహారు ఓవర్లలో కనీసం
ఒక్క వికెట్ ఎందుకు టీమిండియా బౌలర్లు తీయలేకపోయారు.?
ప్చ్.. ఒక్కోసారి టైమ్ బ్యాడ్.. అని సరిపెట్టుకోవడానికీ లేదిక్కడ. ఎందుకంటే, ఇది సెమీస్ మ్యాచ్. భారత క్రికెట్ అభిమానుల్లో నిరాశ నిస్పృహ ఏ స్థాయిలో వచ్చేసిందంటే, ఇకపై క్రికెట్ మీద ఇంట్రెస్ట్ పోయిందనేంతలా. రోహిత్, రాహుల్.. ఇలా భారత క్రికెటర్లందర్నీ దారుణంగా ట్రోల్ చేస్తున్నారు.. ఒక్క కోహ్లీని తప్ప.
‘పోన్లే.. ఈ పరాజయం పాకిస్తాన్ చేతిలో.. అదీ ఫైనల్‌లో అయి వుంటే.. అది ఇంకా పెద్ద అవమానం..’ అని కొందరు క్రికెట్ అభిమానులు నిట్టూరుస్తున్నారు.