సూపర్ ఓవర్‌లో శ్రీలంకపై భారత్ విజయం.. ఇక తుదిపోరుకు రెడీ..!

ఆసియా కప్ 2025లో భారత్ మరోసారి సత్తా చాటింది. సెప్టెంబర్ 26న దుబాయ్‌లో జరిగిన సూపర్ ఫోర్స్ మ్యాచ్ ప్రేక్షకులకు ఊపిరి బిగపట్టే ఉత్కంఠను అందించింది. చివరి బంతి వరకు సాగిన పోరులో భారత్, శ్రీలంకల స్కోర్లు సమానంగా రావడంతో మ్యాచ్ సూపర్ ఓవర్‌కు వెళ్లింది. ఆ సమయంలో ఆర్ష్‌దీప్ సింగ్ మాయాజాలం చూపించగా, భారత్ విజయం సాధించి సగర్వంగా ఫైన్ లోకి అడుగు పెట్టింది. ఈ విజయంతో టీమిండియా అజేయంగా ఫైనల్ చేరడం విశేషం. టోర్నమెంట్ మొత్తంలో ఒక్క మ్యాచ్ కూడా కోల్పోకుండా దూసుకెళ్లిన భారత్, మరోసారి ఆసియా కప్ టైటిల్ దిశగా బలమైన అడుగు వేసింది.

మ్యాచ్ ఆరంభంలో భారత్ బ్యాట్స్‌మెన్లు రెచ్చిపోయారు. అభిషేక్ శర్మ పవర్‌ప్లేలోనే 31 బంతుల్లో 61 పరుగులు చేసి దూకుడుగా ఆడాడు.. అయితే శుభ్ మన్ గిల్ 4 పరుగులు చేసి వెనుదిరగగా.. సంజు సామ్సన్, తిలక్ వర్మల ఇన్నింగ్స్‌తో భారత్ 20 ఓవర్లలో 202 పరుగులు చేసింది. చివరి బంతికి అక్సర్ పటేల్ సిక్స్ కొట్టడం ప్రేక్షకుల్లో ఉత్సాహాన్ని రగిలించింది. ఇది ఈ ఏడాది ఆసియా కప్‌లో వచ్చిన తొలి 200 స్కోరు ఇది.

లక్ష్య ఛేదనలో శ్రీలంక బ్యాట్స్‌మన్ పతుమ్ నిస్సంక ఒక్కరే ధాటిగా ఆడాడు. అతను అద్భుత సెంచరీ సాధించి మ్యాచ్‌ను ఉత్కంఠభరిత ముగింపుకు తీసుకెళ్లాడు. దాసున్ శనక, జనిత్ లియానగేలు తోడ్పాటు అందించారు. చివరి బంతికి మ్యాచ్ టై కావడంతో ప్రేక్షకులు సీట్ల అంచులపై కూర్చునే పరిస్థితి నెలకొంది. కానీ సూపర్ ఓవర్‌లో భారత్ బౌలర్ల ఆధిపత్యం చూపించగా.. నిస్సంక శతకం వృథా అయింది. అతడే మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అయినా ఫలితం మాత్రం భారత్ వైపు మళ్లింది.

ఈ విజయంతో భారత్ బౌలింగ్ విభాగం శక్తి మరింత స్పష్టమైంది. జస్‌ప్రీత్ బుమ్రా లేకపోయినా, ఆర్ష్‌దీప్ సింగ్, హర్షిత్ రాణా, అక్సర్ పటేల్ లాంటి బౌలర్లు బాధ్యత తీసుకుని విజయాన్ని సాధించారు. మ్యాచ్ తర్వాత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ మాట్లాడుతూ తమ జట్టు ప్రతి మ్యాచ్‌ని గెలిచే లక్ష్యంతో ఆడుతోందని తెలిపారు. ఫైనల్‌లో మరింత మెరుగైన ప్రదర్శన చూపుతాం అని అన్నాడు.

ఇప్పుడు అభిమానుల దృష్టి ఫైనల్‌పైనే ఉంది. సెప్టెంబర్ 28న అదే దుబాయ్‌లో భారత్–పాకిస్తాన్ ఫైనల్ జరగనుంది. రెండు జట్ల మధ్య ఉన్న రైవల్రీ కారణంగా ఈ పోరు కేవలం క్రికెట్ మాత్రమే కాకుండా గౌరవప్రతిష్టల పోరాటంగా మారింది. గ్రూప్ స్టేజ్, సూపర్ ఫోర్స్‌లో భారత్ ఇప్పటికే పాకిస్తాన్‌ను ఓడించింది. అయినా పాకిస్తాన్ జట్టు సైమ్ అయూబ్, షహీన్ అఫ్రిదీ, ఫహీమ్ అష్రఫ్ వంటి ఆటగాళ్లతో బలంగా కనిపిస్తోంది.