భారత్–పాకిస్తాన్ పోరు అంటేనే క్రికెట్ అభిమానుల్లో ఉత్కంఠ. కానీ ఆదివారం జరిగిన టీ20 మ్యాచ్ మాత్రం పూర్తిగా టీమిండియా ఆధిపత్యం కింద సాగింది. మొదట బౌలర్లతో పాక్‌ను చిత్తు చేసిన భారత్, తర్వాత బ్యాటర్లతో టార్గెట్‌ను ఈజీగా ఛేదించి ఘన విజయం నమోదు చేసింది. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్న పాకిస్తాన్ జట్టు ఆరంభం నుంచే కష్టాల్లో పడింది. తొలి బంతికే హార్దిక్ పాండ్యా వికెట్ తీసి భారత్‌కు మంచి ఆరంభం ఇచ్చాడు.
అక్కడినుంచి పాక్ బ్యాటర్లు వరుసగా పెవీలియన్ బాట పట్టారు. ఓపెనర్ షాహిబాజా ఫర్హాన్ (40) కాస్త ప్రతిఘటన చూపించగా, షాహిన్ అఫ్రిది (33), ఫకర్ జమాన్ (17) తప్ప మిగతా వారు రెండంకెల స్కోరు దాటలేకపోయారు. చివర్లో షాహిన్ వరుస బౌండరీలు కొట్టడంతో పాక్ స్కోరు 127 పరుగుల వరకే చేరింది. భారత్ బౌలర్లలో కుల్దీప్ యాదవ్ (3), అక్షర్ పటేల్ (2), బుమ్రా (2) కీలక విజయాలు సాధించారు. హార్దిక్, వరుణ్ చెరో వికెట్ తీసి పాక్ బ్యాటర్లకు ఊపిరి పీల్చనివ్వలేదు.
అనంతరం 128 పరుగుల సాధారణ లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ ఆరంభం నుంచే దూకుడు చూపించింది. అభిషేక్ శర్మ (13 బంతుల్లో 31 పరుగులు) సునామీలా ఆడి జట్టుకు వేగవంతమైన ఆరంభాన్ని ఇచ్చాడు. గిల్ (10) తక్కువ స్కోరుకే ఔట్ అయినా, తర్వాత క్రీజులోకి వచ్చిన సూర్యకుమార్ యాదవ్ తన ప్రత్యేకమైన ఆటతీరుతో పాక్ బౌలర్లను చిత్తుచేశాడు. 47 పరుగులు చేసి మ్యాచ్‌ను దాదాపు భారత్ గెలుపు వైపు మలిచాడు. తిలక్ వర్మ (31) కూడా చక్కటి ఇన్నింగ్స్ ఆడి జట్టుకు బలాన్నిచ్చాడు. చివర్లో శివమ్ దూబేతో కలిసి సూర్యకుమార్ లక్ష్యాన్ని 15.5 ఓవర్లలోనే ఛేదించి టీమిండియాకు ఘన విజయాన్ని అందించాడు.
ఈ విజయం భారత్‌కు నమ్మకాన్ని ఇచ్చేలా ఉందని క్రికెట్ విశ్లేషకులు చెబుతున్నారు. ముఖ్యంగా వరల్డ్ కప్ దృష్ట్యా ఇలాంటి గెలుపులు జట్టుకు అదనపు మోరాల్స్ ఇస్తాయని వారు భావిస్తున్నారు. భారత్–పాక్ పోరాటం సాధారణ మ్యాచ్ కాదు. ఇది ఎప్పుడూ క్రికెట్ కంటే ఎక్కువగా భావించబడుతుంది. అలాంటి మ్యాచ్‌లో టీమిండియా ఏకపక్షంగా గెలవడం అభిమానులు సంబరాలు చేస్తున్నారు. ఇక పుట్టిన రోజు నాడు.. సూర్య కుమార్ యాదవ్ అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు.
