తారమండలంలో కోట్లాది నక్షత్రాలు, గ్రహాలు, ఉపగ్రహాలు సంచరిస్తుంటాయి. కానీ, వాటిలో కొన్ని మాత్రమే మనకు ప్రస్ఫుటంగా కనిపిస్తుంటాయి. వాటికే మనం పూజలు పునస్కారాలు చేస్తాము. అలాగే రాజకీయ తారమండలంలో కూడా వందలాదిమంది నాయకులు కనిపిస్తారు. కానీ, అతి కొద్దిమందినే మనం నిరంతరం స్మరించుకుంటాము. వారు మరణించి దశాబ్దాలు గడిచినా వారిని మరచిపోము. మహాత్మా గాంధీని జాతిపితగా గౌరవించుకుంటాము.
పంచవర్ష ప్రణాళికా రూపశిల్పిగా తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూను సంభావిస్తాము. అలాగే సర్దార్ పటేల్, శ్రీమతి ఇందిరాగాంధీ, లోక్ నాయక్ జయప్రకాశ్ నారాయణ్, డాక్టర్ బి ఆర్ అంబేద్కర్, ఎన్టీఆర్…వీరంతా మరణించి చాల దశాబ్దాలు గడిచాయి. అయినప్పటికీ, వారందరూ మన స్మృతిపధం నుంచి చెరిగిపోరు. అలాంటివారిలో దివంగత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి కూడా ఒకరు. ఆయన గగనమార్గంలో పయనిస్తూ ప్రమాదవశాత్తూ హెలికాఫ్టర్ నేలకూలడంతో విషాదకరమైన పరిస్థితుల్లో ప్రాణాలు వీడారు. ఆయన వెళ్తున్నది కూడా రచ్చబండ అనే ప్రజాసమస్యలను పరిష్కరించే ఒక ప్రభుత్వ కార్యక్రమంలో పాల్గొనడానికి. ఆయన మరణం ప్రజాసేవలో భాగంగా సంభవించడం దురదృష్టకరమైన పరిణామం.
ఇక రాజశేఖరరెడ్డి రాజకీయ జీవితం తెరచిన పుస్తకం. పుట్టుకతోనే ఆయన పేదలపెన్నిధి. అతి ఖరీదైన వైద్యవిద్యను అభ్యసించి, కోట్ల రూపాయలు ఆర్జించడానికి అవకాశం ఉన్నప్పటికీ, కేవలం ఒక్క రూపాయిని ఫీజుగా తీసుకుని వైద్యం చేసేవారట. అలా వైద్యవిద్యలో కొనసాగినట్లయితే ఏదో ఒక ప్రాంతానికో, లేదా ఒక మండలానికో పరిమితం అయ్యేవారు. కానీ, ఆయన సేవలు రాష్ట్రవ్యాప్తంగా అవసరం. అందుకే విధి ఆయన్ను రాజకీయాల్లోకి మళ్లించింది. ఎమ్మెల్యే నుంచి ఎంపీ, మంత్రి, ముఖ్యమంత్రి వరకూ ఆయన ప్రస్థానం కొనసాగింది. రాజకీయాల్లో తన ఉనికిని, స్వాతంత్య్రాన్ని కాపాడుకోవడానికి సీనియర్స్ తో సమరమే చేశారు. తనను నమ్మిన అనుచరులకు ఎంతకైనా సాహసించే సద్గుణం కలిగిన అరుదైన నాయకుడు వైఎస్సార్. ఆయనను అణగదొక్కాలని, రాజకీయాల్లో ఎదగకుండా చెయ్యాలని ప్రయత్నం చెయ్యని నాయకుడు అంటూ లేడు.
ఉమ్మడి రాష్ట్ర చరిత్రలో మొట్టమొదటిసారిగా పాదయాత్రకు శ్రీకారం చుట్టిన నాయకుడు వైఎస్సార్. రెండుసార్లు వరుసగా ఓడిపోయిన కాంగ్రెస్ పార్టీ, మరొకసారి ఓటమి పాలైతే భవిష్యత్తు కోల్పోయినట్లే అని భావించి రాష్ట్రం నాలుగు చెరగులా తన పాదముద్రలతో ప్రజలను పలకరించాలని నిశ్చయించుకున్నారు. చంద్రబాబు పరిపాలన నరకానికి నకలుగా అపకీర్తి మూటగట్టుకుంది. అవినీతి, దోపిడీ ఒకవైపు, ఏడాదికోసారి కరెంట్ చార్జీలు, ఇతర పన్నులను పెంచుతూ ప్రజలను పీడిస్తున్న చంద్రబాబును ఎలాగైనా ఓడించాలని, తిరిగి ఇందిరమ్మ సంక్షేమరాజ్యాన్ని ప్రజలకు గుర్తు చెయ్యాలని మహా పాదయాత్రకు ముహూర్తం పెట్టారు. ఎండలు మండిపోతున్న ఏప్రిల్ నెలలో వద్దని, శీతాకాలంలో చెయ్యమని సీనియర్ కాంగ్రెస్ నాయకులు సలహా ఇచ్చినప్పటికీ “మనం చేసేది విహారయాత్ర కాదు…ప్రజల కష్టాలు తెలుసుకునే పాదయాత్ర” అని చేవెళ్ల నుంచి పాదయాత్రను మొదలు పెట్టారు. సుమారు పదిహేను వందల కిలోమీటర్ల మేర ఆయన పాదయాత్రను నిర్వహించి కాంగ్రెస్ పార్టీకి అఖండమైన విజయాన్ని సమకూర్చి పెట్టారు. కేంద్రంలో యూపీఏ ప్రభుత్వం ఏర్పడటానికి నాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో గెలిచిన ఎంపీల సంఖ్య ఎంతో దోహదపడింది.
ఇక వైఎస్సార్ అంటే గుర్తుకొచ్చేవి సంక్షేమ పధకాలు. వాటిలో రైతుల విద్యుత్ రుణాల మాఫీ, ఉచిత విద్యుత్ ప్రముఖమైనవి. ఆ పధకాలు అమలు పరచడం అసాధ్యం అని కాంగ్రెస్ పార్టీలోని కొమ్ములు తిరిగిన ఆర్థికవేత్తలు కుండబద్దలు కొట్టారు. ఇక అప్పటిదాకా అధికారంలో ఉన్న చంద్రబాబు “ఉచిత విద్యుత్ ఇస్తే కరెంట్ తీగల మీద బట్టలు ఆరేసుకోవాల్సిందే” అంటూ అవహేళన చేశారు. వారి శాపనార్ధాలన్నింటినీ ఆశీస్సులుగా స్వీకరించి ఉక్కు సంకల్పంతో అధికారంలోకి రాగానే చేసిన తొలిసంతకం రైతుల రుణాల మాఫీ ఆదేశం మీద. ఇక కాంగ్రెస్ మానిఫెస్టోలో ఉన్నవాటినే కాక, లేని పధకాలను కూడా దేశం బుగ్గలు నొక్కుకుంటూ చూస్తుండగా ప్రవేశపెట్టి వాటిని నిష్కర్షగా అమలుచేసిన ఏకైక ముఖ్యమంత్రి వైఎస్సార్. నిజానికి రూపాయికి కిలో బియ్యం, ఫీజ్ రీయింబర్స్మెంట్, ఆరోగ్యశ్రీ లాంటి పధకాలు ఎన్నికల మానిఫెస్టోలో లేవు. కానీ, వాటిని కూడా అమలుపరచి వేరే రాష్ట్రప్రభుత్వాలు, కేంద్రప్రభుత్వాన్ని కూడా దిగ్భ్రాంతులను చేశారు ఆయన.
అసలు ఇన్నిన్ని పధకాలను వైఎస్సార్ ఎలా అమలు చేస్తున్నారో కూడా తెలియక తలపండిన ఆర్ధికపండితులు తలలు బాదుకున్నారు. ప్రపంచస్థాయి ఆర్థికవేత్త మన్మోహన్ సింగ్ కూడా వైఎస్ సంక్షేమపథకాల విజయం ఏమిటో అర్ధం చేసుకోలేకపోయారంటే వైఎస్ బుద్దికుశలతను, మేధస్సును అర్ధం చేసుకోవడం సామాన్యుల తరమవుతుందా? వాళ లక్షలమంది పేదింటి పిల్లలు ఇంజినీరింగ్ కోర్సులు చేసి జాతీయ అంతర్జాతీయ స్థాయి కంపెనీలలో పనిచేస్తూ లక్షల రూపాయలు సంపాదిస్తున్నారంటే అది రాజశేఖరరెడ్డి పుణ్యం. గుండె, కిడ్నీ, లివర్, మెదడు లాంటి అత్యంత ఖరీదైన సర్జరీలు చేయించుకోలేక ప్రాణాలు విడవడమే మార్గం అనుకున్న నిర్భాగ్యులు నయాపైసా ఖర్చు లేకుండా ఆ ఆపరేషన్లు కార్పొరేట్ ఆసుపత్రులలో చేయించుకుని యమపాశాలనుంచి తప్పించుకున్నారంటే అది కేవలం రాజశేఖరరెడ్డి చలువే. ఇలా చెప్పుకోవాలంటే వైఎస్ అయిదేళ్ల పాలన ఒక స్వర్ణయుగం.
వైఎస్ కాంగ్రెస్ మహాసముద్రంలో ఒక నీటిబిందువు లాంటివాడు అయినప్పటికీ ఆయన అధిష్టానానికి బానిసత్వం చెయ్యలేదు. అధిష్టానానికి విధేయుడిగా మెలిగాడు తప్ప అధిష్టానం మెప్పు కోసం భజనలు చెయ్యలేదు. పదవికోసం పోరాడాడు తప్ప బిచ్చం అడగలేదు. ఒకదశలో “ఇష్టం వచ్చినట్లు నిర్ణయాలు తీసుకోవడానికి సోనియా ఏమైనా సామ్రాజ్ఞియా” అని వ్యాఖ్యానించినట్లు ఒక పత్రికలో వార్తలు వచ్చాయి. కేంద్రప్రభుత్వం గాస్ సిలిండర్ ధర ఒకేసారి పాతిక రూపాయలు పెంచినపుడు “నా అక్కాచెల్లెళ్లు అంత భారాన్ని భరించలేరు. ఆ మొత్తాన్ని ప్రభుత్వమే భరిస్తుంది” అని ప్రకటించారంటే వైఎస్ ధైర్యానికి హద్దులు ఉన్నాయా? సోనియాకు కోపం వస్తుందేమో అని కూడా సంకోచించలేదు ఆయన. గాస్ ధర మరో పాతిక రూపాయలు పెరిగినపుడు కూడా ఆ భారాన్ని కూడా ప్రభుత్వమే మోసింది.
ఇక వైఎస్ అంటే గుర్తుకొచ్చేది జలయజ్ఞం. సుమారు ఎనభై వేలకోట్ల రూపాయల అంచనాలతో రాష్ట్రంలోని మూడు ప్రాంతాలను సస్యశ్యామలం చేసేవిధంగా ఒకేసారి నలభైకి పైగా నీటి ప్రాజెక్టులకు రూపకల్పన చేశారు. నలభై ఏళ్ళనుంచి మూలపడిన పోలవరం ప్రాజెక్టుకు ప్రాణం పోశారు. ఆయన మరో పదేళ్లు జీవించి ఉంటే కనీసం పది పదిహేను సాగునీటి ప్రాజెక్టులు పూర్తి అయ్యి ఉండేవి. ఆయన రైతులకు చేసిన మేలు అప్పటివరకూ ఏ ముఖ్యమంత్రి కూడా చెయ్యలేకపోయాడు. అందుకే వైఎస్ అనగానే రైతుబాంధవుడు అనే పదం జ్ఞప్తికొస్తుంది.
చివరిరోజు రచ్చబండ కార్యక్రమానికి వాతావరణం అనుకూలించకపోయినప్పటికీ అక్కడ మాట ఇచ్చాము అని ఒకే ఒక పట్టుదలతో భద్రతాధికారులు వారిస్తున్నప్పటికీ వినకుండా చిత్తూర్ జిల్లాలో ఒక గ్రామంలో పాల్గొనడానికి వాయుమార్గాన వెళ్తూ మధ్యలో ప్రమాదానికి గురై పంచభూతాల్లో కలిసిపోయారు. ఆయన మరణవార్త విని వందలాది గుండెలు ఆగిపోయాయి. తమ కుటుంబపెద్ద మరణించారేమో అన్నట్లు రాష్ట్రప్రజలు భోరున విలపించారు.
చరిత్రలో వేలాదిమంది రాజులు పాలించారు. కానీ, ఒక శ్రీకృష్ణదేవరాయలు, ఒక చంద్రగుప్తుడు, ఒక ఝాన్సీ లక్ష్మీబాయి, ఒక రుద్రమదేవి, ఒక శాతవాహనుడు, ఒక ప్రతాపరుద్రుడు, ఒక అక్బర్ గుర్తున్నట్లుగా ఎంతమంది గుర్తున్నారు? ఎంతో మంది మహామంత్రులు రాజాస్థానాల్లో పనిచేసారు. కానీ, ఒక చాణక్యుడు, ఒక తిమ్మరుసు, ఒక యుగంధరుడు, ఒక రాక్షసమంత్రి లా ఎంతమంది మంత్రులు గుర్తున్నారు? బ్రిటన్ నుంచి ఎంతోమంది కలెక్టర్లు, అధికారులు, రాజప్రతినిధులు ఈ దేశంలో పనిచేసారు.
కానీ, ఒక ఆర్ధర్ కాటన్, ఒక బ్రవున్, ఒక మౌంట్ బాటన్ తప్ప ఎంతమందిని మనం ఈరోజుకూ గుర్తు చేసుకుంటున్నాము? అలాగే రాజకీయాల్లో ఎంతోమంది గొప్పగొప్ప నాయకులు, మేధావులు ఈ దేశాన్ని పాలించారు. కానీ, వైఎస్సార్ లా ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయేవారు ఎందరు? నభోమండలంలో సూర్యచంద్రులు ప్రరిభ్రమిస్తున్నంతకాలం వైఎస్ కీర్తిచంద్రికలు రెపరెపలాడుతుంటాయి.
డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి మరణించి నేటికి పదకొండు సంవత్సరాలు నిండాయి. ఈ సందర్భంలో ఆ మహానాయకుడుని తలచుకుని నివాళులు అర్పిద్దాం.
వైఎస్సార్ అమర్ రహే!
ఇలపావులూరి మురళీ మోహన రావు
సీనియర్ రాజకీయ విశ్లేషకులు