Home TR Exclusive Ilapavuluri Murali Mohan Rao వైజాగ్ రాజధానిగా జగన్ సంకల్పం నెరవేరదా?

వైజాగ్ రాజధానిగా జగన్ సంకల్పం నెరవేరదా?

విశాఖపట్నం అంటే అది ఒక సుందరనగరమని, నయానందకరమైన సాగరం,   నాలుగైదు బీచ్ లు, అతి పురాతనమైన భీమిలి బీచ్, వంద కిలోమీటర్ల దూరంలో ప్రకృతి సౌందర్యానికి నిలయమైన అరకు లోయ, బొర్రా గుహలు, ఇక రాష్ట్రానికే తలమానికమైన ఉక్కు కర్మాగారం, అంతర్జాతీయ విమానాశ్రయం, అతి పెద్ద రైల్వే స్టేషన్, నౌకాశ్రయం…  విశాలమైన రోడ్లు…తక్కువ ఉష్ణోగ్రత, తక్కువ జనాభా, ఐటి కంపెనీలకు ఆలవాలం…..ఇదీ విశాఖ మీద ప్రజలకు  ఉన్న అభిప్రాయం.  ఆంధ్రప్రదేశ్ మొత్తంలో పూర్తిగా అభివృద్ధి చెందిన నగరం విశాఖపట్నం ఒక్కటే.  అక్కడ రాజధానిని ఏర్పాటు చేస్తే లక్షలకోట్ల ఖర్చుతో మరొక మహానగరం నిర్మించాల్సిన అగత్యం తప్పుతుందని భావించి అమరావతిని మూడు భాగాలుగా విభజించి పాలనారాజధానిగా విశాఖపట్నంను నిర్ణయించారు ముఖ్యమంత్రి జగన్.  
 
 
అదేమిటో తమాషా….విశాఖకు రాజధానిని తరలిస్తామని జగన్ ప్రభుత్వం ప్రకటించిన మరుక్షణమ్ నుంచి విశాఖలో అగ్నిప్రమాదాలు ఎక్కువ అయ్యాయి.  గాస్ లీక్ అవుతున్నది…రసాయనాలు నిల్వ ఉంచిన డ్రమ్ములు పేలిపోతున్నాయి… దట్టమైన పొగలు అయిదారు కిలోమీటర్ల దూరానికి విస్తరిస్తున్నాయి…జనమంతా అర్ధరాత్రి రోడ్లమీద ఆర్తనాదాలు చేస్తూ పరుగులు తీస్తున్నారు….రాజకీయ రాబందులు క్షణాల్లో వాలిపోతున్నాయి..జగన్ ప్రభుత్వాన్ని తూర్పారబడుతున్నాయి.  నష్టపరిహారం కోసం డిమాండ్స్ పెరుగుతున్నాయి..ఇక పార్కుల్లో, బీచ్ లో ఉదయపు నడక నిర్వహించే కొందరు వృద్ధుల ముందు పచ్చగొట్టాలు నిక్కబొడుచుకుంటున్నాయి.  వారంతా క్రోధావేశంతో రాజధాని ఇక్కడకు రావడానికి వీల్లేదని పళ్ళు నూరుతున్నారు.. అక్కడితో ఆగితే ఇక అవి పచ్చగొట్టాలు ఎందుకవుతాయి?  పచ్చవైరస్ సోకిన అన్ని ఛానెల్స్ ” విశాఖ అగ్నిగుండం అవుతుందా?  విశాఖ విషపూరితం అవుతుందా?  ఈ నగరానికి ఏమైంది?,   అగ్నికీలల్లో విశాఖ…”  అంటూ హారర్ సినిమా  టైప్ కాప్షన్స్ తో పచ్చకామెర్లు సోకినవారందరినీ చర్చలకు పిలిచి, వారిచేత “విశాఖ పనికిరాదు…పనికి రాదు ….అమరావతియే బెస్ట్…”  అంటూ బల్లలు గుద్దిస్తూ  రోజంతా ప్రజలను భయభ్రాంతులకు గురి చెయ్యడానికి సకలశక్తులు ఒడ్డుతున్నాయి.   ఇక టీవీ ఆంకర్స్ కూడా తాము ఉద్యోగులమనే సంగతి విస్మరించి అచ్చంగా తెలుగుదేశం విషం ఎక్కించుకున్నవారి మాదిరిగా పూనకాలెత్తుతున్నారు!    
 
 
 గత పదిహేను ఇరవై ఏళ్లలో విశాఖలో ఇలాంటి పేలుళ్ల వార్తలు విన్నది చాలా తక్కువ.  ఎప్పుడో 1998 లో ఏదో ఒక ప్రమాదం జరిగిందట…కానీ, ఇలా వరుస ప్రమాదాలు జరగడం…అదికూడా రాజధాని రాబోతున్నదని ప్రకటన వెలువడిన తరువాత మాత్రమే జరగడం భలే విచిత్రంగా లేదూ?  ఎక్కడైనా మండే ఎండాకాలంలో మురికివాడల్లో అగ్నిప్రమాదాలు జరగడం సహజం.  కానీ, వర్షాకాలంలో కూడా కోట్లరూపాయల పెట్టుబడులతో అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటూ నిర్వహించే కర్మాగారాల్లో కూడా ప్రమాదాలు జరగడం వింతే మరి! 
 
సాధారణంగా తమ ప్రాంతానికి, తమ నగరానికి ఒక పెద్ద కంపెనీ, ఒక పెద్ద ఐటి ఆఫీస్, ఒక పెద్ద బస్ స్టాండ్,  ఒక మునిసిపల్ ఆఫీస్, ఒక పెద్ద బ్యాంకు, షాపింగ్ మాల్ లాంటివి వస్తాయని వార్తలు వస్తే అక్కడి జనమంతా విపరీతంగా సంతోషిస్తారు.  తమ ప్రాంతపు ఆస్తుల విలువలు పెరుగుతాయని, కనీస సౌకర్యాలు పెరుగుతాయని, అభివృద్ధికి నోచుకుంటుందని భావిస్తారు.  అలాంటిది ఏకంగా ముఖ్యమంత్రులు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఉన్నతాధికారులు కొలువుదీరే రాజధానే దిగివస్తుందంటే ఆ ప్రాంతప్రజలు ఎగిరి గంతులు వేస్తారు.  తమ ప్రాంతం నుంచి రాజధాని వెళ్ళిపోతున్నదని గత రెండు వందల రోజులుగా అమరావతి వాసులు ఆందోళనలు (డ్రామాలు అంటారు కొందరు) చేస్తున్నారు.  అమరావతిని అంగుళం కూడా కదలదని కొందరు తెలుగుదేశం, బీజేపీ నాయకులు గాండ్రిస్తున్నారు.  మరి అంత విలువైన రాజధాని తమ ముంగిట్లోకి వస్తున్నదంటే వద్దనే దద్దమ్మలు ఎవరైనా ఉంటారా?  
 
 
ఇక ప్రమాదాల దగ్గరకు వద్దాము.  కేవలం నెలరోజుల వ్యవధిలోనే మూడు ఫ్యాక్టరీల్లో అగ్నిప్రమాదాలు జరిగాయి.  మొన్నటి  ఎల్జీ పాలిమర్స్ ప్రమాదం నుంచి నిన్నటి పరవాడ ప్రమాదం వరకు వరుసబెట్టి ప్రమాదాలు జరగడం వెనుక కుట్ర ఉన్నదా అని చాలామంది అనుమానిస్తున్నారు.  గుడివాడ ఎమ్మెల్యే అమర్నాథ్ కూడా ఈ అగ్నిప్రమాదాల వెనుక రాజధానిని నిలువరించే కుట్ర ఉన్నదని ఆరోపిస్తున్నారు.  సామాన్య పౌరులు కూడా ఇలా వరుసగా ప్రమాదాలు జరగడం పట్ల సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.  ఈ ప్రమాదాలపై సిబిఐ తో విచారణ జరిపించాలి.  
 
ఇక ప్రమాదాలు జరిగాక ప్రభుత్వం అతివేగంగా స్పందించడం అభినందనీయం.  ఎల్జీ పాలిమర్స్ ప్రమాదంలో మరణించినవారికి అడగకుండానే కోటి రూపాయల నష్టపరిహారం ప్రకటించి ప్రత్యర్థి పార్టీలను దిగ్భ్రాంతిలో ముంచెత్తిన జగన్….కంపెనీ డైరెక్టర్లను రక్షిస్తున్నారన్న విమర్శకుల నోళ్లు మూయిస్తూ పన్నెండు మంది డైరెక్టర్లను, అధికారులను అరెస్ట్ చేయించి ప్రతిపక్షుల నోళ్లకు సీళ్లు వేశారు. బాధితులకు అత్యుత్తమమైన వైద్యాన్ని అందించి శెభాష్ అనిపించుకున్నారు.    
 
 
అయితే రాజధానిని తరలించకుండా ఎవరెన్ని కుతంత్రాలు చేసినా, అభ్యంతరాలు వ్యక్తం చేసినా, న్యాయస్థానాలకు వెళ్లినా, విజయదశమి నాటికి రాజధానిని విశాఖకు తరలించాలని ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉన్నట్లు సమాచారం.  కరోనా లేకుండా ఉంటె మొన్న ఉగాది నాటికే రాజధాని తరలిపోయి ఉండేది.  అక్టోబర్ నాటికి కరోనా ఉధృతి తగ్గుముఖం పడితే రాజధానిగా విశాఖ అవుతుందనడంలో సందేహం లేదు.  ఇప్పటికే అక్కడ అన్ని ఏర్పాట్లు చకచకా జరిగిపోతున్నాయి.  
 
జగన్ ఒకసారి  సంకల్పించిన తరువాత అది కొన్ని కారణాల వలన వాయిదా పడొచ్చేమో కానీ ఆగడం మాత్రం జరగదు అని ఆయన తత్త్వం తెలిసినవారి మనోగతం!  
 
 
ఇలపావులూరి మురళీ మోహన రావు 
సీనియర్ రాజకీయ విశ్లేషకులు 
- Advertisement -

Related Posts

ప్రభుత్వానికి అతి పెద్ద ఊరట ఇచ్చిన హైకోర్టు 

పుడో రెండున్నరేళ్లక్రితం జరగాల్సిన స్థానికసంస్థల ఎన్నికలను నాటి చంద్రబాబు ప్రభుత్వం పట్టించుకోలేదు.  ఎందుకంటే అప్పటికే ప్రజల్లో తమ ప్రభావం క్షీణించిందని వారికి ఆనాడే సందేహం కలిగింది.  ప్రభుత్వ సందేహాలతో పనిలేకుండా, ఎన్నికలు జరిపించాల్సిన...

చరిత్ర సృష్టిస్తున్న జగన్మోహన్ రెడ్డి

కృష్ణా పుష్కరాల సమయంలో అభివృద్ధి పేరుతో సుమారు నలభై ఆలయాలను చంద్రబాబు ప్రభుత్వం కూల్చేస్తున్న దృశ్యాలు చూసి చలించిన ఒక తెలుగుదేశం నాయకుడు నాకు ఫోన్ చేసి "మా వినాశనం మొదలైంది. చంద్రబాబుకు...

సుప్రీం కోర్టు చెప్పిన విలువైన పాఠాలు

సందర్భం వేరు కావచ్చు.  కేసు వేరు కావచ్చు...కానీ సెంట్రల్ విస్టా కేసు విచారణ సందర్భంగా అత్యున్నత న్యాయస్థానం చేసిన వ్యాఖ్యలు న్యాయచరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగినవి అని చెప్పాలి.  న్యాయమూర్తి పదవి అంటే  ఒక...

Latest News