తెలుగుదేశం దిగజారుడుకు పరాకాష్ట !

Chandra Babu Naidu and Ramesh Hospital Fire accident
విజయవాడ నగరంలోని  కార్పొరేట్ ఆసుపత్రి రమేష్ హాస్పిటల్స్ వారు హోటల్ స్వర్ణ పాలస్ లో నిర్వహిస్తున్న కోవిద్ సెంటర్ లో జరిగిన అగ్నిప్రమాదంలో పదిమంది రోగులు మరణించడం దేశాన్నే దిగ్భ్రాంతికి గురిచేసింది.  అయితే ప్రమాదాలు జరగడం సహజమే.  కానీ, ప్రమాదం జరిగిన తరువాత, మన నిర్లక్ష్యం కారణంగా కొందరు అమాయకులు బలి అయిన తరువాత  ఎలా స్పందించాము అనే అంశాన్ని నాగరిక సమాజం పరిశీలిస్తుంది.  రాష్ట్రంలోని అనేకప్రాంతాల్లో అనేక ప్రమాదాలు జరిగి చాలామంది మరణించినపుడు ప్రతిపక్ష తెలుగుదేశం ఎలా స్పందించింది?  విజయవాడలో జరిగిన ఘోరప్రమాదం మీద ఎలా స్పందించింది అనే విషయాన్ని ప్రజలు బేరీజు వేస్తారు.  ఇతర ప్రాంతాల్లో జరిగిన ప్రమాదాల మీద అతి తీవ్రంగా స్పందించడమే కాక, బాధ్యులను అరెస్ట్ చెయ్యాలని, యాభై లక్షలు, కోటి రూపాయలు నష్ట పరిహారం ఇవ్వాలని,  ఆ కంపెనీలను మూసెయ్యాలని, మంత్రులు, జగన్ కూడా రాజీనామా చెయ్యాలని రంకెలు వేసిన చంద్రబాబు, ఆయన పార్టీ నాయకులు రమేష్ ఆసుపత్రి వ్యవహారంలో మాత్రం పూర్తిగా సైలెంట్ అయిపోయారు.  దేనికి?  ఆ ఆసుపత్రి తెలుగుదేశం పార్టీ వారికి సంబంధించినదిట.  అలాగే ఆసుపత్రి యజమానులు కమ్మ సామాజికవర్గం  వారట! 
 
Chandra Babu Naidu and Ramesh Hospital Fire accident

పరారీలో రమేష్ పోతినేని …. 

నిజానికి రోగులు ఎవరైనా ఏదైనా ఆసుపత్రికి వెళ్లాలంటే ఆ ఆసుపత్రి యజమానుల కులం, మతం చూడరు.  వారికి ఎక్కడ ఉత్తమ చికిత్స జరుగుతుందనుకుంటే అక్కడికి వెళ్తారు.  అలాగే రమేష్ ఆసుపత్రి కూడా ఆంధ్రప్రదేశ్ లో చెప్పుకోదగిన కార్పొరేట్ ఆసుపత్రులలో ఒకటి.  అక్కడ చికిత్సకు అయ్యే ఖర్చు ఎక్కువైనా, మంచి వైద్యం లభిస్తుందనే పేరుంది. అలాగే డాక్టర్ రమేష్ పోతినేనికి కూడా సమాజంలో గౌరవం ఉంది.  అలాంటి ఆసుపత్రిలో ప్రమాదం జరిగి, పదిమంది ప్రాణాలు పోయినపుడు డాక్టర్ రమేష్ తన గౌరవం మంటగలిసేవిధంగా పోలీసులకు దొరకకుండా పారిపోవడం అత్యంత ఘోరం కాదా?  నిజానికి ఉగ్రవాదులు, తీవ్రవాదులు, మావోయిస్టులు, నరహంతకుల ఆచూకీ చెబితే బహుమతి ఇస్తామని ప్రభుత్వాలు ప్రకటించడం గతంలో విన్నాము. కానీ, ఒక ఉన్నత విద్యావంతుడి ఆచూకీ చెబితే లక్షరూపాయలు బహుమతి ఇస్తామని నగర పోలీసులు ప్రకటించారంటే దానిని మించిన అవమానం ఆయనకు మరొకటి ఉంటుందా?  
 
ఇక ఈ విషయానికి తెలుగుదేశం పార్టీ కులం రంగును పులమడానికి ప్రయత్నించడం చూస్తుంటే అసలు మనం ఆధునికయుగంలో ఉన్నామా లేక ఆదిమానవుల యుగంలో ఉన్నామా అనే సందేహం కలుగుతుంది.  “కమ్మవారిమీద ప్రభుత్వం కక్ష సాధిస్తున్నది’ అనే నీచమైన ఆరోపణలకు తెగబడుతున్నారు చంద్రబాబు, ఆయన పార్టీ నాయకులు.  రాష్ట్ర రాజకీయాల్లో కులాభిమానం అనేదాన్ని కులగజ్జిగా మార్చి కులపరంగా సమాజాన్ని చీల్చడం చంద్రబాబుతోనే మొదలైంది.  అసలు చంద్రబాబు రాజకీయ జీవితానికి పునాది కూడా కులగజ్జితోనే మొదలైంది.  “చంద్రబాబు కాలేజీలో చదువుతునప్పుడు తన కులం వారిని వెంటేసుకుని తిరుగుతుండేవాడు” అని ఆ మధ్య ఎవరో అన్నారు.   ఎన్టీఆర్ ఉన్నంతకాలం తెలుగుదేశం పార్టీలో అన్ని కులాలవారికి గౌరవం దక్కింది.  బీసీలను, ఎస్సీలను ఎన్టీఆర్ ఎక్కువగా ప్రోత్సహించి వారికి రాజకీయంగా అనేక అవకాశాలను కల్పించారు.   కానీ, చంద్రబాబు తెలుగుదేశం పార్టీని చెరపట్టిన తరువాతనే కమ్మవారి ఆధిపత్యం మొదలైంది.  బాగా ధనవంతులైన కమ్మవారిని చంద్రబాబు చేరదీసి, ధనబలం లేని ఇతర కులాలవారిని అణచివేశారు చంద్రబాబు.  ముఖ్యంగా బ్రాహ్మణకులస్తులు అంటే చంద్రబాబుకు మహా అసహ్యం.  అందుకే ఆయన తన పార్టీలో బ్రాహ్మణులకు ఎమ్మెల్యే, ఎంపీ టికెట్లు ఇవ్వరు.  ఆయన అధికారంలో ఉన్నప్పుడు కమ్మకులం వారికే అనేక అవకాశాలు కల్పించారు.  కీలకమైన పోస్టుల్లో కమ్మ కులానికి చెందిన అధికారులను నియమించారు.     చంద్రబాబు దన్ను చూసుకుని కొందరు కమ్మ సామాజికవర్గం వారు ఇతర కులాలవారిని హీనంగా చూడటం మొదలుపెట్టారు.  చంద్రబాబు దుర్మార్గ విధానాల వల్లనే కమ్మకులం వారిని ఇతర కులస్తులు శత్రువులుగా చూడటం మొదలైంది. 

కమ్మ సామాజికవర్గం వారు ఆత్మగౌరవానికి ప్రతీకలు 

వాస్తవం చెప్పుకోవాలంటే కమ్మ సామాజికవర్గం వారు ఆత్మగౌరవానికి ప్రతీకలు.  ఆంధ్రప్రదేశ్ లో రాజకీయాధికారం అంతా రెడ్డి కులస్తుల చేతిలో దశాబ్దాల తరబడి కొనసాగినా, వారు రాజకీయాల కంటే ఆత్మగౌరవానికి, సమాజాభివృద్ధికి ప్రాధాన్యత ఇచ్చారు.  వ్యాపార రంగంలో రాణించారు.  పరిశ్రమలు, సినిమారంగంలో, వ్యవసాయరంగంలో కమ్మ సామాజికవర్గం వారిదే ప్రధానపాత్ర.  వారు నిజాయితీపరులు.  వారు సంపాదించుకున్నారు.  వేలాదిమందికి ఉపాధి కల్పించారు.  స్వయంకృషితో రాష్ట్రాన్ని, దేశాన్ని కూడా అభివృద్ధి చేశారు.  ఇతర కులస్తులను ఎంతో గౌరవించారు.  అలాగే అన్ని కులాలవారు అభిమానాన్ని చూరగొన్నారు.  తమ వితరణతో అనేక విద్యాసంస్థలకు ప్రాణం   పోశారు.  భూరి విరాళాలను ఇచ్చారు.  కాలేజీలను కట్టించారు.  కులవిద్వేషం వారిలో ఎప్పుడూ లేదు.  కానీ, చంద్రబాబు వచ్చిన తరువాతనే కమ్మవారిలో విద్వేషాన్ని రెచ్చగొట్టారు.  ఇతర కులస్తుల పట్ల చిన్నచూపు ఏర్పడటానికి చంద్రబాబు చెయ్యని ప్రయత్నం లేదు.  ఆ ప్రయత్నాల్లో ఆయన సఫలం అయ్యారు కూడా.  ఒకప్పుడు తమ కులానికి సమాజంలో ఎంతటి గౌరవాభిమానాలు ఉన్నాయో ఈనాటి కమ్మ యువతరానికి తెలియకపోవచ్చు.  
 
ఇక డాక్టర్ రమేష్ విషయానికి వస్తే కమ్మ కులస్తులు కాబట్టే ప్రభుత్వం వారిని వెంటాడుతున్నదని కొందరు తెలుగుదేశం నాయకులు నోళ్లు పారేసుకుంటున్నారు.   ఒక నేరానికి బాధ్యులైన వ్యక్తి పోలీసులకు సహకరించకుండా పారిపోతే, అతన్ని పట్టుకోవడానికి ప్రయత్నించడం కక్ష సాధింపు అవుతుందా?  ఏ నేరమూ చెయ్యకపోతే డాక్టర్ రమేష్ ఎందుకు దొంగలాగా పోలీసులకు దొరకకుండా పారిపోయారు?  ఒక నిందితుడిని పట్టుకోవడానికి ప్రయత్నిస్తున్న పోలీసులకు సహకరించకుండా, తమ కులంవాడని నిందితుడిని వెనకేసుకొని రావడం ఎలాంటి రాజకీయం?  నేరాలకు కులమతాలు ఉంటాయా?  మొన్న జెసి ప్రభాకర రెడ్డిని, ఆయన కొడుకుని అరెస్ట్ చేసి  రెండు నెలలు జైల్లో పెట్టారు.  వాళ్ళు కమ్మ కులస్తులు కారే!  

చంద్రబాబు కమ్మ సామాజికవర్గం వారికి భారంగా ?!

Nara Chandra Babu Naidu

చంద్రబాబుకు ఏమాత్రం నిజాయితీ ఉన్నా, డాక్టర్ రమేష్ ఎక్కడున్నా పోలీసులకు లొంగిపోవాలని సలహా ఇవ్వాలి.  అలాగే ఆయన ఆచూకీని పోలీసులకు తెలియజేసి విచారణకు సహకరించాలి.  చంద్రబాబు లాంటి అధమస్థాయి నాయకుల కారణంగా ఇప్పటికే కమ్మ సామాజికవర్గం వారంటే మిగిలిన కులాల్లో ఒక ఏహ్యభావం స్థిరపడిపోయింది.  కమ్మవారిని చూస్తేనే దూరంగా జరిగే దుస్థితి నెలకొంది.  ఎవరో కొంతమంది అవినీతిపరులను చూసి లక్షలాదిమంది కమ్మవారిని అనుమానించే పరిస్థితి ఏర్పడింది.  చంద్రబాబు కమ్మ సామాజికవర్గం వారికి భారంగా మారాడని, ఆయన వలన కమ్మకులం పరువు మంటగలిసిందని ఆయన పార్టీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ వ్యాఖ్యానించారంటే స్వకులంలో కూడా చంద్రబాబును ఎంత అసహ్యించుకుంటున్నారో అర్ధం చేసుకోవచ్చు. త్వరలో వారంతా చంద్రబాబును బహిష్కరించి మరొక ఉత్తముడిని పార్టీ అధినేతగా ఎన్నుకున్నా మనం ఆశ్చర్యపోనవసరం లేదు. దీనికి ముమ్మాటికీ చంద్రబాబు అనుసరిస్తున్న క్షుద్ర రాజకీయాలే కారణం!   
 
 
 
ఇలపావులూరి మురళీ మోహన రావు 
సీనియర్ రాజకీయ విశ్లేషకులు