చంద్రబాబు కథ క్లైమాక్స్ కు చేరిందా?

Nara Chandra Babu Naidu
ఒకప్పుడు ఆయన నోరు మెదిపితే వీధి రిపోర్ట్రర్ నుంచి జాతీయమీడియా వరకు ప్రతిధ్వనించేది.  సవతి అత్తగారు లక్ష్మీపార్వతిని భూతంలా చూపించి పిల్లనిచ్చిన మామగారి వెన్నులో పిడిబాకును దింపి ప్రాణాలను హరించి చెరపట్టిన అధికారలక్ష్మిని అడ్డం పెట్టుకుని జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పిన చాణక్యుడిగా, యుగంధరుడిగా వందిమాగధులచే కైవారాలు అందుకుని, అడుగు పెడితే ప్రత్యేక విమానమే తప్ప మరొక వాహనం ఎరుగనంత బిజీ అని కీర్తింపబడి, ఢిల్లీ రాజకీయాల్లో వేలు పెట్టి దేవెగౌడ, ఐకే గుజ్రాల్, ములాయంసింగ్ యాదవ్, మాయావతి, ఉమాభారతి, లాలూ ప్రసాద్ యాదవ్, కరుణానిధి, మురసోలి మారన్, నితీష్ కుమార్, అటల్ బిహారి వాజపేయి, అద్వానీ, ప్రమోద్ మహాజన్, శరద్ పవార్, సంగ్మా, లాంటి అనేకమంది యోధానుయోధుల ముందు కాలు మీద కాలు వేసుకుని ఠీవిగా వారికి సూచనలు చేస్తూ, సలహాలు ఇస్తూ…కురిపించిన ఆ హొయలు, దర్జాలు, అహో…నిఖిల ప్రపంచం మరువగలదా?  ఇక కమ్యూనిస్ట్ పార్టీ నాయకులకు ఇచ్చిన విలువను గూర్చి చెప్పుకోవాలంటే వారికంటే తన బాహుమూలాల్లోని రోమాలకు ఇచ్చిన విలువ చాలా ఎక్కువ అని చెప్పుకోవచ్చు.  
 
 
అయితే చంద్రబాబు స్థాయి కేవలం జాతీయం వరకే అనుకుంటే మనం తెగిన చెప్పులు వేసుకున్నట్లే…ఎందుకంటే శ్రీవారి పరాక్రమం సముద్రాలు దాటి సింగపూర్ మంత్రులు, సాక్షాత్తూ అమెరికా అధ్యక్షులు, వారి శ్రీమతులు,  వారితో విందులు, సరససల్లాపాలు…అబ్బో….అవి మామూలు రోజులా?  “నా ముఖం చూసి సింగపూర్ వారు టెక్నాలజీ ఇస్తామన్నారు…నాతో ఉన్న సాన్నిహిత్యం చూసి అమెరికా వారు పరిశ్రమలు పెడతామన్నారు…నా మాట మీద విశ్వాసంతో రష్యావారు ముందుకొచ్చారు…”  లాంటి లక్ష్మణకుమార ప్రగల్భాలు వినివిని పరవశించని దినం ఉన్నదా?  అప్పట్లో చంద్రబాబు ఢిల్లీ వస్తున్నారంటే వాజపేయి, అద్వానీ తదితరులు గజగజా వణికిపోయేవారట!  “చంద్రబాబు గారు వస్తున్నారు.  ఎందుకొస్తున్నారో ఏమో……ఆయన ఏమి అడిగితే ఆ పని చేసిపెట్టండి” అని వాజపేయి ముందుగానే అధికారులకు, మంత్రులకు ఆదేశాలు జారీ చేసేవారట!    ఢిల్లీ విమానాశ్రయం నుంచి నేరుగా ఎలాంటి అనుమతులు, చెకింగులు లేకుండానే వాజపేయి ఆఫీసులోకి వెళ్లేంత చనువు, దర్జా ఆరోజుల్లో చంద్రబాబు వెలగబెట్టేవారు!  
 
 
” ఇక దేవెగౌడను, గుజ్రాల్ ను నేనే ప్రధానమంత్రులు చేశాను…వాజపేయికి నేనే అవకాశం ఇచ్చాను .. అబ్దుల్ కలాం ను నేనే రాష్ట్రపతిని చేశాను…అంబేద్కర్ కు నేనే భారతరత్నను ఇప్పించాను లాంటి స్వకుచమర్దనలకు ఆకాశమే హద్దు!  ఈ దేశంలోకి  ఐటి తెచ్చింది నేనే…సెల్ ఫోన్ తెచ్చింది నేనే.. కంప్యూటర్ ను తెచ్చింది నేనే….హైద్రాబాద్ ను కట్టింది నేనే…సత్య నాదెండ్లను సీఈవో కావడానికి కారణం నేనే…అమెరికాలో తెలుగువాళ్లు బతకడానికి కారణం నేనే…హైటెక్ సిటీని కట్టింది నేనే…మెట్రో రైల్ వేసింది నేనే…సైబరాబాద్ ను కట్టింది నేనే…హైదరాబాద్ ను ప్రపంచపటం లో పెట్టింది నేనే…”  ఇలాంటి చమత్కారవిశేషాలకు అంతూ పొంతూ లేదు.  
 
 
ఇద్దరు కరుడుగట్టిన కులగజ్జి జీవులు రామోజీరావు, రాధాకృష్ణ చంద్రబాబు అవివేకాన్ని, స్వార్ధగుణాన్ని, స్వోత్కర్షల బలహీనతలను బాగా కనిపెట్టారు.  దాంతో చంద్రబాబు అరికాళ్ళ మీద దురదను గీరుతూ హాయిని గొల్పుతూ అవినీతి, దోపిడీలకు తెర తీశారు.  ఆ సామాజికవర్గం వారు కేవలం పాలించడానికే పుట్టారు…వారిలో చంద్రబాబు పూర్వజన్మలో శ్రీకృష్ణదేవరాయల పోలిన సమర్ధుడు, కాబట్టి చంద్రబాబు రాబోయే పాతికేళ్లవరకు ముఖ్యమంత్రిగా ఉంటారు అంటూ డప్పులు, డిండిమములు,  ఢమరుకాలు, కాహళాలు, బాజాలు భేరీలు, యథేచ్ఛగా వాయించి జనం మెదళ్లను తొలిచేశారు.  చంద్రబాబు ఎంత అవినీతికి పాల్పడినా, ఎన్ని కోట్లరూపాయలు దోచుకున్నా, తన పార్టీవారికి ప్రజాధనాన్ని ఎంత దోచిపెట్టినా, రెండు ఎకరాలనుంచి లక్షలకోట్ల ఆస్తులకు ఎగబాకినా చంద్రబాబును “నిప్పు” గా చూపించడానికి తమ జీవితం మొత్తాన్ని ధారపోశారు.  కిరసనాయిలు, పచ్చళ్ళు అమ్ముకునేవారు కూడా పత్రికాధిపతులై, వేలకోట్లకు పడగలెత్తి రాజకీయాలను శాసించే స్థాయికి ఎదిగారు!   
 
 
ఇక రాష్ట్రం విడిపోయాక చంద్రబాబు అనుభవాన్ని నమ్మి జనం అధికారాన్ని కట్టబెడితే ఆయన మోసం చెయ్యడంలో తన విశ్వరూపాన్ని ప్రదర్శించారు.  లక్ష కోట్ల రూపాయల రాజధాని, సింగపూర్, జపాన్, టోక్యో, రష్యా, లండన్ అంటూ పట్టపగలే చందమామను చూపించారు.  ఆ రెండు క్షుద్రపత్రికలు లంబు జెంబుల్లా నవనగరాలు, భారీపరిశ్రమలు, లక్షలమందికి ఉద్యోగాలు వచ్చినట్లే ప్రజలను భ్రమల్లో ముంచెత్తెయ్యడంలో  ఈ రెండు పత్రికలు ప్రదర్శించిన ప్రతిభాపాటవాలు,  చంద్రబాబుకు చక్కభజన చేసిన విధానం నభూతో నభవిష్యతి.   ఇక చంద్రబాబు అమరావతిని రాజధానిగా చెయ్యడంలో కూడా తన సామాజికవర్గం వారు అధికంగా ఉన్న ప్రాంతంలో వారిని తిరుగులేని ఆర్థికశక్తులుగా తయారు చెయ్యడం, మిగిలిన అన్ని కులాలవారిని తొక్కిపారేయ్యడం తప్ప మరొక కారణం ఉందా?  2050  వరకు చంద్రబాబే ముఖ్యమంత్రిగా ఉంటాడని వదరుతూ, పరమశుంఠా, నిరక్షరకుక్షి అయిన ఆయన కొడుకును మహామేధావిగా చిత్రించి ప్రజలనెత్తిన ఆముదాన్ని రుద్దినట్లు రుద్దటానికి ఆ రెండు పత్రికలు చేసిన కృషి అనన్యసామాన్యం.  చంద్రబాబు వీరి అండ చూసుకునే చెలరేగిపోయాడు.  తనను తానొక మహామేధావిగా ఊహించేసుకుని తన తరువాత కొడుకును ఆంధ్రప్రదేశ్ కు కింగును చెయ్యాలని బోలెడన్ని పధకాలను తయారుచేసుకున్నాడు!
 
 
అయితే ఏమి లాభం?  తానొకటి తలిస్తే దైవం మరొకటి తలచింది… నూరు గొడ్లను తిన్న రాబందు ఒక్క గాలివానతో గోవిందా’ అని సాధారణ గాలివానకాదు…వేయి తుఫానుల పెట్టుగా జగన్మోహన్ రెడ్డి అనే ఒక యువకెరటం సునామీలా విరుచుకుని పడటం, ఆ భయంకర సునామీలో చంద్రబాబు ఆశలన్నీ చెదిరిపోయాయి.  జగన్ సింహగర్జనకు నలభై రెండేళ్ల చంద్రబాబు అనుభవం కకావికలైపోయింది.  జగన్ ను జైల్లో పెట్టించడానికి చంద్రబాబు చెయ్యని కుతంత్రం లేదు.  బీజేపీతో స్నేహం నెఱపినన్నాళ్లు ఎప్పుడు ఢిల్లీ వెళ్లినా జగన్ కేసులగూర్చి కేంద్రమంత్రులతో చర్చించడం తో వృధా అయిపొయింది.  జగన్ కొట్టిన దెబ్బకు ఉండేలు దెబ్బ తిన్న కాకిలా చిగురుటాకులా వణికిపోయాడు అంత లావు చంద్రబాబు!  
 
 
డెబ్బై ఏళ్ళు దాటిన ఈ వయసులో చంద్రబాబు మాటకు చిల్లిగవ్వ విలువ లేకుండా పోయింది.   అయన జగన్ ను ఎంత విమర్శించినా, తిట్టిపోసినా, జనం నవ్వుకుంటున్నారు తప్ప ఏమాత్రం సరకు చెయ్యడం లేదు.  చంద్రబాబును చూస్తేనే జాతీయనాయకులు పారిపోతున్నారు.  తెలంగాణాలో ఛీ అనిపించుకుని చిరునామా కూడా కోల్పోయాడు.    ఆంధ్రప్రదేశ్ లో చావుదెబ్బ తిన్నాడు.    నమ్ముకున్న నాయకులంతా చంద్రబాబును నట్టేట ముంచి వెళ్లిపోతున్నారు.  బ్యాంకులకు వేలకోట్ల రూపాయలు ఎగ్గొట్టిన  కొందరు ఆర్థికఉగ్రవాదులను ముందుజాగ్రత్త చర్యగా బీజేపీలోకి చంద్రబాబే పంపించేశాడు.  “మోడీ ఆంధ్రప్రదేశ్ లో అడుగుపెడితే అరెస్ట్ చేస్తాను….మోడీ నాకు జూనియర్…పెళ్ళాన్ని వదిలేసినవాడు…”  అంటూ ఒకప్పుడు దుర్భాషలు ఆడిన చంద్రబాబు నేను మోడీ తనను క్రీగంట చూసినా జన్మధన్యం అని భావించే స్థితికి దిగజారిపోయాడు.  అవినీతిలో అగ్రగాములైన ఒకప్పటి తన మంత్రులను, అధికారులను వేటాడుతున్నది జగన్ ప్రభుత్వం.   ఇక జగన్ తో పోరాడటం చంద్రబాబు వలన అయ్యేపని కాదు అని స్పష్టం అవుతున్నది.   అవతల బీజేపీ తన పాదస్పర్శతో చంద్రబాబు శిరస్సును పునీతం చేస్తే తప్ప సమీప భవిష్యత్తులో చంద్రబాబు కూడా కటకటాలపాలు కావడం తధ్యం అంటున్నారు.  చంద్రబాబుకు రానున్నవి గడ్డురోజులు మాత్రమే అని రాజకీయ పరిశీలకుల అంచనా!  
 
“సాగినంతకాలం నా అంతవాడు లేడందురు…..సాగకపోతే ఊరిక చతికిలపడిపోదురు ”  ….కొసరాజు 
 
ఇలపావులూరి మురళీ మోహన రావు 
సీనియర్ రాజకీయ విశ్లేషకులు