“బలహీనుడిని బలవంతుడు కొడితే బలవంతుడిని భగవంతుడు కొడతాడు” అంటారు పెద్దలు. ఒకప్పుడు కళలకు కాణాచిగా వన్నెకెక్కిన సినిమారంగం రానురాను దిగజారిపోతూ కేవలం వారసులపాలిటి కల్పవృక్షంగా మారిపోయింది. 1940 ల కాలంలో నాటి నిర్మాతలు, దర్శకులు తమ కొడుకులతోనో, మేనల్లుళ్ళతోనో సినిమాలు తీద్దాం అనుకున్నట్లయితే అక్కినేని నాగేశ్వర్ రావు, నందమూరి తారకరామారావు, కృష్ణ, శోభన్ బాబు, కృష్ణంరాజు, ఎస్వీ రంగారావు, గుమ్మడి లాంటి మహానటులు సినిమారంగంలో కాలు పెట్టి ఉండేవారు కారు. దాసరి నారాయణరావు, బాలచందర్, జంధ్యాల, కోడి రామకృష్ణ లాంటి దర్శకులు ప్రతిభ అనేది ఎక్కడున్నా, గాలించి పట్టుకొచ్చి వెండితెరకు పరిచయం చేశారు. ఏమాత్రం సినిమా నేపధ్యం లేని అనేయకమంది హీరోలు, నటులు ఈరోజు వెండితెరను ఏలుతున్నారంటే ఆయా దర్శకులు ప్రతిభను గౌరవించడమే కారణం.
కానీ, 1980 కాలం వచ్చేసరికి సినిమారంగం మొత్తం కులపరంగా, కుటుంబపరంగా దుష్కీర్తి మూటగట్టుకుంది. వారసులు సినిమాల్లో నటించడంలో తప్పు లేదు. కానీ, కేవలం వారసులను హీరోలుగా నిలబెట్టడానికి కొందరు అగ్రనటులు, నిర్మాతలు, దర్శకులు ప్రతిభ కలిగినవారిని తొక్కేయ్యడం మొదలుపెట్టారు. దీనికి ఎన్టీఆర్ కూడా మినహాయింపు కాదు. బాలకృష్ణను హీరోగా నిలబెట్టడానికి సొంత తమ్ముడి కొడుకులను కూడా తొక్కేయ్యడానికి వెనుకాడలేదు ఆ మహానటుడు. ఇక నాగార్జునను హీరోగా నిలబెట్టడానికి అక్కినేని ఎన్ని ఫ్లాఫ్ సినిమాలు తీశారో అంతు లేదు. ఎన్టీఆర్, అక్కినేని తరం తరువాత కృష్ణ, శోభన్ బాబు, కృష్ణంరాజుల తరం వచ్చినప్పటికీ, అప్పటికే వారు పాత హీరోలుగా ముద్రపడ్డారు. ఒకేరకం నటన, ఒకేరకం డాన్సులు, హీరోకు, హీరోయిన్ కు మధ్యన నలభై ఏళ్ల వయోభేదం లాంటి అవలక్షణాలు పొటమరించాయి. అక్కినేని, నందమూరిల వయసుకు వారితో నాయికలుగా నటించిన శ్రీదేవి, జయసుధ, జయప్రద మొదలైన వారికి మధ్య కనీసం ముప్ఫయి అయిదు నుంచి నలభై ఏళ్ల వయసు తేడా ఉన్నది. హీరోల ముడుతలు పడిన ముఖాలు ఫ్రెష్ గా ఉన్న ఆ హీరోయిన్ల కు తండ్రుల్లా కనిపిస్తున్నప్పటికీ, కేవలం వారి నటనా నైపుణ్యం ఆ తేడాను కప్పేసింది.
1980 దాటేసరికి కృష్ణ, శోభన్ బాబు, కృష్ణంరాజు నడివయసు దాటేశారు. అలాంటి పరిస్థితిలో సినిమారంగంలోకి ఝంఝామారుతంలా ప్రవేశించి బాక్స్ ఆఫీస్ ను షేక్ చేసారు చిరంజీవి. ఆ తరువాత వారసులుగా బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ హీరోలుగా రంగప్రవేశం చేశారు. వారి తరువాత పవన్ కళ్యాణ్, జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్, దగ్గుబాటి రానా వారసత్వ నేపధ్యంతోనే హీరోలు అయ్యారు. అంతకుముందే నరేష్ మంచి హీరోగా పేరు తెచ్చుకున్నారు కానీ, ఆయన సినిమాలన్నీ లో బడ్జెట్ వి కావడంతో బాలయ్య, నాగార్జున, చిరంజీవిల స్థాయిలో పేరు రాలేదు. అప్పుడే రాజేంద్రప్రసాద్, రాజశేఖర్, సుమన్, భానుచందర్, సురేష్, కూడా మంచి అవకాశాలను చేజిక్కించుకున్నప్పటికీ, వారసత్వ బలంతో బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ ఎంత చెత్త సినిమాలు చేసినా, వారిని పత్రికలు ఆకాశానికి ఎత్తేవి. ఆ నాలుగు స్టార్ హీరోల పేర్ల పక్కన ఈ వారసత్వం లేని హీరోల పేర్లు చోటు చేసుకోవు.
అదే సమయంలో కులాల సమీకరణాలు కూడా మొదలయ్యాయి. ఒక సామాజికవర్గానికి చెందిన నిర్మాతలు కేవలం తమ సామాజికవర్గ హీరోలు, దర్శకులను మాత్రమే ప్రోత్సహించాయి. వారికోసం టాలెంట్ ను తొక్కేశారు. అప్పటినుంచి వారసత్వరోగం సినిమారంగాన్ని దరిద్రంలా పట్టేసింది. ఎంత అంటే…ఉదయకిరణ్, తరుణ్, శర్వానంద్, నిఖిల్, నాని లాంటి మంచి అందగాళ్ళైనా ..ప్రతిభ కలిగిన హీరోలకు అవకాశాలు రాకుండా కర్కశంగా తొక్కివేయడం జరిగింది. నాలుగైదు సినిమాలు చేసిన తరుణ్ పాతికేళ్ళు కూడా నిండకుండానే ఫేడ్ అవుట్ అయిపోయాడు. వరుసగా నాలుగు సూపర్ హిట్ సినిమాలు ఇచ్చిన ఉదయకిరణ్ సినిమాలు లేక డిప్రెషన్ కు గురై ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఇక శర్వానంద్, నిఖిల్, నితిన్, రామ్, గోపీచంద్, ఈదర నరేష్, బ్రహ్మాజీ లాంటి హీరోలు ఎన్ని సూపర్ హిట్ సినిమాలు చేసినా వారిగూర్చి పత్రికలు, వెబ్సైట్స్ ఒక్క మంచి పబ్లిసిటి ఇవ్వదు. ప్రస్తుతం వారి స్థాయి ఎక్కడుందో కూడా తెలియదు. వారు మరో పది హిట్స్ ఇచ్చినా సినిమారంగం వారిగూర్చి పట్టించుకోదు.
ఇక ఏ వారసత్వమూ లేకుండా సినిమారంగానికి వచ్చిన చిరంజీవి, కృష్ణ కూడా తమ వారసులను తెరమీదకు తెచ్చారు. చిరంజీవి కుటుంబం నుంచి ఏకంగా డజను మంది హీరోలు విచ్చేసారు. నందమూరి కుటుంబం నుంచి నలుగురైదుగురు వచ్చారు. కృష్ణ కుటుంబం నుంచి ఐదారుగురు వచ్చారు. అక్కినేని కుటుంబం నుంచి నలుగురు హీరోలు వచ్చారు. వెంకటేష్ కుటుంబం నుంచి ఇద్దరో ముగ్గురో వచ్చారు. వీరికి అనేక ఫేస్ సర్జరీలు చేయించి మూతులు, ముక్కులు, దవడలు మార్పించి, పొట్టలు కరిగించి, జనం మీదికి రుద్దినా, కోట్ల రూపాయలు ఖర్చు చేసినా, వీరికి ప్రేక్షకాదరణ కరువైంది. ఉదాహరణకు కళ్యాణ్ రామ్ ను చూడండి. ఇతగాడు ఇప్పటికి డజను పైగా సినిమాల్లో నటించాడు. ఒకటో రెండో తప్ప మిగతావేవీ నిర్మాతలకు లాభాలు తెచ్చిపెట్టలేదు . నాగార్జున కొడుకులుగా వచ్చిన నాగచైతన్య, అఖిల్ ఎంత పుషప్ ఇచ్చినా స్టార్ స్టేటస్ అందుకోలేకపోయారు. మోహన్ బాబు కుమారులుగా వచ్చిన మనోజ్, విష్ణు, మంచు లక్ష్మి కూడా ప్రజలను మెప్పించడంలో విఫలం అయ్యారు. వారసులుగా వచ్చిన వారిలో ఒక్క మహేష్ బాబు, రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్, ప్రభాస్,అల్లు అర్జున్ తప్ప మిగిలిన డజన్లకొద్దీ జనాన్ని జనం ఏమాత్రం ఆదరించలేదు. అయినప్పటికీ, వీరి తండ్రులు అభిమానసంఘాలవారిని పోషిస్తూ, తమ వారసుల సినిమాలకు జేజేలు కొట్టిస్తూ హీరోలుగా నిలబెట్టడానికి కోట్లాదిరూపాయలు ఖర్చు చేసి సినిమాలు నిర్మిస్తారు. సినిమా పత్రికలు వీరేదో మహానటులైనట్లు డప్పులు కొడుతుంటాయి. వీరందరిలో ఒక్క రవితేజ మాత్రమే కాస్త నిలదొక్కుకుని మంచి హీరో అనిపించుకున్నారు.
ఇక సినిమా హాళ్లు కూడా కేవలం నలుగురు పెద్దల కబంధహస్తాలలో చిక్కుకుని పోయాయి అని మనం ప్రతి చిన్న సినిమా విడుదల ముందు వింటున్నాము. వీరి సినిమా రిలీజ్ అంటే థియేటర్లో మంచి కలెక్షన్లతో ఆడుతున్న చిన్న హీరో సినిమాను నిర్దాక్షిణ్యంగా తీసేస్తారు. చిన్న హీరోల సినిమాలకు వీరి థియేటర్లు ఇవ్వరు. విపరీతమైన అద్దెలు చెబుతారు. ఫలితంగా చిన్న హీరోల సినిమాలు నగరంలో ఎక్కడో మారుమూల పరమ నాసిరకం థియేటర్లలో విడుదల అవుతాయి. ఆ సినిమాల గూర్చి ప్రేక్షకులకు తెలిసేలోగా కలిక్షన్లు లేక సినిమాను తీసేస్తారు. ఆ నలుగురు కారణంగా చిన్న సినిమాలకు చోటులేకుండా పోయింది అనే ఆరోపణ వుంది. ఇక ఆ నలుగురు ప్రభుత్వాన్ని కూడా ప్రభావితం చేసి టికెట్ ధరలు రెండింతలు మూడింతలు చేసి వేలాది థియేటర్లలో రోజూ అయిదారు ఆటలు ప్రదర్శించడానికి అనుమతులు తీసుకుని మొదటి వారంలోపే కోట్ల రూపాయలు కొల్లగొట్టేస్తారు. ఎంత పెద్ద హీరో సినిమా అయినా రెండోవారం కలెక్షన్లు జీరో.
వీరి దెబ్బకు యువతరం అనేది సినిమారంగానికి దూరం అయింది. ఎందరో ప్రతిభ కలిగినవారు ఫిలిం నగర్ లో కాలు పెట్టలేకపోతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఓటిటి విధానం ద్వారా చిన్న చిన్న హీరోల సినిమాలు విడుదల అవుతున్నాయి. అమెజాన్, నెట్ ఫ్లిక్స్ లాంటి మాధ్యమాల ద్వారా అనేక మంది ప్రతిభావంతులైన నటులు, దర్శకులు, రచయితలు వెలుగులోకి వస్తున్నారు. వీరంతా సినిమారంగం ప్రముఖులకు వారసులు కారు. వారి కుటుంబాలవారు కారు. స్వచ్ఛమైన కళాకారులు. వీరు నటించిన సినిమాలు లో బడ్జెట్ అయినప్పటికీ వీక్షకులను ఆకట్టుకుంటున్నాయి. పలాస, ఓ పిట్టకథ, హిట్, రాగల 24 గంటల్లో, గూఢచారి…ఇలా రకరకాల ఇతివృత్తాలతో మంచి సస్పెన్స్, సంగీతంతో, మంచి కెమెరా పనితనంతో ప్రేక్షకులను కట్టిపడేస్తున్నాయి. ఇన్నాళ్లనుంచి సినిమారంగంలో కుల మాఫియా కళారంగానికి ఎంత ద్రోహం చేసిందో ఈ సినిమాలు చూస్తే అర్ధం అవుతుంది.
ఎంతోమంది ప్రతిభావంతులను అణచివేసి కేవలం వారసత్వంతోనో లేకుంటే కులంతోనో సినిమారంగాన్ని శాశిస్తున్న వారిని కరోనా అనే మహమ్మారి దునిమేసింది. ఈ కంసులనుంచి సినిమారంగాన్ని రక్షించింది. సినిమా థియేటర్స్ కు వెళ్లి సినిమాలు చూసే రోజులు ఇకమీదట ఉండబోవు. బలవంతంగా వారసులను రుద్దే దౌర్జన్యాలకు కరోనా తన వాడిఖడ్గంతో జవాబు ఇచ్చిందని ప్రేక్షకులు సంతోషిస్తున్నారు.
ఇలపావులూరి మురళీ మోహన రావు
సీనియర్ రాజకీయ విశ్లేషకులు