హద్దులు దాటుతున్న విమర్శలు 

YS Vijayamma
ప్రతిపక్షం అన్న తరువాత ప్రభుత్వ పక్షాన్ని విమర్శించడం, వారి పాలనలోని లోపాలను తప్పు పట్టడం, ప్రజల దృష్టికి తీసుకెళ్లడం ప్రజాస్వామ్యంలో సహజ ప్రక్రియ.  అయితే ఆ విమర్శలు కూడా నిర్మాణాత్మకంగా కనిపించాలి.  “అవును…వీరు చెప్పేది నిజమే కదా?” అని ప్రజలు భావించినపుడే ఆ విమర్శలకు ఒక పరమార్ధం దక్కుతుంది.  
 
ఆంధ్రప్రదేశ్ లో వైసిపి అధికారంలోకి వచ్చినది మొదలు ప్రజలతో అత్యంత ఘోరంగా తిరస్కరించబడిన తెలుగుదేశం, ఘోరాతిఘోరంగా పరాభవం పాలైన జనసేన పార్టీలు జగన్ ప్రభుత్వం ఏ పని చేసినా ముందూ వెనుక చూసుకోకుండా కువిమర్శలు చెయ్యడమే పరమావధిగా పెట్టుకుంది. “కుక్కపిల్లా, అగ్గిపుల్లా, సబ్బుబిళ్ళా…హీనంగా చూడకు దేన్నీ…కవితామయమేనోయ్ అన్నీ…. అంటూ కాదేదీ కవితకు అనర్హం అని ఏ ముహూర్తాన అన్నాడో కానీ, జగన్ లేస్తే తప్పు, కూర్చుంటే తప్పు అన్నట్లుగా చంద్రబాబు, ఆయన పార్టీ నాయకులు విమర్శలు చేస్తుంటే ప్రజలు చీదరించుకుంటున్నారు. 
 
కోర్టుల ద్వారా ప్రభుత్వ జీవోలను అడ్డుకుంటే ఫర్వాలేదు.  అది వారి హక్కు.  కానీ, నేరగాళ్లు, హంతకులు, రౌడీలు, దోపిడీదారులమీద చర్యలు తీసుకున్నా కూడా తెలుగుదేశం నాయకులు నడివీధిలో నిలబడి గావుకేకలు పెడుతున్నవైనం దిగ్భ్రాంతి గొల్పుతుంది.  నూటయాభై కోట్ల రూపాయలు ఈఎస్సై లో కుంభకోణం జరిగిందని సాక్ష్యాధారాలతో సహా మాజీ మంత్రి అచ్చెన్నాయుడును అరెస్ట్ ఎసిబి అరెస్ట్ చేసినపుడు తమ హయాంలో జరిగిన కుంభకోణం పట్ల సిగ్గుపడకుండా ఆయన బీసీ నాయకుడని, అక్రమంగా అరెస్ట్ చేశారని చంద్రబాబు, లోకేష్ రోడ్డుమీద పడి చావుకేకలు పెట్టడంలో ఏమైనా అర్ధం ఉన్నదా?  బీసీ నాయకుడైతే నేరం చేసినపుడు పోలీసులు చర్య తీసుకోకూడదా?  
 
అలాగే గత నలభై ఏళ్లుగా అనేక అక్రమ మార్గాల్లో బస్సులు నడుపుతున్న జెసి దివాకరరెడ్డి సోదరుడు ప్రభాకర్ రెడ్డి, ఆయన కుమారుడును సాక్ష్యాలతో పోలీసులు అరెస్ట్ చేస్తే దాన్ని కూడా రాజకీయ కక్ష సాధింపుగా, ప్రతీకార చర్యగా అభివర్ణిస్తూ తెలుగుదేశం కాకిగోల చేసింది.  జెసి సోదరుల అక్రమాలు నిజం కావా?  ఒకవేళ అక్రమమే అయితే వారు న్యాయస్థానాల్లో పోరాడవచ్చు.  ప్రభుత్వాన్ని కోర్టుకు లాగవచ్చు.  ఎవరు అభ్యంతరం చెబుతారు?  
 
ఇక ఇటీవలనే చంద్రబాబు హయాంలో మంత్రిగా పనిచేసిన మంత్రి కొల్లు రవీంద్ర తన ప్రత్యర్థి మోకా భాస్కర రావు హత్య కేసులో ఆధారాలతో సహా దొరికిపోయి, పోలీసులకు దొరక్కుండా ఇంటినుంచి గోడదూకి పారిపోయి ఎక్కడో తుని దగ్గర పట్టుబడి అరెస్ట్ కాబడితే దాన్ని కూడా రాజకీయప్రయోజనాలకు వాడుకోవాలని చూశారు చంద్రబాబు.  కొల్లు రవీంద్ర బీసీలకోసం పోరాడిన యోధుడుగా వర్ణిస్తూ ఆయన్ను అన్యాయంగా అరెస్ట్ చేశారని లబలబలాడారు.  రవీంద్ర కానీ, అచ్చెన్నాయుడు కానీ మంత్రి పదవులు అనుభవించారు తప్ప వారు బీసీల కోసం ఎన్నడూ పోరాడిన దాఖాలాయే లేదు!.
 
ఇక తెలుగుదేశం వారి నీచాతినీచమైన విమర్శలకు పరాకాష్ట మొన్న ఎల్లో మీడియా ప్రసారం చేసిన కొన్ని కార్యక్రమాలు.  ఇడుపులపాయలో వైఎస్ రాజశేఖరరెడ్డి సమాధి వద్ద శ్రీమతి విజయమ్మ జగన్ ను  ముద్దాడబోతూ తన చేతిలోని బైబిల్ గ్రంధాన్ని పట్టుకోమని పక్కనే ఉన్న టిటిడి చైర్మన్ వైవి సుబ్బారెడ్డి గారి భార్యకు అందించింది.  ఆమె ఆ పుస్తకాన్ని పట్టుకోవడమే మహాపాపం అన్నట్లు ఆమె క్రైస్తవాన్ని అనుసరిస్తుంది అంటూ బురద చల్లడం హీనాతిహీనం. 
 
బైబిల్ కూడా ఒక మత గ్రంధం.  హిందువులకు రామాయణ భారత భాగవతాలు, ముస్లిమ్స్ కు ఖురాన్ ఎలాగో క్రైస్తవులకు బైబిల్ అలాంటి పూజనీయ గ్రంధం.  ఆ గ్రంధాన్ని పట్టుకోవడం నేరం అవుతుందా?  పట్టుకున్నంత మాత్రాన క్రైస్తవులు అయిపోతారా?  భారత రామాయణాలను హిందువుల కన్నా అద్భుతంగా వర్ణించి వివరించగల ముస్లిమ్స్, క్రైస్తవులు ఎందరో ఉన్నారు.  ఆ గ్రంధాలను వారు కూడా చదవబట్టే కదా వారికీ అంతటి జ్ఞానం అబ్బింది!  అది మా మత గ్రంధం కాదు కాబట్టి మేము చదవం అంటే మన పురాణాల గూర్చి వారికి ఎలా తెలుస్తుంది?  ఇంతకన్నా చౌకబారు విమర్శలు ఉంటాయా? 
 
చివరగా చెప్పేది ఏమిటంటే…ప్రభుత్వాన్ని ప్రతిపక్షాలు ఎండగట్టవచ్చు.  తీవ్రంగా విమర్శించవచ్చు.  కానీ, ఆ విమర్శలు ప్రజలకు ప్రయోజనాత్మకంగా ఉండాలి.  పనికిమాలిన విమర్శలు ప్రజల్లో పలుచన చేస్తాయని గ్రహించాలి.  
 
 
 
ఇలపావులూరి మురళీ మోహన రావు 
సీనియర్ రాజకీయ విశ్లేషకులు