రాధాకృష్ణ అరాచకం మామూలుగా లేదుగా! 

తాను నమ్ముకున్న దేవాధిదేవుడు, అవినీతిలో సరికొత్త రికార్డులు సృష్టించిన శ్రీమాన్ చంద్రబాబు పరాజయాన్ని, పరాభవాన్ని ఏమాత్రం జీర్ణించుకోలేక కుళ్ళి కునారిల్లిపోతూ, “కలలో నీ నామ స్మరణ మరువ చక్కని తండ్రి” అని రామదాసు వారు రఘురాముని కీర్తించి తరించినట్లు….జగన్ మోహన్ రెడ్డి విజయాన్ని ఏమాత్రం భరించలేక, సహించలేక కళ్లనుంచి నిప్పుకణాలను రాల్చుతూ, నిరంతరం వైరిభక్తితో నీలుగుతున్న రాధాకృష్ణ తన ఆరని ఆక్రోశాన్ని, తీరని ఆవేదనను, భళ్లుబళ్ళున వారానికోసారి వాంతులు చేసుకుంటున్న రమణీయ, కమనీయ దృశ్యాన్ని గత ఏడాదిగా చూస్తూనే ఉన్నాము.  ఆనందిస్తూనే ఉన్నాము.  మన ఆనందాన్ని ద్విగుళం బహుళం చెయ్యడమే పరమ లక్ష్యంగా రాధాకృష్ణ ఈ వారపు రోత పలుకుల్లో ఒకసారి పరికిద్దాం.  
 
“తెలుగునాట సరికొత్త రాజకీయ వ్యూహ రచనకు ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వై.ఎస్‌.జగన్మోహన్‌రెడ్డి పూనుకున్నారా? నిజానికి ఈ వ్యూహాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఇప్పటికే పాక్షికంగా అమలు చేశారు. పలు విషయాల్లో కేసీఆర్‌ను ఆదర్శంగా తీసుకుంటున్న జగన్మోహన్‌రెడ్డి ఇప్పుడు తనదైన శైలిలో రాజకీయం మొదలెట్టారు…”
 
ఓహో….ఇందులో సరికొత్త రాజకీయ వ్యూహరచన ఏమున్నది రాధాకృష్ణా?  ప్రతి రాజకీయ నాయకుడికి తనదంటూ ఒక శైలి, వ్యూహం ఉంటాయి.  అనుభవం, అధ్యయనం మీద కొందరు మరింత రాటుదేలుతారు.  జగన్మోహన్ రెడ్డికి ఇంతటి అనుభవం, ఇంతటి వ్యూహరచనా సామర్ధ్యం కలగడానికి కారణం ఎవరో మరిచిపోతే ఎలా?  నలభై ఏళ్ళు కూడా నిండని యువకుడిని అనేక అవమానాలకు గురి చేసి, తప్పుడు కేసులు పెట్టి, సోనియా, చంద్రబాబు, చిదంబరం,  లక్ష్మీనారాయణ, అశోక్ గజపతి రాజు, శంకర్రావు, అహ్మద్ పటేల్, గులాం నబీ ఆజాద్, లాంటి పరమ నీచులు, మరికొందరు అన్యాయమూర్తులు  ఎంత వేధించారో ఈ లోకానికి తెలియదా?   అది శిలయే కావచ్చు…కానీ ఉలి దెబ్బలు తినితిని మనోహరమైన శిల్పంగా మారుతుంది.  బంగారాన్ని అగ్నిగుండంలో కాల్చి, కాల్చి సుత్తితో దెబ్బలు కొట్టగా కొట్టగా అందమైన ఆభరణంగా రూపుదిద్దుకుంటుంది.  చిన్న వయసులో రాక్షసుల కర్కశత్వానికి గురైన జగన్ మోహన్ రెడ్డి చిన్నతనంలోనే రాజకీయంగా రాటుదేలాడు.  తన వ్యూహాలతో ప్రత్యర్థులను చిత్తు చేస్తున్నాడు!  ఎవరు వ్యూహాలు వారికి ఉండటం దోషమా?  
 
***
“ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి విషయానికి వస్తే ఎలాగైనా ముఖ్యమంత్రి కావాలన్న కాంక్షతో పార్టీ టికెట్ల కేటాయింపులో ఆయన రాజీపడ్డారు. రాజకీయ కుటుంబాలకు చెందిన పలువురికి కూడా పార్టీ టికెట్లు కేటాయించారు. ఏడాది క్రితం జరిగిన ఎన్నికలలో తనకు అనూహ్యంగా 151 అసెంబ్లీ స్థానాలు, 22 లోక్‌సభ స్థానాలు లభించడంతో కేసీఆర్‌ అమలుచేసిన వ్యూహాన్ని మరింత పకడ్బందీగా అమలుచేయడానికి జగన్మోహన్‌రెడ్డి నడుం బిగించారు.”
 
రాజకీయ కుటుంబాలు అంటూ ఈ దేశంలో ప్రత్యేకంగా ఉన్నాయా?  ఒక డాక్టర్ తన కుమారుడిని డాక్టర్ చేసినట్లు, ఒక ఇంజినీర్ తన కొడుకును ఇంజినీరును చేసినట్లు, ఒక పారిశ్రామికవేత్త తన కుమారుడిని పారిశ్రామికవేత్తను చేసినట్లు తమ వృత్తులను తమ పిల్లలకు వారసత్వంగా అందించాలనుకోవడంలో వింత ఏముంది?  చంద్రబాబుది రాజకీయ కుటుంబం కాదా?  తన కొడుక్కు ఆయన మంగళగిరి సీటుని ఇవ్వలేదా?  మాధవరెడ్డి హత్యకు గురైతే ఆయన భార్యను, ఎర్రన్నాయుడు చనిపోతే ఆయన కొడుకును, తమ్ముడిని,  ప్రోత్సహించలేదా?  వారికి టికెట్లు కేటాయించడం అంటే రాజీ పడటం అవుతుందా?   తన వ్యూహం ఫలించి 151 సీట్లు వస్తే అలాంటి వ్యూహాలను కొనసాగించక చంద్రబాబు వ్యూహాలను అమలు చెయ్యాలా?  
 
****
“నెల్లూరు జిల్లాలో ఆనం రామనారాయణరెడ్డి, చిత్తూరులో భూమన కరుణాకర్‌రెడ్డి, శ్రీకాకుళంలో ధర్మాన ప్రసాదరావు వంటివారు జగన్మోహన్‌రెడ్డి హిట్‌లిస్టులో ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. భూమన కరుణాకర్‌రెడ్డికి జగన్‌ తాత రాజారెడ్డితోనే సన్నిహిత సంబంధాలు ఉండేవి.    కరుణాకర్‌రెడ్డిని ముఖ్యమంత్రి దూరంపెట్టారని ప్రచారం జరుగుతోంది.  అయినా ఆయనను కాదని నమ్మినబంటు వలె ఉండే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డిని జగన్‌ ఆదరిస్తున్నారు. కొన్ని ప్రత్యేక అవసరాల రీత్యా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి, ఆయన కుమారుడు మిథున్‌రెడ్డికి జగన్‌ ప్రాధాన్యం ఇస్తున్నారు. ఇది ఎంత కాలమో తెలియదు. నెల్లూరులో ఆనం కుటుంబానికి సుదీర్ఘ రాజకీయ చరిత్ర ఉంది. అంతేకాదు.. జిల్లా రాజకీయాలలో రెడ్ల ఆధిపత్యం ఎప్పటి నుంచో కొనసాగుతోంది. అయినప్పటికీ అనిల్‌కుమార్‌ యాదవ్‌ను మంత్రిగా తీసుకోవడమే కాకుండా అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నారు…”
 
ఎంత నికృష్టమైన విశ్లేషణ ఇది రాధాకృష్ణా!  నీ బుర్రలో అణుమాత్రమైనా బుద్ధి అనేది ఉన్నదా?  నువ్వు చెప్పిన ఆ రెడ్లు అందరూ జగన్ బొమ్మను పెట్టుకుని గెలిచినవారే కదా?  ఎవరెవరికి ఎంతెంత ప్రాధాన్యత ఇవ్వాలో కూడా తెలియకుండా జగన్ ఇంతటి ఘనవిజయాలు సాధిస్తున్నాడా? వారిలో వారికి విభేదాలు సృష్టించాలని దుష్టసంకల్పం తప్ప లేశమాత్రమైనా ఇంగితం అనేది ఉన్నదా?    ఏమిటి చరిత్రలు? వీరి కుటుంబాలు ఏమైనా దేశ స్వతంత్రం కోసం పోరాటాలు చేశాయా?  దేశం కోసం తమ ఆసులను ప్రకాశం పంతులుగారిలా త్యాగం చేశాయా?  వీరి తండ్రులు తాతలు రాజకీయాల్లో ఉన్నారని వీరిని కూడా పూజించాలా?  కొత్త శక్తులను, సామాజికవర్గాలను రాజకీయంగా ప్రోత్సహించడం నేరమా?  జిల్లా మొత్తాన్ని గంపగుత్తగా ఒకే కుటుంబం చేతిలో పెట్టాలా?  జగన్ ప్రోత్సాహం కారణంగా అనిల్ కుమార్ యాదవ్ ఈరోజు అత్యంత డైనమిక్ నాయకుడిగా రూపొందాడు.  బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాలకు మంత్రివర్గంలో పీట వేశాడు.  అలా కాక చంద్రబాబులా గెలిచేటపుడు తన కులం వారికి, ఓడిపోయేటపుడు బీసీలకు, ఎస్సీలకు టికెట్లు ఇవ్వాలేమో?  
 
****
” ధర్మాన కుటుంబం నుంచి కృష్ణదాస్‌కు మంత్రి పదవి ఇవ్వడం ద్వారా ప్రసాదరావు ప్రాధాన్యాన్ని కుదించారు. విజయనగరం జిల్లాలో అశోక్‌ గజపతిరాజు ప్రాబల్యం తగ్గించడం కోసం మాత్రమే సీనియర్‌ నాయకుడు బొత్స సత్యనారాయణను మంత్రిగా జగన్‌ తీసుకున్నారు. ఈ విధంగా సొంత పార్టీలో రాజకీయ కుటుంబాలను, పలుకుబడి ఉన్న నాయకులను బలహీనపరిచే వ్యూహానికి జగన్మోహన్‌రెడ్డి తెర తీశారని అధికార పార్టీ నాయకులు అభిప్రాయపడుతున్నారు….”
 
రాధాకృష్ణ బుద్ది గడ్డి తినేదని అందరికీ తెలుసు.  కానీ, చంద్రబాబు పట్ల స్వామిభక్తి చూపించడంలో  అంతకు మించి జనమంతా అసహ్యించుకునే మరేదో పదార్ధం తింటుందని ఇప్పుడు అర్ధం అవుతుంది.   బొత్సా సత్యనారాయణ ఇప్పుడు కొత్తగా మంత్రి కాలేదు.  గతంలో ఆయన కాంగ్రెస్ ప్రభుత్వాల్లో మంత్రిగా పదేళ్లు మంత్రిగా పని చేసిన సీనియర్ నాయకుడు.  బొత్స కుటుంబలో ముగ్గురు నలుగురు ఎమ్మెల్యేలుగా ఉండేవారు.  ఆయన భార్య ఎంపీగా గెలిచారు.  ఉత్తరాంధ్రలో అత్యంత బలమైన నాయకుడు బొత్స.  ఒకరికి మంత్రిపదవి ఇస్తే మరొకరిని తొక్కేసినట్లు అనే కొత్త సిద్ధాంతాన్ని తెరపైకి తెచ్చి వారిలోవారికి తంపులు పెట్టడమే రాధాకృష్ణ కర్తవ్యమ్ లా ఉన్నది.  
 
***
“కోడెల శివప్రసాదరావు ప్రభుత్వ వేధింపులను భరించలేక చివరకు ఆత్మహత్య చేసుకున్నారు.    శ్రీకాకుళం జిల్లాలో బలమైన రాజకీయ కుటుంబంగా చలామణి అవుతున్న అచ్చెన్నాయుడిపై దృష్టిపెట్టారు. ఈఎస్‌ఐ కుంభకోణం అంటూ అచ్చెన్నను అరెస్ట్‌ చేశారు. శ్రీకాకుళం జిల్లా రాజకీయాలపై ఎర్రన్నాయుడు కుటుంబానికి మంచి పట్టు ఉంది. రోడ్డు ప్రమాదంలో ఎర్రన్నాయుడు మృతి చెందిన తర్వాత ఆయన సోదరుడైన అచ్చెన్నాయుడు తెలుగుదేశం పార్టీలో కీలకంగా మారారు. ఎర్రన్నాయుడు కుమారుడు రామ్మోహన్‌ నాయుడు ఎంపీగా ఉన్నారు.”
 
కోడెల ఎందుకు ఆత్మహత్య చేసుకున్నారో తెలిసి కూడా రాధాకృష్ణ పరవంచనకు పాల్పడుతున్నాడు.  ఓడిపోయిన తరువాత ఆయనకు కనీసం అపాయింట్మెంట్ కూడా ఇవ్వకుండా చంద్రబాబు దారుణంగా అవమానించారు.  ఆయనకు ఫర్నిచర్ దొంగ అని బిరుదు వస్తే కనీసం మద్దతు తెలుపలేదు.  చంద్రబాబు తనను ఘోరంగా అవమానించడం తట్టుకోలేకనే కోడెల ఆత్మహత్యకు పాల్పడ్డారని దేశమంతా తెలిసినా రాధాకృష్ణ మొద్దు చర్మానికి చీమ కుట్టినట్లు కూడా లేదాయె.   ఇక అచ్చెన్నాయుడు ఈ ఎస్ ఐ కుంభకోణంలో ఇరుక్కుని నూటయాభై కోట్ల రూపాయలను స్వాహా చేశారని ఆయన మీద సాక్ష్యాధారాలతో సహా రుజువులు దొరికిన తరువాతే ఆయన్ను పోలీసులు అరెస్ట్ చేశారు.  రామ్మోహన్ నాయుడు ఎంపీగా ఉన్నంతమాత్రాన, ఎర్రన్నాయుడు తెలుగుదేశంలో ప్రముఖ నాయకుడైనంతమాత్రాన నేరం మాసిపోతుందా?  
 
****
“గతంలో జగన్మోహన్‌రెడ్డిని అరెస్ట్‌ చేసిన సీబీఐ అధికారులు ఆయనను కోర్టులో ప్రవేశపెట్టే సందర్భంగా రక్షణగా వచ్చిన పోలీసులలో ఒకరిపై ఆయన భార్య భారతిరెడ్డి చేయిచేసుకోవడాన్ని మనం టీవీలలో చూశాం. అయినా అప్పటి ప్రభుత్వం ఇలా కేసులు పెట్టలేదు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జగన్మోహన్‌రెడ్డి ఎంతో మంది అధికారులకు హెచ్చరికలు చేశారు. “
 
ఎన్నడో జరిగిన సంఘటనను ప్రస్తావించి ఒక ముఖ్యమంత్రి భార్యను ఏదో ముద్దాయిలా నిలబెట్టాలని కుటిలప్రయత్నం చేస్తున్న రాధాకృష్ణ వంటి సంస్కారహీనుడు మరొకరు ఉండరేమో?  తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడు కేశినేని నాని ఒక ఐపీఎస్ అధికారి కాలర్ పట్టుకున్న విషయాన్ని, జెసి దివాకర్ రెడ్డి విశాఖ విమానాశ్రయంలో కంప్యూటర్లను పగులగొట్టిన ఉదంతాన్ని, జెసి ప్రభాకరరెడ్డి రవాణాశాఖ అధికారిమీద దౌర్జన్యం చేసిన సంగతిని, నిన్నగాక మొన్న అచ్చెన్నాయుడు ఒక ఐపీఎస్ అధికారిని యూస్ లెస్ ఫెలో అని తిట్టిన ఘట్టాన్ని రాధాకృష్ణ మర్చిపోయి ఉంటాడు.  అయినప్పటికీ వారిమీద ఎవరూ కేసులు పెట్టలేదే!
 
***
“అధికార వికేంద్రీకరణతోనే అభివృద్ధి సాధ్యమని ప్రజలను నమ్మించే ప్రయత్నం చేస్తున్న జగన్‌ ప్రభుత్వం మూడు రాజధానుల కోసం కేటాయించిన 500 కోట్ల రూపాయలు ఏ మూలకు సరిపోతాయి. ప్రభుత్వ కార్యాలయాలను ఏర్పాటు చేసినంత మాత్రాన అభివృద్ధి జరగదని ప్రజలు ఆర్థంచేసుకోవలసి ఉంది. పైసా ఖర్చు లేకుండా సమకూరిన 50 వేల ఎకరాల భూమిని, పది వేల కోట్ల రూపాయలతో జరిగిన నిర్మాణాలను దయ్యాల కొంపలుగా మార్చి.. 500 కోట్లతో మూడు రాజధానులను అభివృద్ధి చేయాలనుకోవడం హాస్యాస్పదం కాదా? యేటా 500 లేదా వెయ్యి కోట్లు కేటాయించినా నాలుగేళ్లలో 4 వేల కోట్లతో మూడు రాజధానులు అభివృద్ధి చెందుతాయనడం ఆత్మవంచన కాదా?”
 
ఏమి కసి!  ఎంత కసి!  కళ్లనుంచి నుసి నుసిగా రాలుతుండటం చూస్తుంటే ముసిముసిగా నవ్వక తప్పుతుందా ఎవరికైనా?  తమ కమ్మ రాజధాని తరలిపోతున్నదే అన్న ఏడుపు, రాజధాని ఉద్యమం పేరుతో సాగిన పెయిడ్ ఆర్టిస్టుల డ్రామాలు విఫలం కావడం, ఎవరెన్ని చెప్పినా, రాజధాని తరలింపు తధ్యం అని తేలిపోవడంతో రాధాకృష్ణ హాహాకారాలు మిన్నంటాయి.  రాజధానికి అయిదువేల ఎకరాలు చాలని, నిర్మాణాలకు రెండువేల కోట్ల రూపాయలు చాలని గత ఐదేళ్లలో ఎందరెందరో రాజకీయ, ఆర్ధిక నిపుణులు అనేకమార్లు కుండబద్దలు కొట్టారు.  అనేక ఉదాహరణలు కూడా చూపించారు.  అయినప్పటికీ, చంద్రబాబు భూవ్యాపార దోపిడీ కాంక్షకు రైతులు బలై పోయారు.  యాభైవేల ఎకరాల పచ్చని పొలాలను చంద్రబాబు మరుభూములుగా మార్చేశారు.  రాజధాని నిర్మాణానికి రెండు లక్షల కోట్లు కావాలంటూ లక్షకోట్లు దోచెయ్యడానికి ప్రణాళిక వేశారు.  కానీ, ప్రజలు అప్రమత్తులు కావడంతో చంద్రబాబు కలలన్నీ కల్లలుగా మిగిలిపోయాయి.  రాజధాని నిర్మాణం అనేది ఒక స్వర్గధామం అనే దురభిప్రాయాన్ని ప్రజలలో కలిగించి అయిదేళ్ల కాలాన్ని వృధాచేసారు చంద్రబాబు.  చంద్రబాబు ఆటలు కట్టించడానికే ప్రజలు జగన్ కు పట్టం కట్టారని రాధాకృష్ణ గ్రహించకుండా ఇలాంటి ఆర్తనాదాలు చేస్తుంటే ప్రజలు అసహ్యించుకుంటారు.  
 
**
పాలను పెరుగు చెయ్యవచ్చు.  పెరుగును మజ్జిగ చెయ్యవచ్చు.  కానీ  మజ్జిగను పెరుగు చేయలేము.  పెరుగును పాలుగా మార్చలేము.  రాధాకృష్ణ, చంద్రబాబు లాంటి నయవంచకులను మనుషులుగా మార్చడం విధాతకైనా సాధ్యం కాదు.  
 
 
 
Ilapavuluri Murali Mohan Rao
Ilapavuluri Murali Mohan Rao

ఇలపావులూరి మురళీ మోహన రావు
సీనియర్ రాజకీయ విశ్లేషకులు