చెవిటివాడిముందు శంఖం ఊదినట్లు

రాధాకృష్ణ - ఎవరికన్నా చెప్పేందుకే నీతులు
చెవిటివాడిముందు శంఖం ఊదుతుంటే…అరెరే..ఎందుకురా శంఖాన్ని తింటున్నావు అని ప్రశ్నిస్తాడు.   మన రాధాకరష్ణ చెవిటివాడు కాదు…గుడ్డివాడు కాదు.  కానీ, తనకు బధిరత్వం, అంధత్వం రెండూ తారాస్థాయిలో ఉన్నట్లు నటించడంలో ఆస్కార్ అవార్డుకు అర్థుడు.  అదే నేటి తన కొత్తపలుకు “జగన్…కరోనా…కోరస్”  పేరుతో నివారణ లేని వైరస్ ను జనం మీదికి వదిలాడు.
 
“ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నవారే కరోనా కూడా మామూలు జ్వరంలాంటిదేనని చెబితే, లాక్‌డౌన్‌ నిబంధనలను ప్రజలు మాత్రం ఎందుకు పాటిస్తారు? కరోనా వైరస్‌ మన దేశంలోకి ప్రవేశించడానికి ముందు అనేక సమస్యలతో సతమతమవుతున్న ప్రధాని నరేంద్ర మోదీ ప్రతిష్ఠ ఇప్పుడు అమాంతం పెరిగిపోయింది. కరోనా కట్టడి విషయంలో ఆయన తీసుకుంటున్న చర్యలను 80 శాతానికి పైగా ప్రజలు సమర్థిస్తున్నారని వివిధ సర్వేలలో స్పష్టమవుతోంది. “
 
ఓహోహో…రామచిలుక పలుకులు కదా మన రాధాకృష్ణ కొత్తపలుకులు!   చంద్రబాబు గనుక ముఖ్యమంత్రిగా ఇప్పుడు ఉన్నట్లయితే ..అబ్బో.. 
 
“కరోనా పై కత్తి దూసిన చంద్రబాబు…” 
“కరోనాను ముప్ఫయి డిగ్రీలు తగ్గించాలని అధికారులకు ఆదేశం…అధికారుల గుండెల్లో రైళ్లు”  
 
“టెక్నాలజీతో కరోనాను కట్టడి చేసిన చంద్రబాబు”  
 
“నేను నిద్రపోను…కరోనాను నిద్ర పోనివ్వను” అంటూ చండ్ర నిప్పులు…
 
“కరోనా లింగ నిర్ధారణ కోసం వందకోట్లు విడుదల చేసిన చంద్రబాబు”
 
“కరోనాను ఎలా ఖతం చెయ్యాలంటూ చంద్రబాబుకు ఫోన్ చేసిన ట్రంప్”  అంటూ పుచ్చకా సైజు అక్షరాలతో పచ్చరసమును వైతరణిలోని చీమూ నెత్తురులా వరదలా పారించేవారు మన ఎల్లో మండూకాలు.   
 
జగన్ చేపట్టిన చర్యలను దేశం మొత్తం ప్రశంసిస్తుంటే…బాధాకృష్ణకు మాత్రం మోడీ మహాశయుడి ఇమేజ్ ఆకాశానికి ఐదిగిపోయినట్లు కనిపించడంలో ఆశ్చర్యం లేదు.  ఎందుకంటే, తన యజమానికి అర్జెంట్ గా మోడీ గారి చరణస్పర్శ కావాలి.  మోడీ గారి కరుణాకటాక్షవీక్షణం అత్యవసరం.  నిజానికి మోడీ లాక్ డౌన్ ప్రకటించిన తీరు, వలసకార్మికులను స్వస్థలాలకు చేర్చడంలో ప్రదర్శించిన  నిర్లక్ష్య ధోరణి, వేలాదిమంది కార్మికులు నలభై యాభై కేజీల బరువును తలమీద మోస్తూ వందలాది కిలోమీటర్ల దూరాన్ని నడిచివెళ్తున్న హృదయవిదారక దృశ్యాలు మనసున్న ప్రతిఒక్కరినీ కలచివేశాయి. 
 
ప్రపంచమంతా కరోనా విస్తరిస్తున్న సమయంలో ట్రంప్ పర్యటనను పెట్టి లక్షలాదిమందితో స్వాగతగీతాలు పాడించడం, రాజధాని నగరంలో మర్కజ్ ప్రార్ధనలు జరుగుతున్న వ్యవహారంలో ఏమాత్రం ముందు జాగ్రత్తలు చేపట్టకపోవడం, ఇండోనేషియా నుంచి కరోనా సోకిన వారు ఆ ప్రార్థనలకు హాజరైనప్పటికీ పట్టించుకోకపోవడం లాంటి అనేక చర్యలు పలు విమర్శల పాలైన విషయం రాధాకృష్ణకు తెలియకుండా ఉంటుందా?  నిద్రపోతున్నట్లు నటిస్తున్నవారిని లేపడం ఎవరి తరం?  
 
***
”ఎన్నిప్రయత్నాలు చేస్తున్నా కరోనా వైరస్‌ను అరికట్టలేకపోతున్నాం. ఆ వైరస్‌ మనతోనే ఉంటుంది. కలిసి జీవించాల్సిందే! మామూలు జ్వరంలాంటి కరోనా గురించి ఎక్కువగా భయపడవద్దు. మందులు వేసుకుంటే అదే తగ్గిపోతుంది”.. ఇది ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి చేసిన ప్రకటన! 
 
”కరోనా వ్యాప్తిని అరికట్టడానికి ముఖ్యమంత్రి తీసుకునే చర్యలను కేంద్రం అభినందిస్తోంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల గురించి ఆరా తీస్తోంది”.. ఇది వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ట్విటర్‌ వేదికగా చేసిన కామెంట్‌! 
 
పై కామెంట్ లో ఏమి తప్పు కనిపించిందో రాధాకృష్ణకు?  కరోనా నివారణకు అన్నిరకాల ప్రయత్నాలు చేస్తున్నామనే కదా జగన్ చెప్పింది?  ప్రయత్నాలు చేస్తున్నా కంట్రోల్ కావడం లేదని వాస్తవాన్ని చెప్పారు ఆయన.  జగన్ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా హర్షించింది అని విజయసాయి రెడ్డి చెప్పడంలో ఔచిత్యభంగం ఏమిటి?  కరోనా ఇప్పట్లో తగ్గదని, దానితో సహజీవనం తప్పదని ప్రపంచ ఆరోగ్య సంస్థ అధ్యక్షుడితో పాటు ఇంకా అనేకమంది దేశాధినేతలు, ఆర్థికవేత్తలు, చివరకు ప్రధాని మోడీ సైతం చెప్పలేదా?  
 
****
“ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలు కూడా విమర్శల పాలయ్యాయి. పాదయాత్ర సందర్భంగా గానీ, అంతకుముందు గానీ అనర్గళంగా ఉపన్యాసాలు ఇచ్చిన జగన్మోహన్‌రెడ్డి ఇప్పుడు ముఖ్యమంత్రిగా విలేఖరుల సమావేశం కూడా పెట్టలేకపోవడం ఏమిటి? అని జనం ఆశ్చర్యపోతున్నారు.”
 
అంటే చంద్రబాబు లాగా రోజుకు నాలుగుసార్లు పత్రికసమావేశాలను పెట్టాలి.  పెట్టి హెచ్చులను, గప్పాలను చెప్పుకోవాలి.  తుపానును ఆపేసా…జలఫిరంగులతో నీళ్లు ఇచ్చా…కృష్ణా గోదావరిలా జుట్లు ముడేసి అనుసంధానం చేశా” అంటూ విలేఖరుల ముందు కోతలు కొయ్యాలి!  దాన్ని పచ్చమీడియా వాళ్ళు తిమ్మిని బమ్మిని బమ్మిని తిమ్మిని చేసి జనాన్ని ఊదరగొట్టాలి!!  ఏం చేస్తాం పాపం?  జగన్ కు అలాంటి గారడీ విద్యలు తెలియవు కదా!  చంద్రబాబులా ఆయన కోతలరాయుడు కాదు కదా!  
 
***
“నిజానికి ప్రభుత్వాలు చెబుతున్న లెక్కలకు, వాస్తవానికి పొంతన ఉండదని వైద్య నిపుణులు చెబుతున్నారు. మన జనాభాతో పోలిస్తే జరుగుతున్న పరీక్షల శాతం బహు స్వల్పమనీ, ఎక్కువ మందికి పరీక్షలు నిర్వహిస్తే కరోనా వ్యాధి సోకినవారి సంఖ్య ఎంతో స్పష్టంగా తెలుస్తుందనీ అంటున్నారు. అయితే ప్రజలందరికీ పరీక్షలు నిర్వహించగల సాధన సంపత్తి మన దేశంలోనే కాదు.. ప్రపంచ దేశాల వద్ద కూడా లేదు.”
 
రాధాకృష్ణ కక్కిన ఆ విషపు  వాంతిలో మొదటి రెండు వాక్యాలకు, చివరి వాక్యానికి ఏమైనా పొంతన ఉన్నదా?  ఒకవంక పరీక్షలు ఎక్కువ నిర్వహించడం లేదని రోదిస్తూ, మరొకవంక ప్రజలందరికి పరీక్షలు నిర్వహించగల సాధనసంపత్తి మనదేశంలోనే కాదట…ప్రపంచదేశాల వద్ద కూడా లేదని చివర్లో ముక్కుతున్నాడు!   
 
మరి ప్రపంచదేశాల్లోనే లేని సంపత్తి ఆంధ్రప్రదేశ్ వంటి చిన్న రాష్ట్రంలో ఉంటుందని ఎలా వాగుతున్నాడు రాధాకృష్ణ?  పనిముట్లు తక్కువ ఉన్నప్పటికీ, జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మీద ఇప్పటికి సుమారు లక్షా అయిదువేలమందికి కరోనా టెస్టులు నిర్వహించడం జరిగిందని, ప్రభుత్వం తెరుచుకుంటున్న చర్యల మూలంగా గత వారం రోజులుగా కరోనా మరణాలు సంభవించలేదని,  అన్నిటిని మించి రాష్ట్రంలోని ప్రతి ఇంట్లోనూ ఒకరికి పరీక్ష నిర్వహించాలని జగన్ ఆదేశాలు ఇచ్చిన సంగతి ఈ గుడ్డి  మార్జాలానికి ఎలా తెలుస్తుంది?  
 
****
“ప్రధాని నరేంద్ర మోదీ, ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు కరోనాను కట్టడి చేయడం ఎలా? అని తలలు పట్టుకుంటూ ఉంటే, జగన్‌ అండ్‌ కో మాత్రం రాజకీయ కక్ష సాధింపు చర్యలను కొనసాగిస్తూనే ఉంది.”
 
ఓహోహో…దేశంలో గల అందరు ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రి కరోనా గూర్చి తెగ ఆలోచిస్తున్నారట. అందుకే కాబోలు మధ్యప్రదేశ్, తమిళనాడు, మహారాష్ట్రలో కరోనా చెలరేగిపోతున్నది.  మోడీ గారి సొంత రాష్ట్రంలో కరోనా కేసులు అనేక రాష్ట్రాల కన్నా అధికసంఖ్యలో నమోదు అయ్యాయి. 
 
జగన్ చేతులు ముడుచుకుని కూర్చోవడం వల్లనే అతి తక్కువ సంఖ్యలో కేసులు నమోదయ్యాయి.  ఇక తన యజమాని హైద్రాబాద్ లోని రాజాప్రసాదంలో కూర్చుని రోజుకో పిచ్చివాగుడు వాగుతూ జగన్ మీద బురద చల్లడం, తన పార్టీ బానిసలతో నిరాహారదీక్షలు చేయించడం జనం దృష్టిలో క్షుద్ర రాజకీయాలు కావచ్చు కానీ, రాధాకృష్ణ లాంటి దివాంధుడి దృష్టిలో మహా పవిత్రమైన సృష్టికార్యం!  
 
****
“లాక్‌డౌన్‌ తదనంతర పరిస్థితి ఏమిటో తెలియదు. ఆర్థిక రంగం కోలుకుంటుందో.. మరింత క్షీణిస్తుందో అనేది ఆర్థిక నిపుణులే సూటిగా చెప్పలేకపోతున్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి మాత్రం వీటన్నింటికీ అతీతం! ప్రభుత్వ ఖజానాలో నాలుగు రూపాయలు జమ అయితే చాలు.. పథకాల పేరిట పంచిపెట్టడానికే ఆరాటపడుతున్నారు.”
 
అబ్బబ్బ…ఏమి దూరదృష్టి రాధాకృష్ణది!  లాక్ డౌన్ అనంతరం పరిస్థితి ఏమవుతుందో తెలియదు కాబట్టి ఇప్పటినుంచే నోరు కట్టేసుకుని కూర్చోవాలి.  కరోనా పేరుతో సంక్షేమపథకాలు ఆపేసెయ్యాలి….అయినా గత నలభై రోజులుగా అసలు ఆదాయమే లేకపోతె…ఖజానాలో నాలుగు రూపాయలు ఎలా జమ అయ్యాయో రాధాకృష్ణ చెప్పగలడా?  అధికారాంతమందు అప్పులు చేసి మరీ పసుపుకుంకుమ పేరుతో ముఫైవేలకోట్ల రూపాయల ప్రజాధనాన్ని ఓట్లకొనుగోలు కోసం వినియోగించి, వెళ్ళేటప్పుడు ఖజానాను పూర్తిగా ఖాళీ చేసి వెళ్లిపోయిన చంద్రబాబు నాయుడే రాధాకృష్ణకు జవాబు ఇవ్వాలి!  
 
***
“నా పిల్లలకు ఇంగ్లిష్‌తోపాటు తెలుగులో చదవడం, రాయడం కూడా వచ్చు. మనవడికి కూడా తెలుగు భాషను నేర్పిస్తున్నాను. మాతృ భాషను చంపేస్తున్నా మౌనంగా ఉంటూ, ప్రభుత్వ కార్యాలయాలలో అమలుకు నోచుకోని అధికార భాష ‘తెలుగు’ గురించి అధికార భాషా సంఘం అధ్యక్షుడైన లక్ష్మీప్రసాద్‌ మాట్లాడాలనుకోవడం ఇప్పుడు అత్యాశే అవుతుంది.”
 
హాయిగా ఇంట్లో కూర్చుని మనవడికి ఇంగ్లిష్ లో మాథ్స్ నేర్పిస్తున్న తన యజమాని చంద్రబాబుకు ఈ ప్రశ్న వెయ్యాలి రాధాకృష్ణ.రాధాకృష్ణ పిల్లలు, మనవడు మాత్రమే తెలుగు నేర్చుకుని భాషను ఉద్ధరిస్తున్నారు.  మిగిలిన వారంతా తెలుగును మర్చిపోయారు…మాతృభాషను చంపేస్తున్నారంటూ ఆక్రందనలు!   అన్ని పాఠశాలల్లో ఆంగ్లమాధ్యమం తో పాటు తెలుగు కూడా కంపల్సరీగా ఉంటుందని, ప్రతి మండలానికి ఒక తెలుగు పాఠశాల ఉంటుందని రోడ్డు పక్కన ఇడ్లీ అమ్ముకునేవారికి కూడా తెలిసిన సత్యం రాధాకృష్ణకు తెలియకపోవడం వింతల్లోకెల్లా వింత అనుకోవద్దు….ఆ గజ్జి అలాంటిది! 
 
 
Ilapavuluri Murali Mohan Rao
Ilapavuluri Murali Mohan Rao

ఇలపావులూరి మురళీ మోహన రావు 
సీనియర్ రాజకీయ విశ్లేషకులు