ఓపెన్ కవర్ అశుద్ధ ప్రీతి

ABN Weekend Comment
యధాప్రకారంబుగా శ్రీమాన్ రాధాకృష్ణ గారు తన సహజస్వభావమైన విషపు వాంతులను కక్కడం మొదలుపెట్టారు.  ఆయన కారణాలు ఆయనకు ఉంటాయి.  వాటిలో మొదటిది జగన్ మోహన్ రెడ్డి రావడంతోనే రాధాకృష్ణకు అవినీతి వరద తగ్గింది.  ప్రకటనలు, అసెంబ్లీ ప్రసారాలు, భూ పందేరాలు మొదలైన అనేకానేక అవినీతి వ్యాపకాలతో ప్రజాధనాన్ని (750  కోట్లు అని చెప్పుకుంటారు)  లూటీ చేసిన రాధాకృష్ణకు గత ఏడాదిగా నయాపైసా ఆదాయం కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి అందకపోవడంతో గంగవెర్రులెత్తి మళ్ళీ పదేళ్ల క్రితం తాను అనుసరించిన దుర్నీతిని వెలికితీసి మళ్ళీ అదే జగన్ మీద ప్రయోగించడం ప్రారంభించాడు. 
 
జగన్ లక్ష కోట్లు దోచాడని, అలాగే లేళ్ళు,సెలయేళ్ళు, పచ్చికబయళ్ళు తిరిగే సుందరాతిసుందరమైన ప్రకృతిని ధ్వంసం  చేసి ఉక్కు కర్మాగారాన్ని నిర్మిస్తున్నారని మలబద్ధకంతో బాధపడేవాడు ముక్కినట్లు ముక్కీ ముక్కీ జర్నలిజాన్ని కంపు కంపు చేసి వదిలేశాడు.  ఎలుకతోలు తెచ్చి ఏడాది ఉతికినా ఏమి ఫలము అన్నట్లు…ఒట్టిపోయిన పొడుగును ఎంత సాగదీసినా నిష్ప్రయోజనమే అన్నట్లు….కొందరు క్షుద్ర అధికారులు, రాజకీయ నాయక కీచకుల  సహకారంతో జగన్ వ్యక్తిత్వాన్ని వీలైనంతవరకు సమాధి చెయ్యాలని  విశ్వప్రయత్నాలు చేసినా విఫలం కావడం ఏమాత్రం జీర్ణించుకోలేక, మింగలేక, కక్కలేక శ్లేష్మం లో పడిన ఈగలా, పీల్చి పిప్పి చేసిన తాటి తేగలా అల్లాడి పోతూ “అండర్ కవర్ అవినీతి” పేరుతో ఒక పెంటకుప్పను పాఠకుల మీదకు వదిలాడు.   
 
ఎన్‌టీఆర్‌ హయాంలో అసంతృప్తిని కాంగ్రెస్‌ అధిష్ఠానం ప్రోత్సహించినట్టుగా ఇప్పుడు వైసీపీలో అసంతృప్తిని భారతీయ జనతా పార్టీ అధిష్ఠానం ప్రోత్సహిస్తున్నదో లేదో తెలియదు. జగన్మోహన్‌రెడ్డికి ఇచ్చిన అపాయింట్‌మెంట్‌ను కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా చివరి నిమిషంలో రద్దు చేసుకోవడం వెనుక కారణాలు ఏమై ఉంటాయా? అని రాజకీయ పరిశీలకులు ఆరా తీయడం మొదలెట్టారు.
 
ఎవరబ్బా ఆ రాజకీయ పరిశీలకులు?  ప్రధాని, కేంద్ర మంత్రులు అనుమతి ఇవ్వడం, తరువాత రద్దు చేసుకోవడం ఇవాళ ఒక్క ఆంధ్రప్రదేశ్ లో ఒక్క జగన్ మోహన్ రెడ్డి విషయంలో మాత్రమే జరిగినట్లు ఎందుకా బుగ్గలు నొక్కుకోవడం?  గతంలో రాధాకృష్ణ యజమాని చంద్రబాబు “తాను ఇరవై తొమ్మిది సార్లు అపాయింట్మెంట్ కోరితే ప్రధాని అనుమతి నిరాకరించారని అధికారంలో ఉన్నప్పుడే ప్రకటించిన విషయం గుర్తు లేదా?  ఎన్టీఆర్ మొదటి పాలనా కాలంలో కాంగ్రెస్ ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నది.  కేంద్రంలో అధికారంలో ఉన్నది.  నాదెండ్ల భాస్కరరావును రెచ్చగొట్టి ఎన్టీఆర్ ను పడదోసింది.  మరి ఇప్పుడు భాజపాకు రాష్ట్రంలో అంత సన్నివేశం ఉన్నదా?  ఎక్కడా వర్డ్ మెంబర్ కూడా లేని భాజపా, నోటా కన్నా తక్కువ ఓట్లను తెచ్చుకున్న భాజపా….సాక్షాత్తూ రాష్ట్ర పార్టీ అధ్యక్షుడే  పన్నెండు లక్షల ఓట్లకు గాను  పదిహేను వేలు కూడా తెచ్చుకోలేని పాతాళ స్థాయిలో ఉన్న భాజపా…వైసిపిలో అసంతృప్తిని ప్రోత్సహించగలదా?  అయినా, ఎన్టీఆర్ ను పడదోసి కాంగ్రెస్ కు ఆనాడు ఏ గతి పట్టిందో తెలిసీ కూడా పటిష్టంగా ఉన్న అధికారపార్టీలో అసంతృప్తులను ప్రోత్సహించగల సాహసం చేయగలదా?  
 
****
“ఎంపీలలో అసంతృప్తి ఎక్కువగా ఉంది. వచ్చే ఎన్నికలనాటికి తెలుగుదేశం పార్టీతో అవగాహన ఉంటుందనీ, సీటు గ్యారంటీ అని హామీ ఇస్తే.. పది మందికిపైగా ఎంపీలు బీజేపీలో చేరడానికి సిద్ధంగా ఉన్నారని జోరుగా ప్రచారం జరుగుతోంది. రెండేళ్ల తర్వాత 90 శాతం మంత్రులను మారుస్తానని ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి ప్రారంభంలో ప్రకటించారు. దీన్నిబట్టి అప్పటివరకు అధికార పార్టీలో అసంతృప్తి అసమ్మతిగా మారకపోవచ్చునన్నది  ఒక అభిప్రాయం.”
 
 ఇప్పుడున్న అధికారపార్టీ ఎంపీలలో తొంభైశాతం మంది   జగన్మోహన్ రెడ్డి పేరుతో గెలిచినవారే అన్నదాంట్లో వారికి కూడా సందేహాలు లేవు.  ఒక టీచర్, ఒక ఫోటో స్టూడియో ఓనర్, ఒక పోలీసు ఉద్యోగి లాంటివారు వారి సొంత పేరుతో పోటీ చేస్తే కనీసం పది ఓట్లు అయినా వస్తాయా?   కనీసం తమ వీధిలోనివారికి కూడా తెలియని కొందరు పార్లమెంట్ లో అడుగుపెట్టగలిగారంటే అది జగన్ స్టామినా మాత్రమే.  అలాగే ఎమ్మెల్యేలు కూడా చాలామంది జగన్ గాలిలో గెలిచినవారే.  పదిమంది బీజేపీలో చేరటానికి సిద్ధం అని రాధాకృష్ణ వదరుతున్నాడంటే అది చంద్రబాబు ఎన్టీఆర్ కు వెన్నుపోటు పొడిచే సమయాన రామోజీరావు అనుసరించిన కుటిలనీతిని ఇప్పుడు రాధాకృష్ణ ప్రయోగిస్తున్నారు.  చంద్రబాబు దగ్గర పదిమంది ఎమ్మెల్యేలు కూడా లేకపోయినా, యాభై మంది వచ్చారు…వందమంది వచ్చారు… అరుగో..మరో పాతికమంది వస్తున్నారు…”అని పచ్చి అబద్ధాలు రాస్తూ ఎన్టీఆర్ పక్కన ఉన్న ఎమ్మెల్యేలలో భయాన్ని సృష్టించి చంద్రబాబు దగ్గరకు వచ్చేట్లు చేసిన రామోజీ డ్రామాను రాధాకృష్ణ ఆదర్శంగా తీసుకున్నట్లున్నారు..
 
****
“ఏడాది క్రితం చేసిన వ్యాఖ్యలకు విరుద్ధంగా నిబంధనలు అనుమతించవని తెలిసినా.. గ్రామ సచివాలయ భవనాలకు వై.ఎస్‌.ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ జెండా రంగులు వేయించారు. ప్రభుత్వ భవనాలకు రాజకీయ పార్టీల జెండా రంగులు వేయించడం సమ్మతం కాదని సర్వోన్నత న్యాయస్థానం స్పష్టంచేసినా ప్రభుత్వానికి లెక్క లేకుండా పోయింది. హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టు గతంలోనే సమర్థించినా, రంగులు తొలగించడానికి సిద్ధపడని జగన్‌ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు మరోమారు చీవాట్లు పెట్టింది.
 
ఎట్టెట్టా….రాజకీయ పార్టీల జెండా  రంగులు ప్రభుత్వ భవనాలకు వెయ్యడం సమ్మతం కాదని రాధాకృష్ణకు ఎప్పుడు తెలిసింది?  తన యజమాని అధికారంలో ఉన్న ఐదేళ్లలో కలగని జ్ఞానోదయం జగన్మోహన్రెడ్డి పాలనలో ఏ బోధివృక్షం నీడలో సేదదీరితే అయినదబ్బా?  ఆనాడు వాటర్ ట్యాంకులకు, మరుగుదొడ్లకు, ఎమ్మార్వో కార్యాలయాలకు,  సంక్షేమ పధకాల కింద అందించిన సైకిళ్ళు, కుట్టు మిషన్లకు పసుపు రంగు పులిమినపుడు రాధాకృష్ణ కళ్ళకు పచ్చ  కామెర్లు సోకి ఉండచ్చు.  చివరకు రోడ్ల మధ్యలో ఉండే డివైడర్లకు కూడా పసుపురంగు పూశారు అధికారులు.  ఆనాడు వైసిపి కోర్టుకు వెళ్ళలేదు…న్యాయస్థానాలు సుమోటోగా తీసుకోలేదు ఎందుకోమరి?  రాధాకృష్ణ దగ్గర జవాబు ఉన్నదా?  
 
***
“న్యాయ సమీక్షలో చెల్లదని తెలిసి కూడా తీసుకున్న ఒక నిర్ణయానికి దాదాపు మూడు వేల కోట్ల రూపాయల ప్రజాధనం వృథా చేశారని భావించాల్సి ఉంటుంది. ఇందుకు ఎవరు బాధ్యత తీసుకుంటారు? ఆదేశాలు ఇచ్చిన జగన్మోహన్‌రెడ్డి ఆ ఖర్చును భరిస్తారా? సదరు ఆదేశాలను గుడ్డిగా అమలుచేసిన అధికారులు చెల్లిస్తారా? సమాధానం చెప్పాల్సింది జగన్మోహన్‌రెడ్డి మాత్రమే!”
 
అబ్బా అబ్బా అబ్బా…ప్రజాధనం పట్ల ఎంత ఆపేక్ష మన రాధాకృష్ణకు!   ధర్మపోరాటదీక్షల కోసం, మరొక దీక్షలకోసం చంద్రబాబు కోట్లరూపాయల ప్రజాధనాన్ని ఖర్చు చేశారు….ఇక పరిశ్రమలకోసం అనే సాకుతో వందిమాగధ బృందాన్ని వెంటపెట్టుకుని ప్రపంచదేశాలన్నీ ప్రత్యేక విమానాల్లో జల్సాగా తిరిగారు.  ఇక కాంట్రాక్టులు, ప్రాజెక్టులు పేరుతో రెట్టింపు ప్రజాధనాన్ని పచ్చచొక్కాలవారికి దోచిపెట్టారు.  ఎన్నికలు ఆరుమాసాల్లో ఉన్నాయనగా పసుపుకుంకుమ పేరుతొ ముప్ఫయి వేలకోట్ల రూపాయల ప్రజాధనాన్ని పప్పు బెల్లాల్లా పంచేశారు…ఐదేళ్లు అధికారం వెలగబెట్టి రెండు లక్షల కోట్లు అప్పులు చేసి దిగిపోయారు…మరి ఆ ప్రజాధనాన్ని చంద్రబాబు కక్కుతారా?  రాధాకృష్ణ ఇస్తారా లేక చంద్రబాబు హయాంలో పనిచేసిన అధికారులతో కక్కిస్తారా చెప్పండి రాధాకృష్ణా! 
 
***
“16 నెలల జైలు జీవితం గడిపిన విజయసాయిరెడ్డి ఎంపీగా, జగన్మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఎన్నిక అయినప్పుడు వారు ఇంతకంటే భిన్నంగా ఎలా మాట్లాడతారు! “
 
మళ్ళీ అవే సైకిల్ కూతలు!   విజయసాయిరెడ్డి, జగన్ జైలు జీవితం గడపలేదు.  సిబిఐ అసమర్ధత, నిర్లక్ష్యం , కేంద్రం చేసిన కుట్ర కారణంగా వారికి చట్ట ప్రకారం రావలసిన బెయిల్ రాకుండా అడ్డుకోవడం వలన వారు రిమాండ్ లో గడిపారు తప్ప దాన్ని జైలు జీవితం అనరు.  ఒక నేరం రుజువై కోర్టు శిక్ష విధించి జైల్లో ఉన్నప్పుడు మాత్రమే జైలు జీవితం అనాలి.  ఈ సంగతి రాధాకృష్ణకు తెలియక కాదు…జగన్ మీదున్న పగ, ద్వేషాన్ని ప్రదర్శించుకోవడం మాత్రమే.  
 
****
“తెలుగుదేశం హయాంలో నాయకులు తిన్నప్పటికీ ప్రజలకు మాత్రం ఇసుక చవకగా లభించేది” అని బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు వ్యాఖ్యానించడం గమనార్హం.”
 
హమ్మయ్య…తెలుగుదేశం హయాంలో నాయకులు తిన్నారు అని రాధాకృష్ణ అంగీకరించడం సంతోషించదగిన అంశమే.  అయితే చంద్రబాబు సృష్టించిన ఇసుక అవినీతి సామాన్యమైంది కాదు.  ఇసుకతో వందలకోట్లు సంపాదించారు ఆనాడు తెలుగు తమ్ముళ్లు.  అలాంటి అవినీతికి తావు లేకుండా చెయ్యాలనే ప్రయత్నంలో ఇసుక విధానాన్ని పటిష్టంగా రూపొందించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయనేది సామాన్యుడికి కూడా తెలిసిన సత్యం.  ఇద్దరు ముగ్గురు ఎమ్మెల్యేలు గొంతు ఎత్తారనేది సత్యం.  కానీ, వారెవరు?  కాంగ్రెస్ పార్టీలో, వైఎస్ ప్రభుత్వంలో  అనేక మంత్రి పదవులు వెలగబెట్టి…ప్రస్తుతం ఎలాంటి పదవులు దక్కలేదని ఆక్రోశిస్తున్న అసంతృప్తులు మాత్రమే.  ఆ సంగతి ప్రజలకు తెలియనిదేమీ కాదు.  
 
***
ఇక అధికారుల మీద, మంత్రుల మీద, ఎమ్మెల్యేల మీద మైండ్ గేమ్ ను ప్రయోగించడానికి ప్రయత్నాలు చేస్తున్నారు రాధాకృష్ణ.  ఎవరైతే జగన్ కు వ్యతిరేకంగా మాట్లాడతారో వారికి తన పత్రికలో ప్రాధాన్యత ఇవ్వడం, వీలయితే వారికి గేలం వెయ్యడానికి ప్రయత్నించడం, గ్రామ వాలంటీర్లద్వారా అవినీతికి ఆస్కారం లేని పాలన సాగుతున్నదని ప్రతిపక్ష నాయకులు కూడా ఆంతరంగిక సంభాషణల్లో అంగీకరిస్తుంటే, మన రాధాకృష్ణ మాత్రం ఏదో రకంగా రెచ్చగొట్టి చంద్రబాబును ఎలాగైనా మళ్ళీ గద్దె ఎక్కించాలని తెగ ఊగిపోతున్నారు.  
 
అయితే రాధాకృష్ణ ఇలాంటి రాతలు రాస్తున్నారంటే అందుకు ఊతం ఇస్తున్నది ఎవరు?  రాధాకిష్ణతో టచ్ లో ఉంటున్నది ఎవరు?  తెలుగుదేశం, బీజేపీలతో సన్నిహితంగా ఉంటున్నది ఎవరు?  నమ్మకద్రోహం చేస్తున్నది ఎవరు?  బహిరంగంగా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నది ఎవరు?  ఎందుకు చేస్తున్నారు లాంటి అంశాల మీద వైసిపి నాయకత్వం దృష్టి పెట్టడం అవసరం. మరో నాదెండ్లను, మరో చంద్రబాబును ఆంధ్రప్రదేశ్ భరించలేకపోవచ్చు.  
 
 
Ilapavuluri Murali Mohan Rao
Ilapavuluri Murali Mohan Rao

ఇలపావులూరి మురళీ మోహన రావు 
సీనియర్ రాజకీయ విశ్లేషకులు