ఆ చెత్తపలుకులో ఏమున్నది గర్వకారణం?

 
“గజ్జి ఉన్నవాడికి లజ్జ ఉండదు”   అని సామెత!  జగన్ మోహన్ రెడ్డి మీద ప్రతివారం విషం చిమ్మడం, తమ కులస్తుల నుంచి అధికారం జారిపోయిందే అని ఆక్రోశం, ఇక సమీప భవిష్యత్తులో అధికారం వచ్చే అవకాశం లేదనే దుగ్ధ…తాము ఎంతగా పైకెత్తినా లోకేష్ నాయుడు పరమశుంఠగా ప్రజల్లో అపహాస్యం పాలుగావడం…వెరసి  రాధాకృష్ణ కడుపుమంటకు ఎన్ని ఆయుర్వేద యునానీ ఔషధాలు సేవించినా, కషాయాలు  ఆరగించినా విరుగుడు మాత్రం లభించడం లేదు.  ఎప్పటిలాగే “ఏమున్నది గర్వకారణం?” మకుటంతో మరొకసారి తన భ్రాంతులను వాంతులుగా పాఠకుల మెదళ్లపై కక్కాడు.  
 
***
“ఇదేమి పాలన? ఎన్నికల కమిషన్‌తో, న్యాయమూర్తులతో గొడవలా? ప్రత్యర్థులను అణచివేయడానికేనా అధికారం?” అంటూ అదే రోజు మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్‌ పలు ప్రశ్నలు సంధించారు. ఈ రెండు పరిణామాలు ఒకే రోజు జరగడం యాదృచ్ఛికం కావొచ్చు గానీ, నేపథ్యాన్ని అర్థం చేసుకుంటే ప్రస్తుత ప్రభుత్వంపై వ్యవస్థలలోని ప్రముఖులలో గూడు కట్టుకున్న అసంతృప్తికి సంకేతాలుగా భావించవచ్చు.” 
 
కోతికి కొబ్బరికాయ దొరికినట్లు రాధాకృష్ణకు మొన్న ఉండవల్లి చేసిన వ్యాఖ్యలు పసందుగా కనిపించాయి.  ఎందుకంటే ఆయన జగన్మోహన్ రెడ్డి మీద కొన్ని కటువైన విమర్శలు చేశారు.  ఆ విమర్శలలో వాస్తవం ఎంతో ఉండవల్లి కన్నా, ప్రజలకు బాగా తెలుసు.  ఉండవల్లి మీద నాకు అపారమైన గౌరవం ఉన్నది.  ఆయన నిజమైన మేధావి.  వైఎస్ కుటుంబానికి అత్యంత ఆప్తుడు.  జగన్ శ్రేయోభిలాషి.  ఆయన విమర్శల వెనుక ఉన్న మర్మం ఏమిటో ఆయన్ను అర్ధం చేసుకున్నవారికి మాత్రమే అవగతం అవుతుంది. 
 
కొంతమంది జగన్ అభిమానులు ఉండవల్లి మీద నోరు పారేసుకున్నారు తప్ప వైసిపి నాయకులు ఎవ్వరూ ఉండవల్లిని విమర్శించలేదు.  అయితే ఉండవల్లి గతంలో జగన్ ప్రభుత్వాన్ని ప్రశంసించిన ఉదంతాలు కూడా ఉన్నాయి.  మెచ్చుకున్నప్పుడు ఇదే అభిమానులు ఉండవల్లిని తెగ పొగిడేశారు.  చిన్న విమర్శలు చెయ్యగానే తిట్టడం మొదలు పెట్టారు.  ఇలాంటి దురభిమానులు ఎప్పటికైనా ప్రమాదకారులే.  ఉండవల్లి చెప్పింది జగన్ కు బాగా అర్ధం అయింది.  ఉండవల్లి గూర్చి జగన్ కు తెలిసినంతగా జగన్ అభిమానులకు తెలియదు.  కనుక ఆయన గూర్చి నోరు పారేసుకోకపోవడమే మంచిది. 
 
ఇక మేధావుల ఆలోచనలకు, సామాన్యుల ఆలోచనలకు ఎప్పుడూ లంకె కుదరదు.  ముందుగా అభివృద్ధి కార్యక్రమాల మీద దృష్టిని కేంద్రీకరించి ఆ తరువాత ప్రత్యర్థుల సంగతి చూస్తే అపకీర్తి రాదని ఉండవల్లి చెప్పారు.  వైఎస్ ప్రత్యర్థులను అణిచివేసిన విధానాన్ని గుర్తు చేసుకుంటే జగన్ అందులో వెయ్యో వంతు కూడా అణచివేయడం లేదు.  అయినప్పటికీ వైఎస్ కు చెడ్డపేరు రాలేదు.  కారణం ఆయన పాలించిన విధానం.  అభివృద్ధి, సంక్షేమం అనే జోడు గుర్రాల రధాన్ని ఉరకలెత్తించారు ఆయన.    అదే విధానాన్ని అనుసరించమని ఉండవల్లి మాటల్లోని ఆంతర్యం.  ఆ తరువాత నువ్వు ప్రత్యర్థులను నామరూపాలు చేసినా ఎవ్వరూ పట్టించుకోరని ఉండవల్లి మాటల వెనుక ఉన్న మర్మం.  
 
****
“ఆంధ్రప్రదేశ్‌లో కరోనా బాధితుల వివరాల విషయంలో ప్రభుత్వం పారదర్శకంగా వ్యవహరించడం లేదన్న అనుమానాలు పలువురిలో ఉన్నాయి. జిల్లా స్థాయిలో వైద్య ఆరోగ్య శాఖ అధికారులు ధ్రువీకరిస్తున్న కేసులను కూడా జిల్లా కలెక్టర్లు ప్రకటించడం లేదు. అదేమని ప్రశ్నించిన విలేకరులపై కేసులు పెడతామంటూ కొంతమంది జిల్లా కలెక్టర్లు బెదిరిస్తున్నారు. ‘యథా రాజా.. తథా అధికారులు’ అన్నట్టుగా పరిస్థితి ఉంది.”
 
దేశం మొత్తం మీద కరోనా కట్టడిలో ఆంధ్రప్రదేశ్ రెండో స్థానంలో ఉన్నదని మొన్ననే ఎవరో ప్రశంసించిన గుర్తు.  అలాగే కరోనా పరీక్షల విషయంలో కూడా దేశంలో ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానంలో ఉన్నదని విదేశీయులు సైతం మెచ్చుకుంటున్నారు.  దేశంలో ఎక్కడా లేనివిధంగా కరోనా వైరస్ ను కూడా ఆరోగ్యశ్రీలో చేర్చిన ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్.  రోజుకు పాతికవేలమందికి పైగా పరీక్షలు నిర్వహిస్తున్నారు.  మరి రాధాకృష్ణ చెప్పే ఆ పలువురు ఎవరు?  చంద్రబాబు, లోకేష్ అయిఉంటారు!  
 
***
“ఎన్నికల కమిషనర్‌ రమేశ్‌కుమార్‌ విషయంలో జగన్‌ ప్రభుత్వం తన వైఖరి మార్చుకోవడం లేదు. ఈనెల 13వ తేదీన హైదరాబాద్‌లోని పార్క్‌ హయత్‌ హోటల్‌లో భారతీయ జనతా పార్టీ ఎంపీ సుజనాచౌదరిని, అదే పార్టీకి చెందిన కామినేని శ్రీనివాస్‌, ఎన్నికల కమిషనర్‌ రమేశ్‌కుమార్‌ కలుసుకోవడాన్ని జగన్‌ అండ్‌ కో భూతద్దంలో పెట్టి చూపించడానికి ప్రయత్నించింది.” 
 
అరెరెరెరె….ఏమి నంగనాచి కబుర్లు!   ఏమి నయగారపు వాగుడు?!!  రమేష్ కుమార్ ను ఎన్నికల కమీషనర్ గా నియమించాలని హైకోర్టు తీర్పు ఇచ్చింది.  ఆ తీర్పుపై ప్రభుత్వం సుప్రీమ్ కోర్టు కు వెళ్ళింది.  హైకోర్టు తీర్పుపై   సుప్రీమ్ కోర్ట్ స్టే ఇవ్వలేదు.  విచారణ కొనసాగుతున్నది.  అందువలన ప్రభుత్వం ఆయన్ను మళ్ళీ నియమించలేదు.  ఒకవేళ సుప్రీమ్ కోర్ట్ తీర్పు నిమ్మగడ్డకు అనుకూలంగా వస్తే ఆయన్ని మళ్ళీ నియమించక తప్పదు.  అలాంటప్పుడు వివాదాలకు దూరంగా ఉండాల్సిన  ఆయన బీజేపీ నేతలను రహస్యంగా ఎందుకు కలిసినట్లు?  ముగ్గురూ కలిసి ఎవరితో చర్చించారు?  ఒకవేళ న్యాయస్థానాలను ఏవిధంగా ప్రభావితం చేయగలమో అని చర్చించారా?  లేక ఎవరిమీదైనా కుట్రలు పన్నారా? ఏ విధమైన కుతంత్రం లేకపోతె వారు వారి వారి ఇళ్లలోనే, గెస్ట్ హౌసుల్లోనో, ఆఫీసుల్లోనో కలవచ్చు కదా!  చంద్రబాబు ఏడాదిన్నర పాటు బస చేసిన హోటల్లో ఎందుకు మీటింగ్ పెట్టుకోవాలి?  అసలు బీజేపీ నాయకులను నిమ్మగడ్డ ఎందుకు, ఏ హోదాలో కలిశారు అన్న వివరాలు ప్రజలకు తెలియాలి కదా?  
 
వాస్తవంగా జరిగినదాన్నే మీడియాలో చూపిస్తే ఇంత రోదిస్తున్న రాధాకృష్ణ, జగన్ మోహన్ రెడ్డి అక్రమకేసుల్లో ఇరుక్కుని జైల్లో ఉన్నపుడు జగన్ మీద ఎన్నెన్ని నీచపు రాతలు రాసాడు? సిబిఐ అధికారి చేస్తున్న దర్యాప్తు వివరాలను డైలీ సీరియల్ గా ఎలా ప్రచురించాడు?  తొండలు కూడా   గుడ్లు పెట్టని ప్రాంతంలో లేళ్ళు తిరుగుతున్నాయని, సెలయేళ్ళు పారుతున్నాయని,. మయూరాలు నృత్యాలు చేస్తున్నాయని, అడవులను నాశనం చేసున్నారని  ఎన్ని కట్టుకథలు వండి వార్చాడు!  మరో పచ్చ పత్రిక ఈనాడు తన కార్టూన్లతో ఎంత పైశాచిక ఆనందం పొందింది?  ఇద్దరూ కలిసి ఒక క్షుద్ర అధికారిని అపర వివేకానందుడిగా ప్రజల మనసులలోకి ఎంత దారుణంగా విషాన్ని ఎక్కించారు?  రాధాకృష్ణకు మతిమరుపు ఉన్నంతమాత్రాన ప్రజలకూ ఉంటుందా?  
 
***
“జగన్‌ అవినీతికి పాల్పడలేదనీ, పులుకడిగిన ముత్యమనీ ప్రజలు ఆయనకు అధికారం కట్టబెట్టలేదు. రాజశేఖర్‌రెడ్డి కుమారుడు అవడం, దాదాపు పదేళ్లపాటు ముఖ్యమంత్రి పదవి కోసం కలవరిస్తూ ప్రజల్లోనే ఉండిపోవడంతో జాలిపడి అధికారం కట్టబెట్టారు.  అయితే ఇప్పుడాయన ముఖ్యమంత్రిగా ఉన్నారు కనుక ఆ పదవికి ఉన్న ఔన్నత్యం వల్ల ఆయనను అందరూ గౌరవిస్తున్నారు. ఇది గమనించని జగన్‌ తనను తాను మహాశక్తివంతుడిగా ఊహించుకుని రాజ్యాంగానికి కూడా తాను అతీతుడను అన్నట్టు దుందుడుకుతనాన్ని ప్రదర్శిస్తున్నారు. దీంతో అధికార పార్టీకి చెందిన కొంతమంది ఆయన భజన చేస్తూ పునీతులవుతున్నారు.”
 
వాహ్..వాహ్…పిచ్చి కుదిరింది..రోకలిని తలకు చుట్టమన్నాడుట ఎవరో…రాధాకృష్ణ మనఃస్థితి కూడా అలాగే ఉన్నట్లుంది…జగన్ పులుకడిగిన ముత్యమో కాదో తరువాతి సంగతి…సోనియా, అహ్మద్ పటేల్, చిదంబరం, చంద్రబాబు కుమ్మక్కై లక్ష్మీనారాయణతో జగన్ ను వేధించారని మాత్రం ప్రజలు అర్ధం చేసుకున్నారు.  లక్షకోట్లతో మొదలైన ఆరోపణలు దిగిదిగి నేడు కొద్దిపాటి వందల కోట్లకు వచ్చాయి.  అవి కూడా రుజువు కాలేదు.  సోనియాగాంధీ ముఠా జగన్ మీద కక్షతో జైల్లో పెట్టించిన అధికారులు అందరూ బయటకు వచ్చారు.  జగన్ మీద చేసిన అవినీతి ఆరోపణలలో వాస్తవం లేదని ప్రజాకోర్టులో అందరికీ అర్ధం అయింది.  చట్టబద్ధ న్యాయస్థానంలో ఏమి జరుగుతుందో ప్రస్తుతం చెప్పలేము.  ఒకవేళ జగన్ దోషి అని నిర్ధారణ అయితే ఆయన జైలుకు వెళ్తాడు.  అందులో సందేహం లేదు.  అంతమాత్రాన అప్పటిదాకా జగన్ ను దోషి అని ఎలా నమ్ముతారు?
 
ఇక రాజశేఖరరెడ్డి కొడుకు అని సానుభూతితో ప్రజలు అధికారం ఇచ్చేట్లయితే అది ప్రజల విజ్ఞతను అవమానించినట్లే.  అదే నిజమైతే 2014 లోనే జగన్ ను ప్రజలు గెలిపించేవారు.  అనుభవం ఉన్నవాడిని ఆలోచించి ఆనాడు చంద్రబాబును గెలిపించారు.  చంద్రబాబు అనుభవం దోపిడీ చెయ్యడంలో తప్ప పాలనలో కాదని అర్ధమై మొన్నటి ఎన్నికల్లో జగన్ ను గెలిపించారు.  అంతే కాకుండా సుమారు పదునాలుగు మాసాలపాటు జగన్ చేసిన 3648 కిలోమీటర్ల పాదయాత్ర…ప్రతి ఒక్కరినీ పలకరించడం, వారి సమస్యలను అవగాహన చేసుకోవడం,  నవరత్న పధకాలను ప్రకటించడం, చంద్రబాబు అవినీతిపాలనను తూర్పారబట్టడం లాంటి అనేక విశేషాలతో పాటు జగన్ వ్యక్తిత్వం ఏమిటో కూడా ప్రజలకు అర్ధమై ఆయన్ను అఖండమైన మెజారిటీతో గెలిపించారు తప్ప రాజశేఖర్ రెడ్డి కొడుకు అని కాదు!  
 
****
“వైసీపీలో ముఖ్యమంత్రి భజన చేస్తున్నవాళ్లంతా కలిసి జగన్‌ను కూడా ఎప్పుడో ఒకప్పుడు దేవుడే అని ముద్ర వేసేస్తారేమో తెలియదు! కొంతమందికి డబ్బు పంచినంత మాత్రాన దేవుళ్లు అయిపోరు. సంక్షేమ పథకాల ఫలాలు అనుభవిస్తున్నవాళ్లు కష్టపడి సంపాదించి పన్నులు చెల్లిస్తున్నవారికి కృతజ్ఞతలు చెప్పాలి గానీ, రాజకీయ నాయకులకు కాదు. జగన్‌ గానీ, చంద్రబాబు గానీ, కేసీఆర్‌ గానీ.. మరొకరు గానీ తమ జేబులో నుంచి తీసి పంచిపెట్టడంలేదు.”
 
ఓహోహో..హో..ఏమి సుద్దులు..ఏమి సుద్దులు..ఏమి బుద్ధులు!   చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు “జయము జయము చంద్రన్నా”  అంటూ భజనగీతాలు, స్తోత్రాల హడావిడి రాధాకృష్ణ బూజు పట్టిన బుర్రలోంచి మాయమై ఉండవచ్చు.  డబ్బు పంచితే దేవుళ్ళు అయిపోరు నిజమే. కేసీఆర్, జగన్ ఎవరూ తమ జేబుల్లోంచి డబ్బులు పంచిపెట్టడం లేదు అన్న మాట కూడా నిజాతినిజం.  మరి చంద్రబాబు పవర్ లో ఉన్నప్పుడు పంచిపెట్టిన డబ్బులు అన్నీ ఆయన తాతముత్తాతలు సంపాదించినా ఆస్తులలోంచి పంచిపెట్టారా?  ఎన్నికలు మరో మూడు నెలల్లో ఉన్నాయనగా పసుపుకుంకుమ పేరుతో పంచిపెట్టిన ముప్ఫయివేల కోట్ల రూపాయలు హెరిటేజ్ ఆస్తులను అమ్మేసి పంచిపెట్టారా?  ఈ స్పృహ ఆనాడు ఎందుకు కలగలేదు మిస్టర్ బాధాకృష్ణా?  
 
****
“అయ్యన్నపాత్రుడు వంటివారిపై నిర్భయ చట్టాన్ని కూడా ప్రయోగిస్తున్నారు. ప్రశ్నించే మీడియాపైనా కేసులు పెట్టుకుంటూపోతున్నారు. గుంటూరు జిల్లా మాచర్లలో వైసీపీకి చెందినవాళ్లు తెలుగుదేశం సానుభూతిపరుడిపై దాడి చేశారని వార్తలు వచ్చాయి. ఈ వార్త ప్రసారం చేసినందుకుగాను ”దాడి చేసిన వాళ్లు వైసీపీ వాళ్లు అనడానికి మీ వద్ద ఆధారాలు ఉన్నాయా? లేకపోతే మీపై చర్యలు తీసుకుంటాం” అని స్థానిక పోలీస్‌ అధికారి మీడియా ప్రతినిధులు కొందరికి నోటీసులు ఇచ్చారు. ఇలాంటి నోటీస్‌ జారీ చేసే అధికారాన్ని సదరు పోలీస్‌ అధికారికి ఎవరు ఇచ్చారో తెలియదు!”
 
అయ్యన్నపాత్రుడు వంటివాటిపై….!!! ఏమిది??  అయ్యన్న పాత్రుడు ఏమైనా దివినుంచి భువికి దిగివచ్చిన దేవుడా?  రాజ్యాంగానికి, చట్టానికి అతీతుడా?  ఆయన పై కేసులు పెట్టకూడదని ఏదైనా చట్టం ఉన్నదా?  ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఒక కథనం ప్రసారం అయినపుడు అందుకు ఆధారం ఏమిటో శాంతిభద్రతలను కాపాడాల్సిన బాధ్యత కలిగిన పోలీస్ అధికారి ప్రశ్నించడం నేరమా?  అదే నేరమైతే, చట్టవిరుద్ధమైతే కోర్టుకు వెళ్ళవచ్చు కదా!   అనుమానం ఉంటె ఎవరినైనా ప్రశ్నించే అధికారం, అరెస్ట్ చేసే అధికారం పోలీసులకు లేక మన రాధాకృష్ణకు, రామోజీరావుకు ఉన్నదా?  వెర్రితనం కాకపొతే?  
 
***
“ఒకప్పుడు జగన్‌రెడ్డిని సీబీఐ అధికారులు అరెస్ట్‌ చేసి జైలులో పెట్టడం వల్లనే కదా ఆయన పట్ల ప్రజలు సానుభూతి చూపించారు. అచ్చెన్నాయుడు, అయ్యన్నపాత్రుడు, చివరకు యనమల, చినరాజప్ప వంటివారిని ఇలాగే వేధిస్తే సానుభూతి పవనాలు వారివైపు మళ్లకుండా ఉంటాయా? రాజకీయ వ్యవస్థ, న్యాయ వ్యవస్థ, మీడియా వంటి ప్రధాన వ్యవస్థలన్నీ ఇవ్వాళ జగన్‌రెడ్డి ప్రభుత్వ బాధితులుగానే మిగిలాయి”
 
ముందుగా క్షుద్ర రాధాకృష్ణ తెలుసుకోవాల్సింది ఏమిటంటే…ముఖ్యమంత్రి పేరును సవ్యంగా పలకడం…ఆయన పేరు జగన్మోహన్ రెడ్డి…లేదా సింపుల్ గా జగన్.  అంతేకానీ జగన్ రెడ్డి అని పిలుస్తూ వికృతానందం పొందడం కాదు….చంద్రబాబును ఏనాడైనా చంద్రిగాడు అని ఉచ్చరించాడా రాధాకృష్ణ?  ఇక అచ్చెన్న, పాత్రుడు లాంటివారిని అక్రమంగా వేధిస్తే వాళ్ళు కూడా నిక్షేపంగా రాష్ట్రానికి ముఖ్యమంత్రులు కావచ్చు.  ఎవరికీ అభ్యంతరం ఉండదు.  
 
***
ఇంటిలోని పోరు ఇంతింత కాదయా అన్నాడు వేమన.  మన కులపోడి చేతినుంచి అధికారం జారిపోయిందే అన్న  రాధాకృష్ణ భగ్నహృదయం అనుభవించే వేదన కూడా అంతే!   చేసిన పాపం గోచిలో పెట్టుకుని ఎవరినో నిందిస్తే ఏమి ప్రయోజనం?  
 
 
Ilapavuluri Murali Mohan Rao
Ilapavuluri Murali Mohan Rao

ఇలపావులూరి మురళీ మోహన రావు 
సీనియర్ రాజకీయ విశ్లేషకులు