ఆముదవు విత్తనాలు ఆణిముత్యాలు అవుతాయా రాధాకృష్ణా?

YS Jagan and ABN Radha Krishna

ఎండ్రగాయ ఎప్పుడూ ఏటవాలుగానే నడుస్తుందన్నట్లు మన క్షుద్రజ్యోతి బాధాకృష్ణకు మూలశంక బాధ నానాటికీ అధికం అవున్నదే తప్ప ఆవగింజంత కూడా ఉపశమనం లభించడం లేదు.  తన కులంవాడికి అధికారం పోవడంతో పాటు తాను నరనరాన ద్వేషించే యువకుడు అధికారంలోకి వచ్చాడనే బాధ నరం మీద పుండులా సలుపుతుండటంతో ఆ ఆవేదనను, బాధను వారానికోసారి వాంతి చేసుకుంటే కానీ,  కాస్త అన్నం నోట్లోకి పోని పరిస్థితి….అందుకే ఈరోజు “న్యాయంతో పోరాటం” అంటూ అంతులేని తన మానసిక క్షోభను,  ఆరాటాన్ని ప్రజలకు అంటించడానికి ప్రయత్నించాడు.  కొన్ని అంశాలను అవధరిద్దాం.

***

“న్యాయవ్యవస్థ విమర్శలకు అతీతమా? అని ఎవరైనా అడిగితే కచ్చితంగా కాదనే సమాధానమే వస్తుంది. అయితే ఈ వెసులుబాటును ఉపయోగించుకుని న్యాయ వ్యవస్థనే బ్లాక్‌మెయిల్‌ చేయాలనుకుంటే! అదే జరిగినప్పుడు న్యాయమూర్తులే కాదు సమాజం కూడా నష్టపోతుంది. ఆంధ్రప్రదేశ్‌లో గడచిన రెండు మూడు రోజులుగా చోటుచేసుకుంటున్న పరిణామాలు ఆందోళనకరంగా ఉంటున్నాయి. రాష్ట్రంలో న్యాయ వ్యవస్థ తన పరిధిని అతిక్రమిస్తోందనీ, ప్రభుత్వం తీసుకునే విధానపరమైన నిర్ణయాలలో జోక్యం చేసుకుంటోందనీ శాసనసభ స్పీకర్‌ తమ్మినేని సీతారాం వ్యాఖ్యానించారు.”

Read More –కమ్యూనిస్టుల మధ్య కోల్డ్ వార్ – వైఎస్ జగన్ కారణమా?

 తమ్మినేని సంగతి పక్కన పెడదాం.  రాధాకృష్ణ ఎంతటి  గడుసువాడంటే…న్యాయవ్యవస్థ విమర్శలకు అతీతమా అని ఆయనే ప్రశ్నిస్తాడు.  కాదని ఆయనే జవాబిచ్చుకుంటాడు!  ఒకప్పుడు ఎంతో గౌరవించబడిన న్యాయవ్యవస్థ ఈరోజు ప్రశ్నలు ఎదుర్కొంటున్నదంటే కారణం ఎవరు?  న్యాయవ్యవస్థ ప్రవర్తన కాదా?   మొన్ననే తెలంగాణ హైకోర్టు “కేబినెట్ నిర్ణయాలను తప్పు పట్టలేము” అని సచివాలయ కూల్చివేతకు వ్యతిరేకంగా దాఖలైన పిటీషన్ ను కొట్టేసింది.  దాని  అర్ధం ఏమిటి ?    అనగా కేబినెట్ తీసుకునే నిర్ణయాలలో న్యాయస్థానాలు జోక్యం చేసుకోవడం న్యాయసూత్రాలకు విరుద్ధం అనే కదా అర్ధం!   మరి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు మాత్రం ప్రతి చిన్న నిర్ణయాన్ని కూడా తప్పు పడుతున్నదెందుకు?    ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ కేబినెట్ తీసుకున్న నిర్ణయాలకు ఆ నిర్ణయాలతో  ఎలాంటి సంబంధం లేని జగన్, మరికొందరు ఉన్నతాధికారులను బాధ్యులుగా చేసి కేసులు విచారించింది  దేనికి?  ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క తీరుగా వ్యవహరిస్తున్న న్యాయవ్యవస్థను తప్పు పట్టడం తప్పా?

*** 

“ప్రభుత్వం తీసుకునే విధాన నిర్ణయాలలో న్యాయస్థానాలు ఎలా జోక్యం చేసుకుంటాయని సీతారాం ప్రశ్నించడంలో హేతుబద్ధత ఉందా? అంటే లేదనే చెప్పాలి. ఉదాహరణకు ప్రభుత్వ కార్యాలయాలకు రాజకీయ పార్టీల జెండాల రంగులు వేయడాన్ని హైకోర్టుతోపాటు సుప్రీంకోర్టు కూడా తప్పుబట్టింది. నిబంధనలు అనుమతించని ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పుబట్టడం విధాన నిర్ణయాలలో జోక్యం చేసుకోవడం అవుతుందా?”

నిజమే…తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అన్న కాంటీన్లకు, వ్వాటర్ ట్యాంకులకు, పేదలకు పంపిణీ చేసిన సైకిళ్ళు, కుట్టు మిషన్లకు కూడా తెలుగుదేశం రంగులు పులిమినపుడు ఈ న్యాయస్థానాలు ఎందుకు జోక్యం చేసుకోలేదు?  అది రాజ్యాంగ విరుద్ధం అని ఎందుకు తీర్పు ఇవ్వలేదో రాధాకృష్ణ చెప్పగలరా?   అప్పట్లో వైసిపి కోర్టుకు వెళ్లిందో లేదో తెలియదు.  కానీ కోర్టులు సుమోటోగా తీసుకోవచ్చు కదా?  ఇక న్యాయమూర్తులు ఒక ముఖ్యమంత్రి ఇస్తున్న విందులో అర్ధరాత్రి పాల్గొనడం గతంలో ఎన్నడైనా చూశామా?  18  కేసుల్లో స్టే ఉన్న వ్యక్తి విందు ఇస్తే దానికి హైకోర్టు, సుప్రీమ్ కోర్ట్ న్యాయమూర్తులు పాల్గొనడం వెనుక రహస్యం ఏమిటో రాధాకృష్ణ చెప్పాలి.

Read More – పవన్ జగన్‌ను పొగిడితే టీడీపీ గింజుకుంటోంది ఎందుకో !

***

“తనను అక్రమంగా 16 నెలలపాటు జైలులో నిర్బంధించారని ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి నాడు వాపోవడం వల్లనే సుప్రీంకోర్టు ఆయనకు బెయిల్‌ మంజూరు చేసింది.”

ఏదొక విధంగా ఒకప్పుడు జగన్ జైల్లో ఉన్నాడని ప్రజలకు గుర్తు చెయ్యకపోతే రాధాకృష్ణకు ఆకలి ఉండదు. దాహం ఉండదు.  ఆ రోజుల్లో ఒక క్షుద్ర అధికారి జగన్ మీద  ఒక్క ఛార్జ్ షీట్ కు బదులుగా బాగా సమయం తీసుకుని  వరుసబెట్టి  పదకొండు  ఛార్జ్ షీట్లు వేసి నిందితుడికి రాజ్యాంగబద్ధంగా రావలసిన బెయిల్ ను అడ్డుకుని న్యాయాన్ని హత్యచేశాడు.  కోర్ట్ కూడా విడివిడిగా ఛార్జ్ షీట్లు వెయ్యడాన్ని తప్పు పట్టలేదు.  ఆశ్చర్యం కదూ!  పదహారు నెలల పాటు నిర్బంధించిన ఒక్క నేరాన్ని కూడా రుజువు చెయ్యలేక సిబిఐ చేతులు ఎత్తేసిన తరువాత మాత్రమే ఇక తప్పని స్థితిలో జగన్ కు బెయిల్ ఇవ్వాల్సివచ్చింది.  ఆ సంగతి ప్రజలకు తెలుసు కాబట్టే జగన్ నిర్దోషి అని నమ్మి అఖండమైన మెజారిటీతో గెలిపించారు.  జగన్ మీద కుట్రలు చేసిన కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీని భస్మం చేశారు! 

****

“అవినీతి కేసులలో విచారణను ఎదుర్కొంటున్న జగన్‌ అండ్‌ కోకు న్యాయశాస్త్రంలోని లొసుగులపై పూర్తి అవగాహన ఏర్పడి ఉంటుంది. కాలికి వేస్తే మెడకు.. మెడకు వేస్తే కాలికి తగులుకునేలా రకరకాల పిటిషన్లు దాఖలు చేస్తూ దశాబ్దం గడుస్తున్నా కేసులు విచారణకు రాకుండా అడ్డుకోగల నైపుణ్యాన్ని జగన్‌ అండ్‌ కో సొంతం చేసుకోగలిగింది.”

 అహో….రాధాకృష్ణ మెదడు పాదరసంతో తయారు చేసి ఉంటాడు బ్రహ్మదేవుడు.  జగన్ అండ్ కో కు అంత నైపుణ్యమే ఉంటే వాళ్ళు పదహారు నెలలు ఎందుకు జైల్లో గడుపుతారు?    చివరకు తనమీద విచారణను వేగవంతం చెయ్యాలని స్వయంగా జగన్ ఎందుకు పిటీషన్ వేసుకుంటాడు?  జగన్ కు అంత తెలివే ఉంటే  తన  మీద కేసులు విచారించడానికి ఆగమేఘాల మీద దేశం నలుమూలలనుంచి సిబ్బందిని రప్పించిన లక్ష్మీనారాయణ …చంద్రబాబు మీద కేసుల విచారణకు సిబ్బంది లేరని తప్పించుకున్నప్పుడు సిబ్బందిని తెప్పించుకోవాలని కోర్టులో పిటిషన్ వేయించి ఉండేవాడు కదా!  న్యాయవ్యవస్థలోని లొసుగులను వినియోగించుకోవడంలో చంద్రబాబును మించిన మొనగాడు ప్రపంచంలో మరొకడున్నాడా?   నాట్ బిఫోర్ మీ అనే అంకమ్మ తెలివితేటలు జగన్ కు ఎక్కడివి? 

***

“ఆర్టీసీ కార్మికులు సమ్మె చేసిన సమయంలో సమస్య పరిష్కారానికి వీలుగా సంస్థకు పూర్తిస్థాయి ఎండీని నియమించాలని తెలంగాణ హైకోర్టు సూచించింది. దీంతో అప్పటివరకు ఆర్టీసీకి ఎండీని నియమించడం కోసం కొంత కసరత్తు చేసిన కేసీఆర్‌.. ‘హైకోర్టు చెబితే నేను ఎండీని నియమించాలా?’ అన్నట్టుగా ఇప్పటివరకు ఆ సంస్థకు పూర్తిస్థాయి ఎండీని నియమించలేదు.”

ఎండి లేకపోయినా ఆర్టీసీ సమ్మె క్షణంలో పరిష్కారం అయిపొయింది కదా?  కేసీఆర్ ను తిట్టిన కార్మికులే కేసీఆర్ కు జేజేలు పలికారు కదా?  మరి తాను ఆదేశించిన విధంగా కేసీఆర్ ఆర్టీసీ ఎండీని నియమించలేదు కనుక కేసీఆర్ మీద కోర్టు ధిక్కార నేరం మోపాలని రాధాకృష్ణ హైకోర్టుకు సూచిస్తున్నారా?  కేసీఆర్ మీద కసి తీర్చుకోవాలని అనుకుంటున్నారా?  “కోర్టు చెప్పినట్లు వినకపోతే కోర్ట్ కొడతదా” అని కేసీఆర్ పబ్లిగ్గా అన్నా కోర్ట్ ఏమీ చెయ్యలేదే?  దీన్ని బట్టి అర్ధం అయ్యేది ఏమిటి?  నిర్ణయాలను తీసుకుని ప్రజాసమస్యలను పరిష్కరించే తుది అధికారం ప్రజా ప్రభుత్వానిదే కానీ కోర్టులది కాదు అని అర్ధం కావడం లేదా?

***

“ఇక రాజధాని అమరావతికి భూములు ఇచ్చిన రైతులు ఆందోళనబాట పట్టి 200 రోజులు అయింది. భూములు ఇచ్చినప్పుడు త్యాగమూర్తులుగా కొనియాడబడిన రైతులకు ఇప్పుడు కులం ముద్ర వేయడంతోపాటు స్వార్థపరులుగా దూషించడం జరుగుతోంది. అమరావతిని రాజధానిగా నాడు అంగీకరించిన ఇప్పటి ముఖ్యమంత్రి జగన్‌రెడ్డి అధికారంలోకి రాగానే నాలుక మడతేశారు. అధికార వికేంద్రీకరణ పేరిట మూడు రాజధానుల నినాదాన్ని ఎత్తుకున్న జగన్‌ ప్రభుత్వం ఏడాది గడచినా ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేదు. “

సెహబాష్!  రాజధాని అంటే ఒక్క అమరావతి ప్రాంతవాసులదే అన్నట్లుంది రాధాకృష్ణ రోదన!  కేంద్రం నియమించిన జస్టిస్ శివరామకృష్ణన్ కమిటీ అమరావతి ప్రాంతం రాజధానిగా పనికిరాదని స్పష్టంగా నివేదికను ఇచ్చినా ఎవరినడిగి దాన్ని చంద్రబాబు రాజధానిగా నిర్ణయించారు?  అన్నీ వసతులు ఉన్న విశాఖను రాజధానిగా చెయ్యాలని కొందరు ,  కమిటీ సూచినవిధంగా దొనకొండను రాజధాని చేయాలనీ కొందరు సూచించినప్పటికీ, కేవలం తన సామాజికవర్గం వారు అధికసంఖ్యలో ఉన్నారనే కదా అమరావతిని రాజధానిగా నిర్ణయించింది?  పదమూడు జిల్లాల చిన్న రాష్ట్రానికి నలభైవేల ఎకరాల రాజధాని దేనికి?  చంద్రబాబు, ఆయన ముఠా భూవ్యాపారం చేసుకోవడానికే కదా రైతులనుంచి బలవంతంగా భూములను సేకరించింది?  నిజంగా అమరావతియే రాజధానిగా ఉండాలని అక్కడి ప్రజలు కోరుకుంటే ఒకటి రెండు గ్రామాల ప్రజలు తప్ప మిగిలిన గ్రామాల ప్రజలెవ్వరూ ఉద్యమంలో పాల్గొనలేదేమి?  ఏ టెంట్ కింద చూసినా పదిమందో ఇరవైమందో మాత్రమే కనిపిస్తున్నారు.  వారు కూడా నిజమైన రైతులు కాదంటున్నారు.  దురాశకు పోయి  అధికధరలకు  భూములు కొనుగోలు చేసి ఇప్పుడు వాటి ధరలు తగ్గగానే పెడబొబ్బలు పెట్టె పిడికెడు మంది మాత్రమే అక్కడ కూర్చొని డ్రామాలు ప్రదర్శిస్తున్నారని లోకం కోడై కూస్తున్నది. 

Read More – అక్కినేని కోడ‌లు జీవితం త‌ల‌కిందులు

***

” ఒక సామాజికవర్గంపై గుడ్డిద్వేషంతో అమరావతిలో 90 శాతం పూర్తయిన భవనాలను కూడా పాడుబడేలా చేశారు. ఒక కులంపై కోపంతో బంగారు బాతు వంటి అమరావతిని చంపుకోవడం వివేకం ఎలా అవుతుంది? “

ఇప్పుడైనా అర్ధం అవుతుంది కదా అక్కడ రాజధాని ఎవరికోసం నిర్ణయించారో? కేవలం తమ సామాజిక వర్గం వారికోసమే అమరావతి అనేది ఈ ఒక్క మాటతో తేటతెల్లం కావడం లేదూ!  రాష్ట్రంలో బతుకుతున్నది ఆ ఒక్క సామాజికవర్గం వారే కాదు…రాజధాని అనేది అందరి మనోభావాలను దృష్టిలో పెట్టుకుని నిర్మించాలి కానీ, కేవలం తన కులం వారి ప్రయోజనాలకోసమే ఏర్పాటు చెయ్యాలని భావిస్తే ఫలితం ఇలాగే ఉంటుంది.  చంద్రబాబు తన కుల ప్రయోజనాలు దృష్టిలో

పెట్టుకున్నప్పటికీ, మరి ఆ ప్రాంతం వారికీ రాజధానిమీద ఆసక్తి నిజంగా ఉన్నదా?  నిజంగా ఆసక్తి ఉంటే వారు మొన్నటి ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని చిత్తుచిత్తుగా ఎందుకు ఓడిస్తారు?  చివరకు చంద్రబాబు కొడుకును కూడా ఎందుకు తరిమేస్తారు?  ఈ తీర్పు అంతరార్ధం ఏమిటి?  రాజధాని పేరుతో మూడు పంటలు పండే పచ్చని పొలాలను చంద్రబాబు నాశనం చేసాడని ఆ ప్రాంతవాసుల ఆగ్రహమే చంద్రబాబు ఓటమికి కారణం!  ఆ సంగతి గ్రహించకుండా ఇంకా రాజధాని పేరుతో పెయిడ్ ఆర్టిస్టులతో నాటకాలు ఆడిస్తే నామమెంత వెర్రితనంలో జనం లేరు. 

ఇక అమరావతి బంగారుబాతు అయిందా?  ఎవరికి?  రాజధాని పేరుతో లక్షలకోట్ల దోపిడీ, అవినీతికి పధకాలు వేసిన చంద్రబాబుకు, ఆయన్ను నమ్ముకున్న దోపిడీదొంగలకు.  బంగారు బాతు కావడానికి అమరావతిలో ఏముంది?   చంద్రబాబు భజనపరులు, పచ్చమీడియా గ్రాఫిక్స్ తో మాయాజాలం చేసిన విధంగా  వేలాదిమందికి ఉపాధి కల్పించే పరిశ్రమలు ఉన్నాయా?    సాగునీటి ప్రాజెక్టులు ఉన్నాయా?   సంపదను సృష్టించే ఉత్పత్తులు ఉన్నాయా?  ఐటి కంపీలు ఉన్నాయా?  రింగ్ రోడ్లు ఉన్నాయా?  మెట్రో రైళ్లు ఉన్నాయా?  విమానాశ్రయాలు ఉన్నాయా?  బులెట్ రైలు, కేబుల్ కార్లు ఉన్నాయా?  తమ రంగుల కలలు భగ్నం కావడంతో రాధాకృష్ణ మతి చలించి చేస్తున్న ప్రేలాపనలు కావా ఇవి?

***

“రాజధాని తరలింపు అన్న పదం ముఖ్యమంత్రి జగన్‌రెడ్డి నోటి వెంట వెలువడిన నాడే ఆంధ్రప్రదేశ్‌ అభివృద్ధికి మరణ శాసనం రాసినట్టు అయ్యింది. ప్రజలలో ఇప్పటికైనా చైతన్యం రాని పక్షంలో దేశంలోనే అత్యంత వెనుకబడిన రాష్ట్రాల జాబితాలో చేరడానికి ఆంధ్రప్రదేశ్‌కు ఎంతో సమయం పట్టదు. జరగాల్సిందంతా జరిగాక ఎంత వగచినా ప్రయోజనం ఉండదు. రాష్ట్రానికి పెట్టుబడులు ఎందుకు రావడం లేదో ప్రజలు ఆలోచించుకోవాలి. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రత్యేక హోదా అంటూ కలవరించిన జగన్మోహన్‌రెడ్డి.. ఇప్పుడు నోరు మెదపడం లేదు. “

 ఆహా…కౌరవహతకుల ఆర్తనాదములు  కడు శ్రవణానందకరముగ ఉన్నవే అని ఘటోత్కచుడు  అన్నట్లు  చంద్రబాబుకు అధికారం పోయిందే అన్న రాధాకృష్ణ ఆర్తనాదాలు చెవులకు చాలా ఇంపుగా ఉన్నాయి.  అధికారంలోకి వస్తే పదేళ్లు, కాదు కాదు పదిహేనేళ్ళు ప్రత్యోకహోదా తెస్తాం, ఇష్టం అంటూ వెంకన్న సాక్షిగా మోడీ, వెంకయ్య, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కోసిన సొరకాయకోతలు జనం చెవుల్లో మార్మోగిపోతున్నాయి.  అయిదేళ్ల కాలంలో నాలుగేళ్లపాటు మోడీ బాహుమూలల్లోనే నివసించిన చంద్రబాబు ఎందుకు ప్రత్యేకహోదా  సాధించలేకపోయారు?  ప్యాకేజీకోసం ఆశపడి, దానిలో ఓ యాభై వేలకోట్లు కొట్టెయ్యవచ్చు అనే దురాశతో ప్రత్యకహోదాకు సమాధి కట్టింది చంద్రబాబు కాదా?  మోడీకి పూర్తిస్థాయి మెజారిటీ రాక, మనమీద ఆధారపడి పరిస్థితి నెలకొని ఉన్నట్లయితే ప్రత్యకహోదాను డిమాండ్ చేసేవాళ్ళం అని జగన్ నిజాయితీగా అంగీకరించాడు.  రాధాకృష్ణ ఆ పాయింట్ మాత్రం ప్రస్తావించడు. 

**

ఒకటి మాత్రం నిజం.  రాధాకృష్ణ ఎంత విషం కక్కినా, ఎంత ఏడ్చినా, ఎంత గుండెలు బాదుకున్నా పురుషత్వం లేని అందగాడి జన్మలా  నిష్ప్రయోజనం.   రాజధాని మీద తమకు ఆసక్తి లేదని జనం ఏడాదిక్రితమే తిరుగులేని తీర్పు ఇచ్చారు.  జగన్ పాలన నచ్చకపోతే మళ్ళీ ఆ జనమే తీర్పు ఇస్తారు.  అంతవరకూ ఎదురు చూడాల్సిందే తప్ప ప్రజాస్వామ్యంలో రాధాకృష్ణ, రామోజీరావు వంటి  స్వార్థపరుల ఆటలు సాగవు. 

ఇలపావులూరి మురళీ మోహన రావు

సీనియర్ రాజకీయ విశ్లేషకులు