ఎన్నికలకు కేవలం నెలరోజుల ముందు వైసీపీలో చేరి నరసాపురం లోక్ సభ టికెట్ సాధించిన కనుమూరి రఘురామ కృష్ణంరాజు ఊహించని విధంగా పవన్ కళ్యాణ్ అన్నయ్య నాగబాబు, తెలుగుదేశం అభ్యర్థి శివరామరాజు లను సుమారు 32000 ఓట్ల ఆధిక్యత సాధించి విజేతగా నిలిచారు. అయితే ఏడాది తిరగకుండా రఘురామ రాజు ఏకంగా పార్టీ మీద తిరుగుబాటు ఎగరేశారు. ముఖ్యమంత్రిని కలవాలని ఎన్నిసార్లు ప్రయత్నించినా సాధ్యం కాలేదంటూ తన పార్టీ ఎమ్మెల్యేలు, ఇతర నాయకులపై విమర్శనాస్త్రాలు సంధించారు. ఇసుక మాఫియా చెలరేగిపోతున్నదని, వైసీపీ నేతలు దోపిడీ చేస్తున్నారని సంచలన ఆరోపణలు చేశారు.
దీంతో ఆగ్రహించిన నాయకత్వం ఆయనకు షోకాజ్ జారీ చేసింది. అయితే రఘురామరాజు ఏమాత్రం పట్టించుకోకుండా ఆ నోటీస్ లోని సాంకేతిక లోపాలను ఎత్తి చూపారు. ఒకరకంగా చెప్పాలంటే అధినాయకత్వం తీరును విమర్శించారు. అంతటితో ఆగకుండా వైసీపీ పట్ల విషాన్ని చిమ్మే పచ్చ మీడియాకు పండుగలా మారిపోయారు. రోజూ గంటల తరబడి ఆ ఛానెల్స్ కు ఇంటర్వ్యూలు ఇచ్చారు. డిబేట్ లో పాల్గొన్నారు. అయితే ఎక్కడా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డిని పన్నెత్తి విమర్శలు చెయ్యకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. తాను జగన్మోహన్ రెడ్డికి తప్ప మరెవ్వరికీ విధేయత చూపనని స్పష్టం చేశారు.
అంతేకాకుండా, తన కాళ్ళు గడ్డం పట్టుకుని బతిమాలడం వలన పార్టీలోకి వచ్చాను తప్ప తనంతట తాను రాలేదని చెప్పడంతో అగ్నిలో ఆజ్యం పోసినట్లయింది. కొందరు వైసీపీ ఎమ్మెల్యేలు, పార్టీ అభిమానులు ఆగ్రహంతో ఊగిపోయి, దమ్ముంటే రాజీనామా చేయాలని రాజుకు సవాల్ విసిరారు. మీరు అందరూ రాజీనామా చేస్తే తానూ చేస్తానంటూ రఘురామరాజు ప్రతి సవాల్ విసరడంతో ఆ ఎమ్మెల్యేలు అందరూ సైలెంట్ అయ్యారు. ఎందుకు? ఇక్కడే కొందరు రాజకీయ పండితులు వైసీపీ ఎమ్మెల్యేలు చేసిన ప్రకటనను తప్పు పడుతున్నారు.
ఒకసారి నరసాపురం రాజకీయ పరిస్థితులను పరిశీలిస్తే వాస్తవం బోధ పడుతుంది. ఒకవేళ ఉపఎన్నిక వచ్చిందే అనుకుందాం. రఘురామరాజు కు బీజేపీ టిక్కెట్ ఇస్తుంది. నరసాపురంలో అయిదుగురు వైసీపీ ఎమ్మెల్యేలు బొటాబొటీ మెజార్టీతో మాత్రమే గెలిచారు. బీజేపీ అనుగ్రహం కోసం అర్రులు జాస్తున్న తెలుగుదేశం, జనసేన పోటీకి దూరంగా ఉండి, బీజేపీ అభ్యర్థికి మద్దతు ఇస్తాయి. మరొక విషయం ఏమిటంటే వైసీపీ కార్యకర్తలు తమను నాయకులు ఎవ్వరూ పట్టించుకోకుండా వదిలేశారని అసంతృప్తితో రగిలిపోతున్నారని సమాచారం. వారెవ్వరూ వైసీపీ కోసం పనిచేసే వాతావరణం లేదు. గత ఎన్నికల్లో రఘురామరాజు కు వచ్చిన ఓట్లు 4,48,000. తెలుగుదేశం, జనసేన, కాంగ్రెస్ పార్టీలకు కలిపి వచ్చిన ఓట్లు 7,00,000. వైసీపీ ఓట్లు మొత్తం అలాగే పోల్ అవుతాయి అనుకున్నా, రఘురామరాజు కు ఏడు లక్షల ఓట్లు పడతాయి. ఈ సమీకరణాలు అన్నీ సమీక్షించుకున్న తరువాతే రాజుగారు తిరుగుబాటు చేశారని పరిశీలకుల అభిప్రాయం.
ఇక రాజుగారిని అనర్హులుగా చెయ్యడం కూడా అంత తేలిక కాదు. దానికి సభాపతి సహకరించాలి. అంటే మోడీ అంగీకరించాలి. రఘురామరాజుకు బీజేపీ అగ్రనేతలు అందరితో సత్సంబంధాలు ఉన్నాయి. ఆయనకు అతిపెద్ద అండ క్షత్రియ నాయకులు రాజనాథ్ సింగ్. కేంద్రమంత్రులు అందరూ రాజుగారికి చాలా సన్నిహితంగా ఉంటారు. కనుక జగన్ మాటను కేంద్రం మన్నించి రాజుగారిపై వేటు వేసే అవకాశాలు లేవనే చెప్పాలి. రాజును సస్పెండ్ చేస్తే ఆయన బీజేపీలో చేరి కేబినెట్ మంత్రి అవుతారు. తద్వారా రాష్ట్రానికి ఒక బీజేపీ ఎంపీని చేతులారా రాష్ట్రానికి సమర్పించుకున్నట్లే.
మరొక విషయం ఏమిటంటే సీబీఐ లక్ష్మీనారాయణ జగన్ ను వేటకుక్కలా వెంటాడుతున్న సమయంలో రఘురామరాజు జేడీ తన చెలికత్తెకు చేసిన కాల్స్ లిస్టును బయట పెట్టి ఆయన కోరలు పీకిన సంగతి మరువలేము. ఆ తరువాతే కేసులు చల్లబడి పోయాయి. రఘురామరాజు శక్తిని తక్కువ అంచనా వేస్తే పప్పులో కాలు వేసినట్లే.
ప్రస్తుతం వైసీపీకి కావలసింది ఒక ట్రబుల్ షూటర్. కాంగ్రెస్ పార్టీలో కెవిపి, అహ్మద్ పటేల్, బీజేపీలో మురళీధర్ రావు, టీఆరెస్ లో హరీష్ రావు లా ఒక రాజకీయ చాణక్యుడు. అన్నింటినీ జగనే చూసుకోవాలంటే కష్టం. కొందరు నాయకులు తమ అవివేకంతో జగన్ పనిభారాన్ని పెంచుతూ పార్టీకి నష్టం చేస్తున్నారు అని కొందరు వైసీపీ నాయకులు ప్రయివేటు సంభాషణల్లో అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అలా అని అవిధేయతను సహించడం కూడా కుదరదు. ఏ పార్టీకి అయినా క్రమశిక్షణ చాలా ముఖ్యం. ఇలాంటి సమస్యలను సున్నితంగా పరిష్కరించుకోవాలి.
ఈ వివాదం చినికి చినికి గాలివాన అవుతుందా లేక టీ కప్పులో తుఫానుగా మారుతుందా అని వేచిచూడాలి.
ఇలపావులూరి మురళీమోహన రావు
సీనియర్ రాజకీయ విశ్లేషకులు