చరిత్రను తిరగేసి చూస్తే ఎందరో రాజులు, చక్రవర్తులు కనిపిస్తారు. కానీ చంద్రగుప్తుడు, శ్రీకృష్ణదేవరాయలు, శ్రీహర్షుడు, అశోకుడు లాంటి నలుగురైదుగురు మాత్రమే ప్రజల నోళ్ళలో నానుతున్నారు. స్వాతంత్రం వచ్చాక అనేకమంది ప్రధానులు దేశాన్ని పాలించారు. కానీ పండిట్ నెహ్రు, ఇందిరమ్మ, పీవీ నరసింహారావు, వాజపేయి లు మాత్రమే ప్రజాహృదయాల్లో స్థానం సంపాదించుకున్న మహనీయులుగా వినుతికెక్కారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ను ఎందరో ముఖ్యమంత్రులు పాలించారు. కానీ ఎన్టీఆర్, వైఎస్సార్ మాత్రమే ప్రజారంజకులుగా ప్రజల గుండెల్లో స్థానం సంపాదించారు. కారణం? వారు సామాన్య, పేదవర్గాల ప్రజల హృదయ కవాటాలను తెరిచి చూశారు. వారికి పిడికెడు మెతుకులు, గుక్కెడు నీళ్లు, తలదాచుకోడానికి ఇంత నీడ అందించారు. నిరంతరం బడుగుల శ్రేయస్సు కోసం తపించారు. ఉమ్మడి రాష్ట్రాన్ని వెంకట్రామిరెడ్డి, కిరణ్ కుమార్ రెడ్డి, రోశయ్య కూడా పరిపాలించారు. వారిని ఎవరైనా స్మరించుకునేవారు ఉన్నారా?
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కాగానే వైఎస్ తొలి ఐదేళ్లలో ప్రవేశపెట్టిన అనేక సంక్షేమ పథకాలలో ఆరోగ్యశ్రీ, 104, 108 సంచార వాహనాలు ప్రధానమైనవి అని చెప్పొచ్చు. గుండెపోటు, మూత్రపిండాల సమస్యలు, లివర్ వ్యాధులు వంటి జబ్బులు వస్తే పేదవారికి మరణమే శరణ్యంగా వుండేది. పేదవారికి కూడా ఖరీదైన వైద్యం అందుబాటులో ఉండాలని తలచి ఆరోగ్యశ్రీ పథకాన్ని ప్రవేశపెట్టారు. లక్షలాదిమంది నిర్భాగ్యులు ఆ పధకం ద్వారా మృత్యుదేవత కొరలనుంచి తప్పించుకున్నారు. అలాగే రోడ్లమీద ప్రయాణిస్తూ ప్రమాదాలకు గురై దిక్కులేక ప్రాణాలు పోగొట్టుకొనే దుస్థితి నుంచి 104, 108 వాహనాలు రక్షించాయి. ఫోన్ చేసిన ఇరవై నిముషాల లోపే 108 అంబులెన్స్ వచ్చి బాధితులను ఆసుపత్రిలో చేర్చి ప్రాణాలు రక్షించేవి. వైఎస్ హఠాన్మరణం తరువాత వచ్చిన రోశయ్య., కిరణ్ కుమార్ రెడ్డి ఈ పథకాన్ని నిర్లక్ష్యం చెయ్యడంతో ఈ సర్వీసులు దాదాపు చచ్చిపోయాయి.
ఆంధ్రప్రదేశ్ రెండు ముక్కలు అయ్యాక ఎంతో అనుభవశాలి అని నమ్మి చంద్రబాబును ముఖ్యమంత్రిని చేశారు ఆంధ్రులు. కానీ కార్పొరేట్ కోటీశ్వరులు తప్ప పేదల మీద ఏమాత్రం మమకారం లేని చంద్రబాబు 108 వాహనాల ఊపిరి తీసేశారు. ఎందుకంటే 108 అంబులెన్స్ ను చూడగానే ప్రజలకు వైయస్సార్ గుర్తుకొస్తాడు. అంబులెన్స్ సైరన్ వినగానే కుయ్ కుయ్ కుయ్ అని వైఎస్సార్ నోటినుంచి వచ్చే శబ్దమే తలపుకొస్తుంది. అందుకే చంద్రబాబు 108 వాహనాల పీక నొక్కి రాక్షసానందాన్ని అనుభవించాడు. రోడ్ల మీద ప్రమాదానికి గురైతే కుక్కచావు చావాల్సిందే.
చంద్రబాబు దోపిడీ, అవినీతి పాలనను సహించలేని ప్రజలు ఆయన్ను తరిమికొట్టి జగన్ మోహన్ రెడ్డిని తమ ఏలికగా ఎన్నుకున్నారు. పాదయాత్ర లో వాగ్దానం ఇచ్చిన విధంగానే ఆరోగ్యశ్రీకి జీవం పోసి సుమారు 1000 రకాల వ్యాధులను ఆ పధకంలో చేర్చి పేదల ఆరోగ్య భాగ్యానికి అభయహస్తాన్ని అందించారు జగన్. ఏడాది కాగానే ఏకంగా 104, 108 వాహనాలను అందుబాటులోకి తెచ్చారు. ప్రతి మండలానికి ఒక వాహనాన్ని ఏర్పాటు చేశారు. ఫోన్ చేసిన 20 నిముషాల్లోనే వాహనం చేరుకునే ఏర్పాటు చేశారు. 200 కోట్ల రూపాయల ధనముతో 1088 వాహనాలను కొనుగోలు చేశారు. కరోనా కష్టదశలో ఉద్యోగుల జీతాలు చెల్లించడానికి కూడా ప్రభుత్వాలు ఇబ్బందులు పడుతుంటే….అంబులెన్స్ వాహనాల డ్రైవర్లు, టెక్నీషియన్ల జీతాలను ఒకేసారి యాభై శాతం పెంచి దేశాన్ని విభ్రమం గావించారు. జగన్ చర్యతో స్వర్గీయ వైఎస్సార్ ఆత్మ సంతోషిస్తుందని జగన్ కు మంగళహారతులు పడుతున్నారు ప్రజలు.
అయితే తెలుగుదేశం నాయకులు మాత్రం ఈ సంతోషాన్ని చూసి కడుపుమంటతో రగిలిపోతున్నారని వారి ప్రకటనలు తెలియజేస్తున్నాయి. వాహనాల కొనుగోలు వెనుక 300 కోట్ల రూపాయల కుంభకోణం ఉన్నదని వదరుతూ తమ లేకితనాన్ని ప్రదర్శిస్తున్నారు. అసలు మొత్తం కొనుగోలు లెక్క 200 కోట్లు అయితే 300 కోట్ల కుంభకోణం ఎలా అవుతుందో వారి విజ్ఞతకే వదిలేయాలి. ఇలాంటి పసలేని ఆరోపణలతో తెలుగుదేశం పార్టీ తమ పరువును పోగొట్టుకుంది.
ఏమైనప్పటికీ, ఏడాది లోగానే దేశంలోనే ఉత్తమ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి ఖ్యాతి పొందుతున్నారు అనేది నిర్వివాదం.
ఇలపావులూరి మురళీమోహన రావు
సీనియర్ రాజకీయ విశ్లేషకులు