తొలి ఎన్నికల్లో ఎదురుదెబ్బ తగిలినా ఏమాత్రం చలించక నిరంతరం ప్రజలమధ్యనే సంచరిస్తూ, దీక్షలు, ఉద్యమాలు, పాదయాత్రలతో రాష్ట్రప్రజల అనురాగాన్ని, అభిమానాన్ని చూరగొని, ప్రత్యర్థులను చిత్తుచిత్తుగా ఓడించి అధికారలక్ష్మిని చేపట్టి నేటికి ఏడాది కాలాన్ని పూర్తి చేసుకున్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. ఒకవంక సిబిఐ కేసులు, మరొకవంక పత్రికల విషప్రచారం, నిండు యవ్వనంలో…. రుజువుకాని నేరాల ఆరోపణలతో పదహారు నెలల జైలు జీవితం, వ్యక్తిత్వహననానికి కత్తిగట్టి విషప్రచారాలతో విరుచుకుని పడుతున్న పచ్చ మీడియా ఆగడాలు, ఒంటరి జీవితం, ఆస్తుల స్తంభన..ఇన్ని చికాకులు, చిక్కుల మధ్య కూడా మొక్కవోని సాహసంతో జగన్ సాగించిన ఒంటరి పోరాటం అనితర సాధ్యం. జగన్ చిత్తశుద్ధిని, ప్రజల పట్ల ఆయనకు గల మమకారాన్ని, ప్రజలకేదైనా మేలు చేయాలనే మహత్తర సంకల్పాన్ని ప్రజలు గమనించారు. ఫలితమే చరిత్రలోనే కనీవినీ ఎరుగని ఆధిక్యతను కట్టబెట్టారు.
2019 మే 30 వ తారీఖున రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో పారదర్శకతకు, విలువలకు, నైతికవర్తనకు పెద్దపీట వేశారు. అవినీతిని అరికట్టడానికి అన్నిరకాల ప్రయత్నాలను చేశారు. పాదయాత్రలో ప్రకటించిన నవరత్నాలను శరవేగంగా అమలు చేస్తున్నారు. ఇచ్చిన హామీలలో ఐదేళ్లలో నెరవేర్చాల్సిన హామీలను ఏడాదిలోపే తొంభై శాతం పూర్తి చేశారు. తన పధకాల వలన లబ్ది పొందని కుటుంబం ఉండకూడదని జగన్ సంకల్పించినట్లు తోస్తున్నది. అందుకనే గత దశాబ్దాలుగా కేవలం అగ్రవర్ణం అనే కారణంగా నిర్లక్ష్యానికి గురవుతున్న వారిని కూడా ఆదరించారు. పరిపాలనలో ఎలాంటి లోపం లేదు.
జగన్ చేపట్టిన అనేక కార్యక్రమాలు దేశవ్యాప్తంగా కూడా ప్రశంసలు పొందాయి. జగన్ కార్యక్రమాలను ఇతర రాష్ట్రాలవారు కూడా అధ్యయనం చేస్తున్నారు. ముఖ్యంగా దివాళా తీసిన రాష్ట్రంలో సుమారు నలభవేలకోట్ల రూపాయలను సంక్షేమ పథకాల కోసం వెచ్చించాలంటే ఎంత గుండె ధైర్యం కావాలి! తనకు కావాల్సింది ఏమిటో జగన్ కు బాగా తెలుసు. అందుకే ఆయన ప్రతిపక్ష పార్టీలనుంచి ఎన్ని విమర్శలు వస్తున్నా, జడవకుండా తనదైన పంధాలో దూసుకుని వెళ్తున్నారు. గత ఏడాదికి నేటికి సామాన్య జనాల్లో జగన్ గ్రాఫ్ పెరుతున్నదే తప్ప తరగడం లేదు అనేది నిస్సందేహం. తెలుగుదేశం పార్టీ, దాని బానిస పత్రికలు, ఛానెల్స్ జగన్ కు వ్యతిరేకంగా నిరంతర దుష్ప్రచారం చేస్తున్నా, ప్రజలు పట్టించుకోవడం లేదు.
అయితే జగన్ ఎన్ని పనులు చేస్తున్నా, న్యాయస్థానం నుంచి ఆయనకు ఎదురుదెబ్బలు తప్పడం లేదు. తాజాగా జగన్ ప్రభుత్వం ఆర్డినెన్స్ ద్వారా తొలగించిన రాష్ట్ర ఎన్నికల కమీషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ను తిరిగి నియమిస్తూ హైకోర్టు తీర్పు ఇవ్వడం జగన్ ప్రభుత్వానికి శరాఘాతం అని చెప్పాలి. ఎందుకంటే జగన్ స్వయంగా ఈ వ్యవహారంలో జోక్యం చేసుకుని ప్రత్యేకంగా పత్రికాసమావేశాన్ని కూడా నిర్వహించి ఎన్నికల కమీషనర్ మీద ఆరోపణలు చేశారు. హడావిడిగా చెన్నై నుంచి మాజీ న్యాయమూర్తిని తీసుకొచ్చి ఎన్నికల కమీషనర్ గా ప్రతిష్టించారు. ఆ చర్యను కోర్టు కొట్టేయడంతో ప్రభుత్వం యొక్క పరువు ప్రతిష్టలను మంటగలిపినట్లే భావించాలి. ముఖ్యంగా ఒక్క ఏడాది కాలంలో అరవై అయిదు సార్లు హైకోర్టు జగన్ ప్రభుత్వాన్ని తప్పు పట్టిందంటే ఇంతవరకు ఎక్కడా మనం వినలేదు. ఎందుకు ఇలా జరుగుతున్నది అనే ఆత్మపరిశీలన చేసుకోవడం అవసరం.
Also Read – అయాచితంగా వచ్చిన పదవి కాదు
అయితే దురదృష్టవశాత్తు చాలామంది వైసిపి నాయకులు, జగన్ అభిమానులు న్యాయ స్థానాలను తప్పు పడుతున్నారు. న్యాయమూర్తులకు దురుద్దేశాలను ఆపాదించడం ద్వారా జగన్ కు తెలియకుండానే పెద్ద అపకారాన్ని చేస్తున్నారు. ప్రజాస్వామ్యంలో ప్రజలతో ఎన్నికైన ప్రభుత్వాలదే అంతిమ అధికారం అనేది సాధారణ అభిప్రాయం. ప్రజాప్రభుత్వాలు ఇచ్చే ఆదేశాలు, జీవోలు, చట్టాలు శిరోధార్యం అని అపోహ పడుతుంటారు. ఇది కేవలం నాయకుడి పట్ల గూడుకట్టుకుని ఉన్న ఆరాధనాభావం తప్ప రాజ్యాంగం, చట్టం పట్ల వారి అవగాహనారాహిత్యాన్ని మాత్రమే సూచిస్తుంది. ఎవరైనా మంచి ఉద్దేశ్యంతో ఆలోచనలో, అనుభవంతో ఏదైనా సలహా ఇవ్వబోతే వారిమీద విరుచుకుని పడతారు. దూషిస్తారు. అలాంటి ప్రవర్తన వారి నాయకుడికి, పార్టీకి మరింత చెడు చేస్తుంది తప్ప అనుభవజ్ఞులకు వాటిల్లే నష్టం ఏమీ ఉండదు అని వారు గ్రహించాలి.
న్యాయస్థానం నుంచి ఎదురు దెబ్బలు తిన్నవారిలో తొలి ముఖ్యమంత్రి జగన్ కాదు. గతంలో ఇందిరాగాంధీ, ఎన్టీఆర్ సైతం కోర్టు నుంచి చీవాట్లు తిన్నారు. ఇందిరాగాంధీని అయితే నాటి హైకోర్టులు, సుప్రీమ్ కోర్ట్ వేధించుకుని తిన్నాయి. చివరకు చిన్న సాంకేతిక కారణాలు చూపించి ఆమె ఎన్నికను కూడా రద్దు చేసింది అలహాబాద్ హైకోర్టు. అయితే ఆ తరువాత ఆమె తెలివిగా వ్యవహరించి కొన్ని చర్యలను చేపట్టడం ద్వారా న్యాయస్థానాలను ప్రసన్నం చేసుకున్నారు. ఆ తరువాత ఆమె పాలన సాఫీగా సాగింది. అంతే తప్ప ఆమె న్యాయస్థానాలను బహిరంగంగా నిందించలేదు.
ఇక ఎన్టీఆర్ కూడా తొలిసారి, రెండోసారి ముఖ్యమంత్రి అయ్యాక కోర్ట్ నుంచి ఎన్నోసార్లు మొట్టికాయలు వేయించుకున్నారు. ఒకదశలో సహనం చచ్చిన ఎన్టీఆర్ “నాకు ఈ కోర్టులకంటే ప్రజాకోర్టులే ముఖ్యం…నేను అక్కడే తేల్చుకుంటాను” అని ఆవేశంగా ప్రకటించారు. ఎన్టీఆర్ ఎంత గొంతు చించుకున్నప్పటికీ, కాంగ్రెస్ నాయకుడు ద్రోణంరాజు సత్యనారాయణ ఎన్టీఆర్ పై వేసిన అవినీతి కేసుల్లో ఎన్టీఆర్ ను తప్పు పట్టింది హైకోర్టు. ఆ ప్రభావం కొంతవరకు జనం మీద పనిచేసింది. మరుసటి ఎన్నికల్లో ఎన్టీఆర్ కు ఘోర పరాజయం ఎదురైంది. కనుక న్యాయస్థానాలు చాలా శక్తివంతమైనవి అని ప్రభుత్వాలు, పార్టీలు, అభిమానులు గ్రహించాలి. అలాంటి రక్షణను వారికి రాజ్యాంగం కల్పించింది అని గుర్తెరగాలి. నిజమైన అభిమానులు నాయకుడికి సరైన సలహాలు, సూచనలు ఇస్తూ ఎప్పుడైనా దారితప్పితే నిష్కర్షగా నాయకుడి దృష్టికి తీసుకెళ్లాలి.
Also Read ఆంధ్ర ప్రదేశ్ లో అంతా రాజ్యాంగబద్ధమే!
తెలంగాణాలో కేసీఆర్ వీరాభిమానులు సైతం కేసీఆర్ ఏదైనా తప్పు చేశారనిపిస్తే నిర్మోహగమాటంగా సోషల్ మీడియాలో విమర్శిస్తారు. మొన్న లాక్ డౌన్ అమలులో ఉన్నపుడు మద్యం షాపులకు అనుమతి ఇవ్వడాన్ని కేసీఆర్ కరుడుగట్టిన అభిమానులు కూడా తీవ్రంగా విమర్శించారు. కేసీఆర్ కు కూడా హైకోర్టు నుంచి అనేకమార్లు అడ్డంకులు ఎదురయ్యాయి. అయినప్పటికీ, ఏ ఒక్క అభిమాని కూడా కోర్టులను, న్యాయమూర్తులను విమర్శించలేదు. కానీ, ఆంధ్రప్రదేశ్ లో అందుకు భిన్నమైన వాతావరణం కనిపిస్తున్నది. నాయకుడిని గుడ్డిగా వెనకేసుకొని రావడం అభిమానం అనిపించుకోదు. నాయకుడికి కష్టాలు వస్తే అభిమానులు కూడా కష్టాలు ఎదుర్కోవాల్సివస్తుందని గ్రహించకుండా “”మా నాయకుడికి అన్నీ తెలుసు, ఎవరూ సలహాలు ఇవ్వాల్సిన పనిలేదు” అంటూ ఎదురుదాడికి దిగడం అంటే నాయకుడి పతనానికి రాజబాటలు వేస్తున్నట్లే. ఆ సలహాలు ఇచ్చేవారు కూడా నాయకుడి పట్ల అభిమానంతోనే ఇస్తారని గ్రహించండి.
జగన్ కు ఇంకా నాలుగేళ్ల వ్యవధి ఉన్నది. ప్రస్తుతం ఎదురవుతున్న ఇబ్బందులు కేవలం బాలారిష్టాలు. లోపాలు ఎక్కడున్నాయో పరిశీలించుకుని, అవసరమైతే ప్రస్తుతం ఉన్న సలహాదారులను, న్యాయ సలహాదారులను, అధికారులను తొలగించి అనుభవం కలిగినవారిని నియమించుకోవడం, రాజ్యాంగ నిపుణుల సలహాలను తీసుకోవడం అవసరం. అలాగే కేంద్రంతో సత్సంబంధాలు నెలకొల్పుకోవడం, అందుకు తగిన లాబీయింగ్ వ్యవస్థను నిర్మించుకోవడం అవశ్యం. పదేపదే కోర్ట్ నుంచి అడ్డంకులు ఎదురుకావడం అభిలషణీయం కాదు. న్యాయస్థానాలు కూడా ప్రజాప్రభుత్వాలకు విలువ ఇచ్చి, అవేమైనా తప్పులు చేస్తుంటే సవరించడం, సలహాలు ఇవ్వడం అవసరం,. ప్రభుత్వం మీద పరుషమైన వ్యాఖ్యలు చెయ్యడం ప్రజాస్వామ్య స్ఫూర్తిని పరిహాసపత్రం చేస్తుంది. ఒకరినొకరు సమన్వయించుకుని అంతిమంగా ప్రజలకోసం ఈ వ్యవస్థలు పనిచేయాలి.
ప్రమాణస్వీకారం చేపట్టి ఏడాదిని పూర్తి చేసుకున్న సందర్భంగా జగన్మోహన్ రెడ్డికి హృదయపూర్వక శుభాకాంక్షలు. తండ్రిని మించిన తనయుడిగా కీర్తిప్రతిష్టలు ఆర్జించాలని ఆకాంక్షిస్తున్నాను.
ఇలపావులూరి మురళీ మోహన రావు
సీనియర్ రాజకీయ విశ్లేషకులు