అద్దాలమేడలో కూర్చుని రాళ్లు విసురుతున్న తెలుగుదేశం 

లాక్ డౌన్ మరో రెండు రోజుల్లో విధించబోతున్నారని తెలుగుదేశం అధినేత చంద్రబాబుకు బీజేపీలోని ఆయన బానిసలు ఎవరైనా ముందుగానే ఉప్పందించారా?  సాధారణంగా వారాంతంలో హైద్రాబాద్ వెళ్లి విశ్రాంతి తీసుకునే చంద్రబాబు ఈసారి రెండు రోజులు ముందుగానే హైదరాబాద్ ఎందుకు వెళ్లిపోయారు?  మొత్తానికి ఆంధ్రప్రదేశ్ లో కరోనా వైరస్ ఉధృతంగా వ్యాపిస్తున్న తరుణంలో చంద్రబాబు చాలా తెలివిగా తెలంగాణ రాష్ట్రంలోని తన రాజభవనానికి చెక్కేసి గొప్ప ముప్పును తప్పించుకున్నారు.  హైద్రాబాద్ వెళ్లిన మరుక్షణం నుంచే జగన్ మీద, జగన్ ప్రభుత్వం మీద బురద చల్లే కార్యక్రమాన్ని ప్రారంభించారు.  ఇక చంద్రబాబు వందిమాగధులు, ఎల్లో మీడియా ఊరుకుంటారా?  అన్ని చానెళ్లు కలిపి కట్టగట్టుకుని ప్రతిరోజూ ఏదోఒక అంశం తీసుకుని జగన్ ను విమర్శించడం తమ విధి అన్నట్లు దుమ్మెత్తిపోయడం మొదలు పెట్టారు.  
 
మొదట్లో కరోనా టెస్టులు చెయ్యడం లేదంటూ ఆరోపణలు ప్రారంభించారు.  ఆ తరువాత టెస్టులు చెయ్యడంలో దేశంలోనే అగ్రగామిగా ఆంధ్రప్రదేశ్ నిలిచింది.  ఇప్పటికి దాదాపు లక్షకు పైగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కరోనా పరీక్షలను నిర్వహించింది.  దక్షిణ కొరియా నుంచి లక్ష రాపిడ్ టెస్ట్ కిట్లను అందరికన్నా తక్కువ ధరకు కొనుగోలు చేసింది.  అయితే, ఆ కిట్ల కొనుగోలులో పెద్ద కుంభకోణం జరిగిందంటూ బీజేపీలోని చంద్రబాబు పెద్ద బానిస కన్నా లక్ష్మీనారాయణ పెడబొబ్బలు పెట్టడం మొదలు పెట్టాడు.   అయితే అదే రోజున కర్ణాటక ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం కూడా ఆంధ్రప్రదేశ్ కొన్న ధరకన్నా అరవై అయిదు రూపాయలు అధికంగా చెల్లిస్తూ కిట్లను కొనుగోలు చెయ్యడంతో కన్నా నోరు మూతపడింది.  అంతే కాదు..ఈ విషయంలో కన్నా లక్ష్మీనారాయణ జాతీయ నాయకత్వంతో ముక్క చీవాట్లు తిని అబాసుపాలైపోయాడు.  
 
ఇక మాజీ ఎన్నికల కమీషనర్ నిమ్మగడ్డ వ్యవహారం కూడా చంద్రబాబు చేసిన అల్లరి కుట్రలో ఒక భాగమే అని వేరే చెప్పాల్సిన అవసరం లేదు.  హోమ్ శాఖకు ఉత్తరం ఒకసారి రాయలేదని, మరొకసారి రాశానని ఒక తప్పును కప్పిపుచ్చుకోవడానికి మరిన్ని అబద్ధాలు ఆడి ఎన్నికల సంఘం పరువును తీసేశాడు నిమ్మగడ్డ.   నిమ్మగడ్డ వ్యవహారంలో ఏదో కుట్ర శంకించిన రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి నిమ్మగడ్డ లేఖపై దర్యాప్తు జరిపించాలని కోరడంతో సీఐడీ రంగంలోకి దిగడంతో భయపడిపోయిన నిమ్మగడ్డ తెలుగుదేశం అధినేతలను రక్షించడం కోసం ఆ లేఖ తానె రాశానని మరో అబద్ధం ఆడి పరువు పోగొట్టుకున్నాడు.  ప్రస్తుతం ఈ విషయం హైకోర్టు విచారణలో ఉన్నది.  రేపు సోమవారం ఈ విషయంపై తుదివిచారణ జరుగుతుంది.  తీర్పు ఎలా వస్తుందో చూడాలి.  
 
ఇక ఇదే సమయంలో తెలుగుమీడియం కొనసాగించాలని మరో  తైనాతీతో కోర్టులో కేసు వేయించాడు చంద్రబాబు.  ఈ విషయంలో ప్రభుత్వానికి తాత్కాలిక ఎదురు దెబ్బ తగిలినప్పటికీ, 95 శాతం  తల్లితండ్రుల అభిప్రాయం ఆంగ్ల మాధ్యమానికి అనుకూలంగా ఉండటంతో తాను అనుకున్న మార్గంలోనే జగన్ వెళ్లడం తధ్యం.  
 
ప్రజలు ఎంతగా చీదరించుకున్నప్పటికీ, చంద్రబాబు, ఆయన పార్టీ వారి దుర్బుద్ధులు మాత్రం మారిన సూచనలు కనిపించడం లేదు.  జగన్ కు కోర్టులో తగిలే ఎదురు దెబ్బలు అన్నీ, చంద్రబాబు కారణంగానే అనే అభిప్రాయం ప్రజల్లోకి వెళ్ళిపోయింది.  జగన్ ఆధునిక భావాలను, సరికొత్త పాలనా విధానాలను చంద్రబాబు జీర్ణించుకోలేకపోతున్నాడని, ఇదే విధంగా జగన్ పాలన కొనసాగితే రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పూర్తిస్థాయిలో భూస్థాపితం అయిపోతుందని ప్రజలు ఇప్పటికే నమ్ముతున్నారు.  ఇదే చంద్రబాబులో భయం పెంచుతున్నది.  
 
ఇక చంద్రబాబే అనుకుంటే, ఆయన బానిసలైన కమ్యూనిస్ట్, కాంగ్రెస్, జనసేన నాయకులు కూడా తామేమీ తక్కువ తినలేదన్నట్లు ఒకేసారి జగన్ మీద రకరకాల ఆరోపణలతో విరుచుకుని పడుతున్నారు.  గుజరాత్ లో చిక్కుకుని పోయిన మత్స్యకార్మికులను ఆంధ్రప్రదేశ్ కు రప్పించడానికి జగన్ నానా తంటాలు పడి విజయం సాధిస్తే, ఆ ఘనకీర్తి అంతా గుజరాత్ ముఖ్యమంత్రిదే అన్నట్లు జనసేనాధిపతి పవన్ కళ్యాణ్ ట్వీట్ చెయ్యడం ఆ పార్టీని నవ్వులపాలు చేసింది.  అదే సమయంలో ఆ పార్టీ అధికారప్రతినిధి పేస్ బుక్ లో ఒక తప్పుడు పోస్ట్ పెట్టి పోలీస్ కేసులో ఇరుక్కున్నప్పుడు ఆయనకు తాము అండగా నిలబడబోమని, ఎవరి కేసులకు వారిదే బాధ్యత అని జనసేన నాయకులు ప్రకటించడంతో జనసైనికులు అందరూ దిగ్భ్రాంతికి లోనయ్యారు.  పవన్ ను నమ్ముకోవడం అంటే కుక్కతోక పట్టుకుని గోదావరి ఈదడం లాంటిదే అని వారికి బాగా అర్ధమయింది.  
 
ఇక కరోనాను దృష్టిలో పెట్టుకుని విధించిన లాక్ డౌన్ విషయంలో జగన్ చేసిన ప్రకటనలు ఆయన దూరదృష్టిని, విషయపరిజ్ఞానాన్ని తేటతెల్లం చేశాయి.   సుదీర్ఘ లాక్ డౌన్ ఆర్థికవ్యవస్థను దెబ్బ తీస్తుందని, కరొనతో సహజీవనానికి అలవాటు పడాలని జగన్ చేసిన ప్రకటనలో ఎంత విజ్ఞత, వివేకం దాగున్నాయో, ఆయన ప్రకటనకు దేశవ్యాప్తంగా లభించిన మద్దతు తెలియజేస్తుంది.  రిజర్వ్ బ్యాంకు మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్, ఇన్ఫోసిస్ నారాయణమూర్తి కూడా జగన్ అభిప్రాయాలను బలపరుస్తూ ప్రకటనలు చేసారు.  దీన్నిబట్టి జగన్ ఏ విషయాన్నైనా ఎంత లోతుగా అధ్యయనం చేస్తారో,  ఒక నిర్ణయాన్ని తీసుకోవడానికి ఎంతటి కసరత్తు చేస్తారో లోకానికి స్పష్టం అయింది.  జగన్ నిర్ణయాలను తొలుత అవహేళన చేసిన చంద్రబాబు, ఆయన తోకమీడియా సిగ్గుతో తలలు వంచుకునేట్లుగా జగన్ తన రాజకీయపరిణీతిని ప్రదర్శించారు.
 
అయితే, ఎన్ని ఎదురుదెబ్బలు ఎదురైనా, ఎంతమంది ఛీ కొట్టినా, చంద్రబాబు బుద్ధి మారుతుందనుకోవడం పొరపాటు.  అధికారం కోల్పోవడంతో మనస్థిమితం కోల్పోయిన చంద్రబాబు తన కుట్రలను కుహకాలను ఇంకా కొనసాగిస్తారు అనడంలో సందేహం అవసరం లేదు.  జగన్ మరింత అప్రమత్తంగా ఉండాలి.  ప్రజలంతా జగన్ వెంటే ఉన్నారు.  
 
 
ఇలపావులూరి మురళీ మోహన రావు 
సీనియర్ రాజకీయ విశ్లేషకులు