2003 లో కాంగ్రెస్ పార్టీ చరిత్రలో తొలిసారిగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ రాజశేఖర రెడ్డి సుదీర్ఘ పాదయాత్రను నిర్వహించారు. ఆ పాదయాత్ర చంద్రబాబు పాలిటి మరణశాసనంగా పరిణమించింది. పాదయాత్రలో భాగంగా రాజమండ్రి ప్రాంతం దగ్గరకి వచ్చేసరికి వైఎస్ వడదెబ్బతో అస్వస్థులు అయ్యారు. అక్కడే ఒక షామియానా వేసి రెండు మూడు కూలర్లు ఏర్పాటు చేశారు. ఆయన చాలా నిస్సత్తువగా ఒక్క అడుగు కూడా ముందుకు వెయ్యలేని స్థితికి చేరుకున్నారు.
ఆ సమయంలో కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఒడిశాకో లేక మరెక్కడికో వెళ్తూ హైదరాబాద్ లో ఆగారు. కొంతమంది రాష్ట్ర నాయకులు ఆమెకు విమానాశ్రయంలో స్వాగతం పలికి వైఎస్ చేస్తున్న పాదయాత్రను వివరించి ఆయనకు వడదెబ్బ కొట్టి విశ్రాంతి తీసుకుంటున్నారని, ఒకసారి రాజమండ్రి వెళ్లి ఆయన్ను పరామర్శిస్తే బాగుంటుందని కోరారు. అయితే వైఎస్ పాదయాత్ర పట్ల మొదటినుంచి అసహనంగా ఉన్న సోనియాగాంధీ అందుకు తిరస్కరించారు. వైఎస్ బలమైన నాయకుడుగా రూపొందటం ఆమెకు సుతరామూ ఇష్టం లేదు. పాదయాత్ర గూర్చి చులకనగా మాట్లాడటమే కాక రాష్ట్ర నాయకుల కోరికను ఏమాత్రం ఖాతరు చెయ్యకుండా వెళ్లిపోయారు.
అయితే వైఎస్సార్ మాత్రం పాతికేళ్ళనుంచి కాంగ్రెస్ పార్టీని నమ్ముకుని ఉన్నాము. కాంగ్రెస్ పార్టీనుంచి గెలిచాము. మనకు అనేక పదవులు ఇచ్చింది. ఈ కష్ట సమయంలో పార్టీని వదిలివెళ్లడం న్యాయం కాదు. మనం కష్టపడి పనిచేద్దాం. పార్టీని అధికారంలోకి తీసుకొద్దాం. ముఖ్యమంత్రి పోస్ట్ ఇస్తే ఇస్తారు లేకపోతె లేదు” అంటూ వారి ప్రతిపాదనను నిర్ద్వంద్వముగా త్రోసిపుచ్చారు! అదీ వైఎస్ విశ్వసనీయతకు నిదర్శనం. విశ్వసనీయత, విలువలకు పంచె కడితే అది రాజశేఖర రెడ్డి అవుతుంది!
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చరిత్రలో సంక్షేమపథకాలు చిత్తశుద్ధితో శ్రీకారం చుట్టింది తొలిసారిగా ఎన్టీఆర్ కావచ్చు. కానీ, ఆయన సంక్షేమపథకాలతో ఆంధ్రప్రదేశ్ ఆర్ధికంగా అనేక నష్టాలను చూసింది. కానీ, భారీ స్థాయిలో సంక్షేమ పధకాలను అమలుచేసి కూడా రాష్ట్రాన్ని నిండైన ఖజానాతో వదిలిన ఏకైక నాయకశిరోమణి స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి.
చంద్రబాబు దోపిడీపాలనతో రాష్ట్రం దివాళాతీసింది. ఉద్యోగులకు కనీసం జీతాలు ఇవ్వగలరా అనే సందేహం ఉండేది అప్పట్లో. ఏం మాయ జరిగిందో తెలియదు. నెలకు మూడు వానలతో పాటు సంక్షేమ పధకాల వర్షం రాష్ట్రం మొత్తాన్ని కుమ్మేసింది. 108, ఆరోగ్యశ్రీ, ఫీజ్ రీయింబర్స్మెంట్, పావలా వడ్డీకి రుణాలు…ఇలాంటి సంక్షేమపథకాలతో పాటు జలయజ్ఞం, సెజ్ ల నిర్మాణాలు, ఐటి పరిశ్రమలు, విమానాశ్రయాలు, ఎక్ష్ప్రెస్స్ హైవేలు, ఫ్లయ్ ఓవర్లు, ఔటర్ రింగ్ రోడ్, ఆసుపత్రుల నిర్మాణాలు, జిల్లాకో యూనివర్సిటీ, వేద విశ్వవిద్యాలయం..అబ్బా…ఒకటా రెండా? వందలకొద్దీ అభివృద్ధి కార్యక్రమాలతో రాష్ట్రం శివతాండవం చేసింది. వైఎస్ కు ఆర్దికమంత్రిగా వనరులను సమకూర్చిన అభినవ యుగంధరుడు శ్రీ కొణిజేటి రోశయ్యగారిని కూడా ఈ క్షణంలో స్మరించుకోవాలి.
వైఎస్ ఒకే ఒక మగాడు..
ఒకే సంతకంతో రైతుల విద్యుత్ బకాయిలు మాఫీ చేసిన సాహసుడు వైఎస్సార్.
కేంద్ర ప్రభుత్వం గ్యాస్ ధరను యాభై రూపాయలు పెంచితే…సోనియాగాంధీకి కోపం వస్తుందేమో అన్న వెరపు కూడా లేకుండా, ఆ భారాన్ని తానె మోస్తానని ప్రకటించిన దమ్మున్న నాయకుడు వైఎస్ తప్ప ఇంతవరకు మరెవరు లేరు..ఇక ముందు పుట్టబోరు. అలాగే పోటీ చెయ్యబోయే ఎమ్మెల్యే అభ్యర్థుల జాబితాను స్వయంగా రూపొందించి అధిష్టానాన్ని ఏమాత్రం లెక్క చెయ్యని కాంగ్రెస్ ముఖ్యమంత్రి ఆ పార్టీ చరిత్రలో వైఎస్ తప్ప మరెవరూ లేరు.
అయిదు ఏళ్ళు పాలించినా ఒక్కసారి కూడా రవాణా చార్జీలు, విద్యుత్ చార్జీలు నయాపైసా కూడా పెంచని మీసమున్న మగాడు వైఎస్సార్.
ఎన్నికల మానిఫెస్టోలో ఇచ్చిన వాగ్దానాలు అన్నీ అమలు చేసాము… ఇంకా ఏమి చెయ్యాలో చెప్పండి అని అసెంబ్లీలో ప్రతిపక్షాలకు తొడగొట్టి సవాలు విసిరిన అసలు సిసలైన మొనగాడు వైఎస్సార్..
రాష్ట్ర చరిత్రలో తొలిసారిగా అర్చకులకు భారీ ఎత్తున వేతనాలు పెంచడమే కాకుండా, నిత్యధూప దీపారాధనలకు నిధులు కేటాయించిన ఏకైక మగాడు వైఎస్సార్..
శంకుస్థాపనలు చెయ్యడం తప్ప ప్రారంభోత్సవాలు చెయ్యడం ఎరుగని ఏకైక ముఖ్యమంత్రిగా చంద్రబాబు నిలబడితే, శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు రెండూ తన హయాంలో చేసిన ముఖ్యమంత్రి వైఎస్సార్..
మాట ఇస్తే తప్పడం అనేది జీవితంలో ఎరుగని మగాడు వైఎస్సార్.
వైఎస్సార్ మరణం పంచభూతాల నడుమ సంభవించింది. కానీ, నాకు అనుమానమే..అది కావాలని చేసిన ప్రమాదం అని, హత్యాయత్నం అని… నిజానిజాలు లోతైన దర్యాప్తు చేస్తే కానీ తెలియదు.
వైఎస్ ప్రాతఃస్మరణీయుడు..ఆయన కీర్తి అజరామరం.సూర్యచంద్రాదులు గగనమార్గాన చరిస్తున్నంతకాలం వైయస్ ప్రజల హృదయాల్లో నిలిచి ఉంటాడు. అలాంటి మహనీయుడిని కాంగ్రెస్ పార్టీ ఘోరంగా అవమానించింది. మరణించిన తరువాత ఆయన పేరును సిబిఐ ఛార్జ్ షీట్లో చేర్చింది. అయన కొడుకును, కుటుంబాన్ని రోడ్డున పడేసింది. కేసులు పెట్టి వేధించింది. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని కేంద్రంలో, రాష్ట్రంలో నిర్నిరోధంగా నడిపిన ఇద్దరు తెలుగు వారు పీవీ నరసింహారావు, వైఎస్ రాజశేఖర రెడ్డిలను కాంగ్రెస్ తీవ్రంగా పరాభవించి ప్రజాగ్రహానికి గురైంది.
ఆ మహానేత జన్మదిన సందర్భంగా ఆయనకు నివాళులు.
ఇలపావులూరి మురళీ మోహన రావు
సీనియర్ రాజకీయ విశ్లేషకులు