అప్పుడెప్పుడో జరిగిన వ్యవహారాలు అవి. ఎన్టీయార్ – కృష్ణ మధ్య సినిమాల పరంగా గట్టి పోటీ వుండేది. ఎన్టీయార్ రాజకీయాల్లోకి వచ్చాక, ఆ ఎన్టీయార్ మీద ‘మండలాధీశుడు’ లాంటి సినిమాల్ని కృష్ణ చేశారు. అంతే కాదు, కొన్ని సినిమాల్లో ఎన్టీయార్ మీద రాజకీయ సెటైర్లు వేశారు. అవీ చాలా ఘాటుగా. ఆ వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వంగవీటి రంగా హత్య వ్యవహారం దగ్గర్నుంచి చాలా అంశాల్లో ఎన్టీయార్‌ని అప్పట్లో తన సినిమాల ద్వారా రాజకీయంగా టార్గెట్ చేశారు కృష్ణ. ఆ విషయాల్ని ప్రస్తుతం వైసీపీ మద్దతుదారులు కొందరు సోషల్ మీడియాలో ప్రస్తావిస్తున్నారు.
సూపర్ స్టార్ కృష్ణ కాంగ్రెస్ మనిషి. ఆ తర్వాత ఆయన, వైఎస్ రాజశేఖర్ రెడ్డికి అత్యంత సన్నిహితుడిగా మారారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి గురించి గొప్పగా కృష్ణ చెప్పిన మాటలు, ఎన్టీయార్ మీద సినిమాల్లో కృష్ణ పేల్చిన డైలాగులు.. వీటిని వైసీపీ మద్దతుదారులైన నెటిజన్లు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. దాంతో, సోషల్ మీడియాలో రచ్చ పీక్స్‌కి వెళ్ళిపోతోంది. టీడీపీ సానుభూతిపరులు కృష్ణ మీద అభ్యంతకరమైన వ్యాఖ్యలు చేస్తున్నారు. దాన్ని మహేస్ అభిమానులు తీవ్రంగా పరిగణిస్తున్నారు, టీడీపీ మీద మండిపడుతున్నారు.
కాదేదీ వివాదానికి అనర్హం.. అన్న చందాన, సోషల్ మీడియాలో ఇప్పుడీ వ్యవహారం హాట్ టాపిక్ అయ్యింది. ఓ వైపు కృష్ణ మృతి పట్ల తెలుగు నేలపై విషాద ఛాయలు నెలకొంటే, ఇంకోపక్క ఆయన్ని వివాదాల్లోకి లాగుతున్నారు. కృష్ణ ఆ తర్వాతి కాలంలో.. ఎన్టీయార్‌తో సన్నిహిత సంబంధాలే నడిపారు. తమ మధ్య వృత్తిపరమైన పోటీ తప్ప, వైరం ఏనాడూ లేదని కృష్ణ పలు సందర్భాల్లో చెప్పారు.