Honeymoon Murder: హనీమూన్ హత్యాలో దుర్మార్గం.. వెలుగులోకి మరిన్ని షాకింగ్ విషయాలు!

ఇండోర్‌కు చెందిన రాజా రఘువంశీ హనీమూన్‌కి వెళ్లిన ఆతర్వాత జరిగిన మృత్యుదృశ్యం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. మేఘాలయలోని జలపాతానికి సమీపంలో మృతదేహంగా కనిపించిన రాజా.. తన సతీమణి చేతిలోనే ప్రాణాలు కోల్పోయాడా? అనే ప్రశ్నలు ఇప్పుడు దర్యాప్తు అధికారుల ముందున్నాయి. మే 20న భార్య సోనమ్‌తో కలిసి మేఘాలయ వెళ్ళిన రాజా.. మే 22న ద్విచక్ర వాహనంతో ప్రయాణం అనంతరం కనిపించకపోవడం, ఆ తరువాత జూన్ మొదటి వారంలో మృతదేహంగా కనిపించడం ఘటనను మరింత హృదయ విదారకంగా మార్చింది.

పోస్టుమార్టం నివేదిక ప్రకారం రాజా తలపై రెండు లోతైన గాయాలు ఉన్నట్లు స్పష్టమవ్వగా, వీటి వల్లే అతను తీవ్ర రక్తస్రావంతో మృతి చెందినట్లు వైద్యులు తేల్చారు. దీనితో పాటు కేసులో కీలక మలుపుగా సోనమ్‌పై ఆరోపణలు ముదిరాయి. ఆమెకి రాజ్ కుష్వాహ్ అనే వ్యక్తితో సంబంధం ఉందని, అతడి సహాయంతోనే భర్తను హత్య చేయించిందని మేఘాలయ పోలీసులు ఆరోపిస్తున్నారు. కుష్వాహ్‌తో పాటు ముగ్గురు సుపారీ కిల్లర్లను అదుపులోకి తీసుకున్నట్లు డీజీపీ వెల్లడించారు.

గత వారం రోజులుగా మిస్సింగ్‌గా ఉన్న సోనమ్.. అకస్మాత్తుగా ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాపూర్‌లో లొంగిపోవడంతో ఈ కేసు మరింత ఊహించని మలుపు తిరిగింది. పోలీసుల అనుమానాలకు బలం చేకూర్చేలా ఆమె ముందస్తు ప్రణాళికల్లో ఉన్నట్లు ఆడియో, డిజిటల్ ఆధారాలు ఉన్నాయని వార్తలు వస్తున్నాయి. అయితే ఈ ఆరోపణలను సోనమ్ తండ్రి ఖండించారు. తన కుమార్తె అమాయకురాలని, ఆమెపై తప్పుదోవ పట్టించేలా ఆరోపణలు మోపారని అన్నారు.

ఇప్పుడు ఈ కేసు పోలీసుల కంటే రాజకీయ వర్గాల దృష్టినీ ఆకర్షిస్తోంది. సోనమ్ తండ్రి స్వయంగా సీబీఐ దర్యాప్తు కోరుతూ కేంద్ర హోం శాఖను ఆశ్రయించనున్నట్లు ప్రకటించడంతో, ఈ హత్య వెనుక నిజంగా ఏం జరిగింది అన్నదానిపై దేశవ్యాప్తంగా ఆసక్తి పెరుగుతోంది. ప్రస్తుతం పోలీసుల దర్యాప్తు, సాంకేతిక ఆధారాలపై ఆధారపడి విచారణ కొనసాగుతోంది.

హనీమూన్ జంట మిస్టరీ || Social Activist Krishna Kumari Reacts On Indore Honeymoon Couple Case || TR