Minister Anitha: ప్రతిపక్ష హోదాపై హోం మంత్రి అనిత సంచలన వ్యాఖ్యలు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హోంమంత్రి అనిత వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి మరియు ఆ పార్టీపై తీవ్ర విమర్శలు చేశారు. వైసీపీ ఎమ్మెల్యేలు రాజీనామా చేసినా రాష్ట్రానికి, ప్రభుత్వానికి ఎలాంటి నష్టం లేదని ఆమె స్పష్టం చేశారు. ప్రతిపక్ష హోదా కావాలని జగన్ చిన్నపిల్లాడిలా మారాం చేస్తున్నారని, అది చాక్లెట్ లేదా బిస్కెట్ కాదని ఆమె ఎద్దేవా చేశారు.

హోంమంత్రి అనిత మాట్లాడుతూ, ప్రతిపక్ష హోదాను స్పీకర్ ఇచ్చేది కాదని, ప్రజలు ఇవ్వాలని గుర్తుచేశారు. ఈ ఎన్నికల్లో వైసీపీకి ప్రతిపక్ష హోదాకు కావాల్సినన్ని సీట్లు రాలేదని, అందువల్ల జగన్మోహన్ రెడ్డి పులివెందుల ఎమ్మెల్యేగా అసెంబ్లీకి రావాలని ఆమె డిమాండ్ చేశారు.

“అసెంబ్లీకి వెళ్లి ‘అధ్యక్షా’ అని పిలవాలనే కల అందరికీ ఉంటుంది. కానీ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి పుణ్యమా అని ఆ కల నెరవేరకుండా వైసీపీ ఎమ్మెల్యేలకు దురదృష్టం వెంటాడుతోంది. ప్రజా సమస్యలు చర్చించడానికి అసెంబ్లీ ఒక మంచి వేదిక. అలాంటి అవకాశాన్ని జగన్ తన ఎమ్మెల్యేలకు ఇవ్వకపోవడం దురదృష్టకరం” అని అనిత వ్యాఖ్యానించారు.

గత వైసీపీ ప్రభుత్వంలో అసెంబ్లీలో చంద్రబాబును అవమానిస్తే, ఆయన వాకౌట్ చేసి వెళ్లిపోయారని, అయితే టీడీపీ ఎమ్మెల్యేలను అసెంబ్లీకి వెళ్లొద్దని చంద్రబాబు చెప్పలేదని అనిత గుర్తుచేశారు. అప్పటి టీడీపీ ఎమ్మెల్యేలు ప్రజల తరపున అసెంబ్లీలో పోరాటం చేశారని ఆమె ధీమా వ్యక్తం చేశారు.

జగన్ అసెంబ్లీకి రాకపోతే మిగిలిన వైసీపీ ఎమ్మెల్యేలను అయినా అసెంబ్లీకి పంపాలని హోంమంత్రి అనిత డిమాండ్ చేశారు. “జగన్ రాకపోతే అసెంబ్లీ ఆగదు. 11 మంది వైసీపీ ఎమ్మెల్యేలు రాజీనామా చేసి వెళ్తే నష్టమేమీ లేదు” అని ఆమె కీలక వ్యాఖ్యలు చేశారు.

లిక్కర్ స్కామ్‌పై విచారణ జరుగుతోందని, విచారణ పూర్తయిన తర్వాత దానిపై మాట్లాడుతామని అనిత స్పష్టం చేశారు.

Kavitha Aggressive Comments After Resignation | Harish Rao | Telugu Rajyam