Helmet: హెల్మెట్ పెట్టుకుంటే.. బట్టతల వస్తుందా.. దీనిలో నిజమెంత..?

వాహనదారుల కోసం హెల్మెట్‌ అనేది రక్షణ కవచంలా మాత్రమే కాదు.. ఇది కచ్చితంగా నిలుస్తుంది. ఇక ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తే హెల్మెట్‌ తప్పనిసరి. కానీ కొంతమంది ‘హెల్మెట్‌ పెట్టుకుంటే జుట్టు రాలిపోతుంది..’ అనే భయంతో చాలా మంది దానిని వాడరు. నిజానికి హెల్మెట్‌ పెట్టుకుంటే జుట్టు రాలిపోతుందా.. లేదా అసలు సమస్య ఏంటి.. అనే క్వశ్చన్స్‌కి డాక్టర్లు స్పష్టమైన సమాధానం ఇస్తున్నారు.

చర్మ వ్యాధుల నిపుణులు చెబుతున్నట్టు, హెల్మెట్‌ సరిగ్గా ఉపయోగించకపోతేనే సమస్య. హెల్మెట్‌ నేరుగా జుట్టు రాలడానికి కారణం కాదు. కానీ మురికిగా ఉంటే, బిగుతుగా ఉంటే.. నెత్తిమీద చెమట, బ్యాక్టీరియా పెరుగుతాయి. ఇవి చుండ్రు, ఇన్ఫెక్షన్‌లు తెచ్చిపెట్టుతాయి. చివరికి జుట్టు కుదుళ్లు బలహీనపడి జుట్టు రాలుతుంది. ముఖ్యంగా మురికిగా ఉన్న హెల్మెట్‌ చాలా ప్రమాదం. చెమటతో తడిసి, దుమ్ముతో నిండిపోతే అది బ్యాక్టీరియాకు కారణం అవుతుంది. ఆ బ్యాక్టీరియా నెత్తిపై చుండ్రు పెంచుతుంది. క్రమంగా జుట్టు తక్కువవుతుంది. అంతేకాదు, చాలామంది బిగుతుగా ఉండే హెల్మెట్‌ వేసుకుంటారు. అది నెత్తిమీద ఎక్కువ ఒత్తిడి పెడుతుంది. దీని వల్ల కూడా కుదుళ్లు బలహీనమవుతాయి.

జుట్టును ఎలా కాపాడుకోవాలి: హెల్మెట్‌ సమస్యలు లేకుండా జుట్టును కాపాడుకోవాలంటే కొన్ని చిన్న జాగ్రత్తలు పాటించాలని నిపుణులు చెబుతున్నారు. ముందుగా హెల్మెట్‌ తరచూ శుభ్రం చేసుకోవాలి.. తల చుట్టూ సాఫీగా స్కార్ఫ్‌ కట్టుకుని హెల్మెట్‌ పెట్టుకోవచ్చు. తడి జుట్టుతో హెల్మెట్‌ పెట్టుకోకూడదు. తడి జుట్టు తొందరగా దెబ్బతింటుంది. జుట్టుకు నూనె రాయడం, తరచూ తల స్నానం చేయడం తప్పనిసరి. ఎల్లప్పుడూ తలకు కంఫర్ట్‌గా సెట్‌ అయ్యే సైజ్‌ హెల్మెట్‌నే పెట్టుకోవాలి. ఎవరూ ఇతరుల హెల్మెట్‌ వాడకూడదు. వాడితే ఇన్ఫెక్షన్‌లు పుడతాయి.

సరైన జాగ్రత్తలు పాటిస్తే హెల్మెట్‌ వల్ల జుట్టుకు ఏ సమస్యలూ ఉండవు. ప్రాణభద్రతకు ప్రాధాన్యం ఇవ్వాలి. ‘‘జుట్టు రాలిపోతుంది’’ అనే అపోహల్లో పడిపోకుండా, తప్పకుండా హెల్మెట్‌ ధరించాలి. రోడ్డుపై మీరు సేఫ్‌గానూ ఉండాలి, మీ జుట్టు కూడా హెల్తీగానే ఉండాలి.