Heart Stroke : మొన్న పునీత్ రాజ్ కుమార్.. ఇప్పుడు ఏపీ మంత్రి గౌతమ్ రెడ్డి.! ఫిట్‌గా వున్నా గుండెపోటు కారణంగా ఎందుకు ఈ ఇద్దరూ చనిపోవాల్సి వచ్చిందన్న చర్చ సర్వత్రా జరుగుతోంది. చాలామందిని వేధిస్తోన్న అంశమిది. పునీత్ రాజ్ కుమార్ అయినా, గౌతమ్ రెడ్డి అయినా.. ఫిట్‌నెస్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. సినీ నటుడు గనుక పునీత్ రాజ్‌కుమార్‌కి రెగ్యులర్ హెల్త్ చెకప్స్ వుంటాయి. గౌతమ్ రెడ్డి విషయంలో అయినా అంతే.
నాలుగు పదుల వయసు దాటాక ఖచ్చితంగా ఎప్పటికప్పుడు గుండెకు సంబంధించి వైద్య పరీక్షలు చేయించుకోవాల్సిందేనని వైద్యులు చెబుతుంటారు. అలాగని, 40 ఏళ్ళ లోపు వయసు వారికి అవసరం లేదని కాదు.
క్రికెట్ మైదానంలో బౌలింగ్ చేస్తూ లేదా బ్యాటింగ్ చేస్తూ కుప్ప కూలిపోయిన యువకుల గురించిన వార్తల్ని చూస్తుంటాం. పెళ్ళి పందిట్లో వరుడు లేదా వధువు హఠాన్మరణం చెందడం గురించిన వార్తలు చూస్తుంటాం.
గుండె పోటుకి వయసుతో సంబంధం లేదు.. ఫిట్‌గా వున్నాసరే గుండెపోటు రావొచ్చు. ఫిట్‌గా వుండడం వల్ల గుండె పోటు వచ్చే అవకాశం కాస్త తక్కువ.. అంతే.! వైద్య పరీక్షల్లో అన్నీ నార్మల్ అని తేలినా కూడా గుండెపోటు వచ్చే అవకాశాలుంటాయని వైద్య నిపుణులు చెబుతుంటారు.
మానవ శరీరం అత్యంత సంక్లిష్టమైనది. గుండె సహా కీలక అవయవాలన్నీ అత్యంత సున్నితమైనవి. అకస్మాత్తుగా పుట్టుకొచ్చే సమస్యలు ప్రాణాపాయన్ని తీసుకొస్తాయ్. గౌతమ్ రెడ్డి విషయంలో కూడా అదే జరిగిందా.? లేదంటే, ప్రచారంలో వున్నట్టు కేవలం పోస్ట్ కోవిడ్ సమస్యలతోనే ఆయనకు గుండెపోటు వచ్చిందా.?