హిందువుల ప్రతి ఇంట్లో పండగలు, నవరాత్రి సమయంలో.. అగరబత్తి సువాసన లేకుండా పూజలు జరగడం దాదాపు అసాధ్యం. కానీ ఈ చిన్న, పవిత్రమైన పొగ మన ఆరోగ్యానికి ఎంతగానో హాని కలిగించగలదని వైద్యులు హెచ్చరిస్తున్నారు. నిపుణుచెబుతున్న వివరాల ప్రకారం.. ఒక అగరబత్తి ధూమపానం సిగరెట్ పొగ తాగడం లాంటిదని చెబుతున్నారు. అగరబత్తి పొగలో PM2.5, కార్బన్ మోనాక్సైడ్, ఇతర హానికర వాయువులు విడుదల అవుతాయి.. ఇవి ఇంటి గాలి నాణ్యతను తగ్గించడంతో ఊపిరితిత్తులపై తీవ్రంగా ప్రభావం చూపిస్తాయని చెబుతున్నారు.
ఇంటి లోపలి వాతావరణం చిన్న పిల్లలు, వృద్ధులు, ఆస్తమా, COPD వంటి శ్వాసకోశ సమస్యలున్నవారికి మరింత ప్రమాదకరం. కొద్దిపాటి పొగ కూడా అలెర్జీ, దగ్గు, దీర్ఘకాలిక ఊపిరితిత్తుల సమస్యలకు కారణమవుతుంది. పరిశోధనల ప్రకారం, రోజువారీగా ఎక్కువ సమయం అగరబత్తి పొగంలో ఉండటం బ్రోన్కైటిస్, ఆస్తమా, COPD, ఊపిరితిత్తుల క్యాన్సర్ వంటి సమస్యల ప్రమాదాన్ని పెంచుతుంది, ముఖ్యంగా తక్కువ వెంటిలేషన్ ఉన్న గదుల్లో ఇది మరింత ప్రమాదకరం. అంటే పూజా మందిరంలో కూడా ఇది ప్రమాదకరమే అంటున్నారు నిపుణులు.
అలా అని పూజా సమయంలో అగరబత్తిని పూర్తిగా వదిలివేయాల్సిన అవసరం లేదని నిపుణులు అంటున్నారు. గది గాలి బాగా ప్రవహించేలా కిటికీలు తెరిచి, ఫ్యాన్ లేదా ఎక్స్‌హాస్ట్ ఫ్యాన్ వాడటం, క్రాస్ వెంటిలేషన్ కలిగిన గదుల్లో మాత్రమే వాడటం, ఎసెన్షియల్ ఆయిల్ డిఫ్యూజర్లు, ఎలక్ట్రిక్ దీపాలు, సహజ సూర్యకాంతి వంటి సురక్షిత ప్రత్యామ్నాయాలను వాడటం ద్వారా హానికర ప్రభావాలను గణనీయంగా తగ్గించవచ్చు. అలాగే, దగ్గు, ఊపిరితిత్తులు వేగంగా ఆడకపోవడం వంటి లక్షణాలను గమనించి, అవసరమైతే వెంటనే వైద్యుడిని సంప్రదించడం అత్యంత అవసరం అంటున్నారు.
చిన్న మార్పులు కూడా భక్తి, సువాసన, ఆరోగ్యం మూడిటినీ కాపాడుతాయని నిపుణులు చెబుతున్నారు. ప్రతి ఇంట్లో పండుగల సీజన్‌లో వెంటిలేషన్, సురక్షిత ప్రత్యామ్నాయాల వినియోగం తప్పనిసరి.. ఇలా చిన్న జాగ్రత్తలు తీసుకుంటే, అగరబత్తి వాడకంలో ఉన్న ఆనందాన్ని కోల్పోకుండా, దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలను నివారించవచ్చు.ఈ జాగ్రత్తలతో మన పూజలు సువాసనతో పూర్ణంగా కొనసాగుతూ, ఆరోగ్యంపై హానికర ప్రభావాలు తప్పించవచ్చు. (గమనిక: ఈ కథనం ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రాసినది. దీనిని తెలుగు రాజ్యం ధృవీకరించడం లేదు.)
