గత గ్రేటర్ హైద్రాబాద్ ఎన్నికల సమయంలో ఆంధ్రప్రదేశ్‌కి చెందిన పలువురు టీడీపీ నేతలు హల్‌చల్ చేశారు ప్రచార పర్వం పరంగా. ఇప్పుడు అలాంటి జాతర ఎక్కడా కనిపించడంలేదు. తెలుగుదేశం పార్టీ గ్రేటర్ ఎన్నికల్లో పోటీ చేస్తోందా.? లేదా.? అన్న అనుమానం చాలామందికి కలుగుతోంది. ఒకప్పుడు హైద్రాబాద్‌లో టీడీపీ పరిస్థితి వేరు.. ఇప్పుడు టీడీపీ పరిస్థితి వేరు. చంద్రబాబుగానీ, నారా లోకేష్‌గానీ, గ్రేటర్ హైద్రాబాద్ ఎన్నికల వైపు అస్సలు చూడట్లేదు.
అప్పుడు అలా.. ఇప్పుడేమో ఇలా..
టీడీపీకి క్యాడర్ పరంగా కొంత బలం వుంది. అయితే, గతంలో వున్నంత యాక్టివ్‌గా లేదిప్పుడు ఆ క్యాడర్. లోపల టీడీపీ మీద అభిమానం వున్నా, మారిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో టీడీపీ క్యాడర్.. అటూ ఇటూ వెళ్లిపోయింది. కొంత టీఆర్‌ఎస్ వైపు, కొంత కాంగ్రెస్ వైపు, మరికొంత బీజేపీ వైపు వెళ్ళిపోవడంతో.. గ్రేటర్ హైద్రాబాద్ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థులకు ప్రచారం పరంగా ‘లోటు’ స్పష్టంగా కనిపిస్తోంది.
టీఆర్‌ఎస్ వైపుకే తెలుగు తమ్ముళ్ళ మొగ్గు
ఎవరు ఔనన్నా ఎవరు కాదన్నా తెలుగు తమ్ముళ్ళు దాదాపుగా టీఆర్‌ఎస్ దారిలోకి వెళ్ళిపోయారు. రేవంత్ రెడ్డి మీద అభిమానంతో కొందరు మాత్రం కాంగ్రెస్ వైపు చూస్తున్నారు. బీజేపీ కూడా కొంత మేర టీడీపీ ఓటు బ్యాంకుని తనవైపుకు తిప్పుకోగలిగింది. టీడీపీ గనుక, తెలంగాణలో గెలుపోటములకతీతంగా గట్టిగా నిలబడి వుంటే, ఆ క్యాడర్ టీడీపీతోనే వుండి వుండేది. సెటిలర్లలోనూ టీడీపీ మద్దతుదారులు చాలామంది టీఆర్‌ఎస్‌కి కమిట్ అయిపోయారు.
సినీ గ్లామర్ బొత్తిగా లేకుండా పోయింది
ఒకప్పుడు టీడీపీ అంటే, సినీ తారల సందడి ఎక్కువగా కనిపించేది. ఇప్పుడు ఒక్కరంటే ఒక్క సినీ ప్రముఖుడు కూడా టీడీపీ తరఫున మాట్లాడలేని పరిస్థితి. అసలు పార్టీ అధినేతే లైట్ తీసుకున్నాక, ఎవరు మాత్రం టీడీపీని తెలంగాణలో కాపాడగలరు.?