170 ఏళ్ల చరిత్రలో మహా విషాదాలివే!

ఒడిశాలోని బాలేశ్వర్‌ జిల్లాలో మూడు రైళ్లు ఒకదానినొకటి ఢీకొన్న ఘటన యావత్‌ దేశాన్ని తీవ్రంగా కలచివేసింది. భారత రైల్వే చరిత్రలోనే దీన్ని అతిపెద్ద ప్రమాదాల్లో ఒకటిగా చెబుతున్నారు. అయితే… ఈ దుర్ఘటన ఎలా జరిగిందన్న దానిపై ఇప్పటివరకు కచ్చితమైన కారణాలు తెలియరాలేదు. అయితే, సిగ్నల్‌ లోపం కారణంగా కోరమాండల్‌ ఎక్స్‌ప్రెస్‌ లో ఈ పెను విషాదం సంభవించినట్లు రైల్వే శాఖ ప్రాథమిక దర్యాప్తులో తేలింది. ఈ నేపథ్యంలో… గతంలో రైల్వే చరిత్రలో జరిగిన మహా విషాదాలను ఒకసారి చూద్దాం…!

దేశ చరిత్రలోనే అతి పెద్ద రైలు ప్రమాదం జూన్ 6, 1981న బీహార్‌ లో జరిగింది. రైలు ప్రమాద వార్తలు తెరపైకి వస్తే ఇప్పటికీ బీహార్ ప్రజలను ఉలిక్కిపడేలా చేసే దుర్ఘటన ఇది. తుపాను సమయంలో బాగ్‌ మతి నది బ్రిడ్జ్‌ దాగుతుండగా బోగీలు నదిలో పడిపోవడంతో ఈ ప్రమాధం జరిగింది. ఈ ఘటనలో సుమారు ఏడు నుంచి 800 మంది మరణించి ఉండొచ్చని అంచనా.

బీహార్ దుర్ఘటన అనంతరం ఆగస్ట్ 20, 1995న ఫిరోజాబాద్ సమీపంలో పురుషోత్తం ఎక్స్‌ ప్రెస్ ఆగి ఉన్న కాళింది ఎక్స్‌ ప్రెస్‌ ని ఢీకొట్టింది. ఆ ఘటనలో దాదాపు 358 మంది నిద్రలోనే ప్రాణాలు కోల్పోయారు. దీన్ని దేశ చరిత్రలో రెండవ అత్యంత ఘోరమైన రైలు ప్రమాదంగా భారతీయ రైల్వేస్‌ పరిగణించింది. అయితే ఈ దుర్ఘటనలో మృతుల సంఖ్య 400 దాకా ఉండొచ్చనేది అంచనా.

అనంతరం ఆగస్ట్ 2, 1999న నార్త్ ఫ్రాంటియర్ రైల్వేకతిహార్ డివిజన్‌ లోని గైసల్ స్టేషన్‌ లో మరో రైలు ప్రమాదం జరిగింది. బహ్మపుత్ర మెయిల్‌, అవధ్‌ ఎక్స్‌ ప్రెస్‌ ఎదురెదురుగా వచ్చి ఢీ కొనడంతో ఈ ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో సుమారు 285 మందికి పైగా మరణించగా 300 మందికి పైగా గాయప్డడారు. దీన్ని మొన్నటివరకూ దేశ చరిత్రలో మూడో భారీ ప్రమాదంగా చెబుతుంటారు.

అయితే… తాజాగా ఒడిశాలో జరిగిన కోరమండల్ ఎక్స్ ప్రెస్ రైల్ దుర్ఘటనలో ఇప్పటికే మూడువందల మంది మరణించగా… సుమారు 1000 మందికి పైగా మృతి చెందినట్లు తెలుస్తుంది. దీంతో… ఈ తాజా ఘటన కూడా దేశ చరిత్రలో ఒక మహా విషాదంగా నిలిచిపోబోతుందని తెలుస్తుంది.