మాజీ మంత్రి, టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ఇటీవల తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన విషయం విదితమే. అయితే, ఈ రాజీనామా ఆమోదం పొందుతుందా.? లేదా.? అన్నదానిపై భిన్నాభిప్రాయాలున్నాయి. మెజార్టీ అభిప్రాయం తీసుకుంటే, గంటా శ్రీనివాసరావు రాజీనామాకి ఆమోదం లభించడం దాదాపు అసాధ్యమే. తొలుత చేసిన రాజీనామాపై విమర్శలు రావడంతో, రెండోసారి ఇంకాస్త క్లారిటీతో, తగిన ఫార్మాట్‌లోనే రాజీనామా లేఖను తయారు చేసుకున్నారు గంటా శ్రీనివాసరావు. అయితే, జీవీఎంసీ ఎన్నికల వేళ గంటా రాజీనామాకు ఆమోదం లభించడం కష్టమే. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ గంటా రాజీనామా చేసినప్పటికీ, ఆయన రాజీనామాలోని రాజకీయ కోణం అందరికీ అర్థమయిపోయింది. గత కొంతకాలంగా టీడీపీతో అంటీ ముట్టనట్టు వ్యవహరిస్తోన్న గంటా, గతంలో వైసీపీలోకి వెళ్ళేందుకు ప్రయత్నించి విఫలమయ్యారు.
బీజేపీ కూడా ఆయన్ని అక్కున చేర్చుకోలేదు. చిత్రంగా కాంగ్రెస్ నేతలూ ఆయన్ని తమవైపుకు లాక్కునేందుకు ప్రయత్నించడం గమనార్హం. గంటా ఏం చేసినా, రాజకీయ కోణంలోనే చేస్తారు. ఆయన నిఖార్సయిన రాజకీయ నాయకుడు. పైగా, అధికారం లేకుండా ఆయన వుండలేరు. కానీ, వుండాల్సిన పరిస్థితి వచ్చింది. జనసేన ఆయన్ని ఆహ్వానించడంలేదుగానీ.. ఆయన మనసంతా అటు వైపుకే వెళుతోందట ఈ మధ్య. టీడీపీకి మాత్రం గంటా అస్సలేమాత్రం అందుబాటులో లేరన్నది ఆయన అనుచరులు చెబుతున్న మాట. కాగా, గంటా రాజీనామా ఆమోదం పొందబోదని బీజేపీ నేతలు తేల్చేశారు. తన రాజీనామా ఆమోదం పొందదని తెలిసే ఆయన రాజీనామా చేశారన్నది బీజేపీ నేత విష్ణుకుమార్ రాజు ఉవాచ. వైసీపీ కూడా ఇప్పుడు గంటా రాజీనామా పట్ల అంత ఆసక్తి చూపించే అవకాశం లేదు. ఎందుకంటే, వైసీపీ ఇరకాటంలో పడుతుంది గంటా రాజీనామా ఆమోదం పొందితే. పార్టీ ఫిరాయించిన చాలామందితో రాజీనామా చేయించాల్సి వుంటుంది గనుక.. వైసీపీ అలాంటి రిస్కీ డెసిషన్ తీసుకోకపోవచ్చు.