వినాయక చవితి ఉత్సవాలు దేశ వ్యాప్తంగా ఎక్కడ చూసినా ఉత్సాహంగా, భక్తిశ్రద్ధలతో కొనసాగుతున్నాయి. చిన్నా పెద్దా అందరూ “గణపతి బప్పా మోరియా” అంటూ మారుమోగిస్తున్నారు. ఈ నినాదం వినిపిస్తే భక్తి తరంగం ఎవరినైనా కదిలిస్తుంది. కానీ చాలా మందికి ఈ “మోరియా” అనే పదానికి అర్ధం తెలియదు. అసలు గణనాథుడి పేరు ముందు జతచేసే ఈ పదం సాధారణమైనది కాదు.. దీని వెనుక అద్భుతమైన కథ ఉంది అదేంటో ఈ కథనంలో తెలుసుకుందాం.
చరిత్ర చెబుతున్న ప్రకారం, 15వ శతాబ్దంలో మహారాష్ట్రలో మోరియా గోసావి అనే ఒక గొప్ప గణపతి భక్తుడు జీవించాడు. అతడి జీవితమంతా వినాయక సేవకే అంకితం అయ్యింది. ప్రతిరోజూ పుణె సమీపంలోని చించ్‌వాడి గ్రామం నుంచి మోరేగావ్ వరకూ కాలినడకన వెళ్లి గణపతిని దర్శించుకునేవాడు. వినాయకుడిపై అతనికున్న ప్రేమ అంతులేనిది.
ఒక రోజు మోరియా గోసావికి వినాయకుడు కలలో ప్రత్యక్షమయ్యాడట. సమీపంలోని నదిలో నా విగ్రహం ఉంది, దానిని తీసుకువచ్చి ప్రతిష్టించు అని స్వయంగా గణనాథుడు ఆజ్ఞాపించాడని చెబుతారు. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, గోసావి మరుసటి రోజు ఆ నదికి వెళ్లగా గణపతి విగ్రహం నిజంగానే దొరికింది. అతడు దానిని ప్రతిష్టించి ఆలయాన్ని నిర్మించాడు. ఈ సంఘటనతో ఆయన పేరు దూరదూరాల వరకు వ్యాపించింది.
అప్పటి ప్రజలు మోరియా గోసావి పట్ల అపారమైన గౌరవం పెంచుకున్నారు. వినాయకుడు కలలో ప్రత్యక్షమయ్యేంతటి మహాభక్తుడు ఆయనేనని అందరూ భావించి, ఆయన పాదాల దగ్గర “మోరియా” అంటూ నమస్కరించడం మొదలుపెట్టారు. మోరియాని గణపతి భక్తి ప్రతీకగా భావించినందువల్ల ఆ నినాదం భక్తుల నోటనుండి ఎప్పటికీ ఆగలేదు.
పండితులు చెబుతున్నట్టు, గణపతి ఉత్సవాల్లో “మోరియా” అనే పదం కేవలం ఒక పేరుకాకుండా.. భక్తి బీజాన్ని నింపే పదం. మేమూ మోరియా గోసావిలా వినాయకుడి శరణు పొందాలని కోరుకుంటున్నాం అనే భావనతో భక్తులు గణపతి బప్పా మోరియా అంటూ నినదిస్తారు. కాలం మారినా, ఉత్సవాల రూపం మారినా, ఈ నినాదం మాత్రం శాశ్వతంగా భక్తుల గుండెల్లో నిలిచిపోయింది.
ఈ నినాదంలో గణనాథుడిపై ప్రేమ, ఆయనకు శరణాగతి, మోరియా గోసావి భక్తి ప్రతిబింబం అన్నీ ఉన్నాయి. వినాయక చవితి రోజుల్లో గట్టిగా “గణపతి బప్పా మోరియా” అని నినదించడం అంటే మనమూ ఆ మహాభక్తుని అడుగుజాడల్లో నడుస్తున్నామన్న అర్థం. అందుకే ఈ నినాదం ప్రతి వినాయక ఉత్సవానికీ హృదయాన్ని హత్తుకునే ప్రాణం లాంటిది.
