ఎన్నికలు సమీపిస్తున్న వేళ తెలంగాణ రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. కొత్త కొత్త పార్టీలూ, సరికొత్త పొత్తులు, ఎత్తులతో తెలంగాణలో రాజకీయాలు రోజు రోజుకీ సరికొత్తగా మారిపోతున్నాయి. ఈ సమయంలో… ఎవరి రాజకీయం వారు చెయాలనే ఉద్దేశ్యమో.. లేక, ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీల్చే విషయంలో రెండో కోణమో తెలియదు కానీ… తాను కూడా ఒక పార్టీ పెట్టబోతున్నట్లు ప్రకటించారు ప్రజా గాయకుడు గద్దర్.
తాజాగా కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన “యువ సంఘర్షణ సభ”కు హాజరై.. పాటలు పాడి అలరించిన గద్దర్… ఈ సందర్భంగా ఒక నెలరోజుల్లో తాను కొత్త పార్టీ పెట్టబోతున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు కళాకారులు, జర్నలిస్టులతో మాట్లాడిన అనంతరం తన పార్టీ పేరు వెళ్లడిస్తానని చెప్పుకొచ్చారు. దీంతో… తెలంగాణలో తెరవెనుక, తెరముందు ఏమి జరుగుతుందనే విశ్లేషణలు తెరపైకి వస్తున్నాయి.
ఇప్పటికే తెలంగాణలో ప్రభుత్వ వ్యతిరేక ఓటుకు పోటీ పడుతూ కావాల్సినన్ని పార్టీలున్నాయి. కాంగ్రెస్, బీజేపీ, బీఎస్పీ, వైఎస్సార్టీపీ, టీడీపీ లకు తోడు కొత్తగా తెలంగాణ రైతు సమితి అని మరొక పార్టీ తెరపైకి వచ్చింది. ఇవన్నీ ప్రభుత్వ వ్యతిరేక ఓటుకోసం పోటీపడుతున్నవే. ఇవి చాలవన్నట్లు ఇప్పుడు తాను కూడా ఒక కొత్త పార్టీ పెట్టబోతున్నట్లు ప్రకటించారు గద్దర్. దీంతో… ఈయన పరోక్షంగా కేసీఆర్ కు సపోర్ట్ చేస్తున్నారా అనే విశ్లేషణలు మొదలైపోయాయి.
కేసీఆర్ పై పోటీచేస్తానని చెప్పుకుంటున్న గద్దర్… నిజంగా కేసీఆర్ సర్కార్ ని గద్దె దింపాలనే ఉద్దేశ్యం ఉంటే… ఇప్పుడు కొత్త పార్టీ పెట్టి, రాష్ట్ర వ్యాప్తంగా ప్రతీ నియోజకవర్గంలోనూ ఒక క్యాండిడేట్ ను నిలబెట్టి… ఏమి సాధించాలని భావిస్తున్నారని ప్రశ్నిస్తున్నారు విశ్లేషకులు. ఫలితంగా ఇప్పటికే ప్రభుత్వ వ్యతిరేక ఓటుకోసం బలంగా ప్రయత్నిస్తున్న ఆ నాలుగైదు ప్రధాన పార్టీలకు తోడు.. ఈయన కూడా ఒక చెయ్యి వేయాలని భావిస్తున్నారా అని అడుగుతున్నారు.
నిజంగా కేసీఆర్ సర్కార్ ని గద్దె దింపాలని గద్దర్ భావిస్తే… తన మద్దతు ఉంటుందని చెబుతున్న కాంగ్రెస్ పార్టీ తరుపునో, వైఎస్సార్టీపీ తరుపునో పోటీ చేసి.. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా ఎంతో కొంత ఆపాలి. కానీ… గద్దర్ ఆ దిశగా ఆలోచించకుండా.. ఈ సమయంలో కొత్త కుంపటి పెట్టబోతున్నట్లు చెబుతుండటంపై కామెంట్లు చేస్తున్నారు నెటిజన్లు. ఇప్పటికే ఒకసారి వైఎస్సార్టీపీకి తన పూర్తి మద్దతు ఉంటుందని ప్రకటించిన ఆయన… తాజాగా కాంగ్రెస్ పార్టీకి తన మద్దతు ఉంటుందని తెలిపారు. అలాంటప్పుడు వాటిలో ఏదో ఒక పార్టీని ఎంచుకుని ముందుకువెళ్లకుండా.. కొత్త పార్టీ అనడంపై సర్వత్రా అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి!
అలా కానిపక్షంలో… ఆ రెండు పార్టీలనూ ఏకతాటిపైకి తీసుకొచ్చి.. అప్పుడు ఆయనొక కొత్త పార్టీ పెట్టి.. ఆ రెండు పార్టీలతో పొత్తు పెట్టుకుని పోటీచేయొచ్చు. అప్పుడు ప్రభుత్వ వ్యతిరేక ఓటూ గరిష్టంగా ఈ కూటమికే పడే ఛాన్స్ ఉంటుంది. అలాకానిపక్షంలో… కేసీఆర్ కు గద్దర్ పరోక్షంగా హెల్ప్ చేసినవారే అవుతారు! మరి దీనివెనుక గద్దర్ కున్న కొత్త ప్రణాళికలు ఏమిటనేవి తెలియాలంటే… మరికొంతకాలం వేచి చూడాలి!