‘మేమే గెలుస్తాం..’ అనే ధీమా ఏ రాజకీయ పార్టీకి అయినా వుండాల్సిందే.! అధికార పీఠమెక్కడానికే ఏ రాజకీయ పార్టీ అయినా రాజకీయం చేస్తుంది. కాంగ్రెస్, బీజేపీ లాంటి జాతీయ పార్టీలే కాదు, ఏ ప్రాంతీయ పార్టీ అయినా రాజకీయం చేసేది అధికార పీఠమెక్కడానికే కదా.!
కాబట్టి, ప్రధాని నరేంద్ర మోడీ, తెలంగాణలో అధికార పీఠమెక్కుతాం, సంపూర్ణ మెజార్టీ సాధిస్తాం.. అని ఎన్నికల ప్రచార సభల్లో నినదించడాన్ని మరీ అంతగా ఆక్షేపించలేం. అయితే, తెలంగాణలో ఎన్నికల ప్రచారం సందర్భంగా ప్రధాని మోడీ తెలుగులో స్పష్టంగా మాట్లాడుతున్నారు కొన్ని మాటల్ని.
ప్రజల్ని కలవని, సచివాలయానికి వెళ్ళని ముఖ్యమంత్రి తెలంగాణకు అవసరమా.? అని ప్రధాని నరేంద్ర మోడీ తెలుగులో ప్రశ్నించడం సహా, ఆయన చేస్తున్న పలు విమర్శలు, తెలంగాణ సమాజాన్ని ఆలోచనలో పడేస్తున్నాయి.
తెలంగాణలో కాంగ్రెస్ పుంజుకుంది. అధికార బీఆర్ఎస్ కొంత నీరసించింది. ప్రభుత్వ వ్యతిరేక ఓటు పూర్తిగా ఓ పార్టీకి పడటం అంటూ జరిగితే, అది కాంగ్రెస్ పార్టీకే అవుతుంది. కానీ, ఇక్కడ బీజేపీ కూడా పుంజుకుంటోంది. మెజార్టీ నియోజకవర్గాల్లో ముక్కోణపు పోటీ కనిపిస్తోంది.
దాదాపు అన్ని చోట్లా ముక్కోణపు పోటీ.. అనడం అతిశయోక్తి కాదేమో. అదే జరిగితే, ఏ పార్టీ ఎక్కడ గెలిచినా, మెజార్టీ చాలా తక్కువే వుంటుంది. హంగ్ దిశగా పరిస్థితులూ కనిపించొచ్చు. ఇలాంటి సందర్భాల్లోనే జనసేన పార్టీ ప్రభావం కూడా గట్టిగానే కనిపిస్తోంది. పోటీలో లేకపోయినా, టీడీపీ మద్దతుదారులు వేసే ఓట్లు కూడా కీలకం అవుతాయి.
చివరి నిమిషంలో టీడీపీ తమవైపుకు తిరుగుతుందని బీజేపీ నమ్ముతోంది. అదే గనుక జరిగితే, తెలంగాణలో బీజేపీకి ముక్కోణపు పోటీలో బంపర్ మెజార్టీ దక్కొచ్చు.! అధికార బీఆర్ఎస్‌లో కూడా ఇదే భయం కనిపిస్తోంది. నిన్న మొన్నటిదాకా ధీమాగా వున్న కాంగ్రెస్ కూడా ఇప్పుడు బీజేపీకి భయపడుతుండడానికి కారణం అదే.!