ప్ర‌ణ‌బ్ ముఖ‌ర్జీకి `భార‌త‌ర‌త్న‌` పుర‌స్కారం వెనుక‌..!

సామాజిక కార్య‌క‌ర్త నానాజీ దేశ్‌ముఖ్‌, బాలీవుడ్ తొలిత‌రం గాయ‌కుడు భూపేన్ హ‌జారికా, మాజీ రాష్ట్ర‌ప‌తి ప్ర‌ణ‌బ్ ముఖ‌ర్జీకి భార‌త‌ర‌త్న పుర‌స్కారాన్ని ప్ర‌క‌టించింది కేంద్రం. నానాజీ దేశ్‌ముఖ్‌, భూపేన్ హ‌జారికాల‌కు మ‌ర‌ణానంత‌రం ఈ పుర‌స్కారం వ‌రించింది.

ప్ర‌ణ‌బ్ ముఖ‌ర్జీకి ప్ర‌తిష్ఠాత్మక పౌర పుర‌స్కారాన్ని ప్ర‌క‌టించ‌డం.. రాజ‌కీయ విశ్లేష‌కుల బుర్ర‌ల‌కు ప‌దును పెట్టింది. స‌మ‌కాలీన రాజ‌కీయాల్లో మాజీ ప్ర‌ధాని డాక్ట‌ర్ మ‌న్మోహ‌న్ సింగ్‌, మాజీ ఉప ప్ర‌ధాని లాల్ కృష్ణ అద్వానీల వంటి ఉద్దండుల ప‌క్క‌న వినిపించే పేరు ప్ర‌ణ‌బ్ ముఖ‌ర్జీది. దేశంలోని రాజ‌కీయ నాయ‌కులంద‌రిలోకి ఆయ‌న సీనియ‌ర్‌. అనుభ‌వ‌జ్ఞుడు. వివాద ర‌హితుడు. ట్ర‌బుల్ షూట‌ర్‌. అంత‌కుమించి- క‌ర‌డు గ‌ట్టిన కాంగ్రెస్ వాది.

త‌న రాజకీయ జీవితాన్ని కాంగ్రెస్‌తో ఆరంభించారు. దేశ అత్యున్న‌త ప‌ద‌విలో ఆసీనుల‌య్యేంత వ‌ర‌కూ అదే పార్టీలో కొన‌సాగారు. ఇబ్బందుల్లో ప‌డిన ప్ర‌తీసారీ కాంగ్రెస్ పార్టీ ప్ర‌ణ‌బ్ వైపు చూసేదని అన‌డంలో సందేహాలు అక్క‌ర్లేదు. బీజేపీ, ఆర్ఎస్ఎస్‌, సంఘ్ ప‌రివార్ అంటే ఆయ‌న‌కు నిన్న, మొన్న‌టి వ‌ర‌కూ అస్స‌లు ప‌డ‌దు.

అలాంటి రాజ‌నీతిజ్ఞుడికి బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్ర‌భుత్వం భార‌త‌ర‌త్న పుర‌స్కారాన్ని అద‌జేసిందంటే ఏమ‌నుకోవాలి. కార‌ణం ఏమై ఉంటుంద‌నే అభిప్రాయాలు స‌ర్వత్రా వ్య‌క్త‌మౌతున్నాయి. కేంద్రం ఈ నిర్ణ‌యం తీసుకోవ‌డం వెనుక సంఘ్ ప‌రివార్ `రెకమెండేష‌న్` ప‌ని చేసింద‌ని అంటున్నారు.

రాష్ట్ర‌ప‌తిగా ప‌ద‌వీకాలం పూర్త‌యిన త‌రువాత ప్ర‌ణ‌బ్ ముఖ‌ర్జీ విశ్రాంత జీవితాన్ని గ‌డ‌ప‌ట్లేదు. ఆయ‌న సంఘ్ పరివార్‌కు ద‌గ్గ‌రయ్యారు. దీనికి నిద‌ర్శ‌నం. మ‌హారాష్ట్ర‌లోని నాగ్‌పూర్‌లో గ‌త ఏడాది జ‌రిగిన ఆర్ఎస్ఎస్ తృతీయ వార్షిక శిక్ష‌ణ కార్య‌క్ర‌మానికి ప్ర‌ణ‌బ్ ముఖ్య అతిథిగా హాజ‌ర‌య్యారు. త‌న రాజ‌కీయ జీవితంలో ఏనాడూ సంఘ్ ప‌రివార్ వైపు క‌న్నెత్తి చూడ‌ని ప్ర‌ణ‌బ్ వంటి లౌకిక‌వాది.. ఈ స‌మావేశాల్లో పాల్గొన‌డం కాంగ్రెస్ అధిష్ఠానాన్ని కూడా బుగ్గ‌లు నొక్కుకునేలా చేసింది.

ఈ కార్య‌క్ర‌మానికి ప్ర‌ణ‌బ్ ముఖ‌ర్జీ హాజ‌రుకాకుండా ఉండ‌టానికి కాంగ్రెస్ నేత‌లు చేయాల్సినవ‌న్నీ చేశారు. ఆయ‌న‌కు న‌చ్చ‌జెప్పారు. లేఖ‌లు రాశారు. వారి ప్ర‌య‌త్నాల‌న్నీ విఫ‌ల‌మ‌య్యాయి. తాను చేయ‌ద‌ల‌చుకున్న‌ది చేశారు ప్ర‌ణ‌బ్‌. నాగ్‌పూర్‌కు వెళ్లిన ఆయ‌న‌కు విమానాశ్ర‌యంలో ఆర్ఎస్ఎస్ కార్య‌క‌ర్త‌లు ఇచ్చిన ఘ‌న‌స్వాగ‌తం అప్ప‌ట్లో చ‌ర్చ‌నీయాంశ‌మైంది కూడా. ప్ర‌ణ‌బ్ వంటి లౌకిక‌వాది ఆర్‌ఎస్ఎస్ కార్యక్రమానికి వెళ్లి తన సిద్ధాంతాన్ని మార్చుకోరని, సంఘ్ ప‌రివార్ కార్య‌క‌ర్త‌ల‌కు ఆయ‌న లౌకికవాదం గురించి సందేశం ఇస్తారని ఆశిస్తున్నాన‌ని సుశీల్ కుమార్ షిండే వ్యాఖ్యానించారు.

ప్ర‌ణ‌బ్‌ను ఆహ్వానించ‌డాన్ని ఆర్ఎస్ఎస్ స‌మ‌ర్థించుకుంది కూడా. ప‌ర‌స్ప‌ర విరుద్ధ భావాలు ఉన్న నేత‌ల‌ను, వివిధ రంగాల ప్ర‌ముఖుల‌ను త‌మ వార్షిక కార్య‌క్ర‌మాల‌కు ఆహ్వానిస్తుంటామ‌ని వెల్ల‌డించింది. ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహ‌న్ భ‌గ‌వ‌త్ అంత‌కుముందే- నాలుగుసార్లు ప్ర‌ణ‌బ్‌తో స‌మావేశ‌మ‌య్యారు.

త‌మ భావ‌జాలానికి సంబంధించిన కొన్ని పుస్త‌కాల‌ను ఆయ‌న‌కు కానుక‌గా ఇచ్చారు. వాటిని తాను త‌ప్ప‌కుండా చ‌దువుతాన‌ని ఆ సంద‌ర్భంగా ప్ర‌ణ‌బ్ చెప్ప‌డం కూడా ఆస‌క్తి రేపింది. దీన్ని బ‌ట్టి చూస్తే- ఎలాంటి ఊహాగానాల‌కు తావివ్వ‌కుండా ప్ర‌ణ‌బ్ ముఖ‌ర్జీకి భార‌తర‌త్న పుర‌స్కారాన్ని ప్ర‌క‌టించ‌డం వెనుక సంఘ్ ప‌రివార్ మ‌ద్ద‌తు ఉంటుంద‌నే అభిప్రాయాలు వ్య‌క్త‌మౌతున్నాయి. బీజేపీ అంటే ఏ మాత్రం లెక్క చేయ‌ని బెంగాలీ బాబుల‌ను మ‌చ్చిక చేసుకోవ‌డం కూడా ఓ కార‌ణ‌మై ఉంటుంద‌ని చెప్పేవారూ చాలామందే ఉన్నారు.