ఓడలు బల్లు అవుతుతాయి బల్లు ఓడలు అవుతాయి అంటే ఇదేనేమో. ఒకప్పుడు ఎమ్మెల్యేగా గెలుపొందడమే కాకుండా ఆర్టీసీ ఛైర్మన్ గా కూడా పనిచేసిన గోనె ప్రకాష్ రావు ఇప్పుడు పచ్చళ్లు అమ్ముకుంటున్నారు. మాజీ ఎమ్మెల్యేగా వచ్చే కొద్దిపాటి పెన్షన్ తో బతుకుబండి లాగడం కష్టం అవడంతో ఇప్పుడు పచ్ఛళ్ల వ్యాపారం చేసుకుంటున్నారు. మరే ఆదాయం లేకపోవడంతో ఇప్పుడు ఆయన పచ్చళ్ల తయారీతో పాటు వాటిని అమ్ముకుంటూ బతుకీడుస్తున్నారు.
వైఎస్ హయాంలో ఈయన హవా అప్పట్లో అంతో ఇంతో నడిచింది. వైఎస్ మద్ధతుతో ఆర్టీసీ ఛైర్మన్ కూడా అయ్యారు. అయితే బతుకుబండి సవ్యంగా సాగుతున్న తరుణంలో వైఎస్ అకాలమరణం చెందడంతో ఈ పరిస్థితి మారిపోయింది. నానాకష్టాలు పడి నెట్టుకొచ్చిన పొలిటికల్ కెరీర్ కూడా కష్టాల్లో పడిపోయింది. ఇక ఈయన రాజకీయ ప్రస్తానాన్ని చూస్తే….1983లో సంజయ్ విచార్ మంచ్ పార్టీతో పెద్దపల్లి నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఏమోందో ఏమోకాని ఆరు నెలలకే రాజీనామా చేసేశారు. ఆతర్వాత వైఎస్ అనుచరుడిగా కొనసాగారు. వైఎస్ఆర్సీపీ లో కూడా చేరారు. 2014లో పెద్దపల్లి నుంచి పోటీ చేసేందుకు అంతా సిద్ధం చేసుకున్న తరుణంలో జగన్ సమైక్యాంధ్రకు మద్ధతు పలకడంతో పార్టీలోంచి బయటకు వచ్చేశారు.
అయితే రాష్ట్ర విభజన తర్వాత పూర్తిగా చతికిలపడిపోయారు. రాజకీయాలోంచి తప్పుకొని ఏపీలో ఉండవల్లి అరుణ్ కుమార్ తరహాలో తెలంగాణలో విశ్లేషకుడిగా కొంత కాలం హడావిడి చేశారు. ఆర్టీఐ చట్టం సాయంతో అప్పట్లో హడావిడి కూడా చేశారు. కొన్ని సందర్భాల్లో రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా చాలా ఇబ్బంది పెట్టారు. అయితే ఆతర్వాత ఎందుకో గాని అది కూడా మానుకున్నారు. ఇక రాజకీయాలు తనకు అచ్చిరాని గుర్తించారో ఏమో రాజకీయాలకు పూర్తి స్థాయిలో గుడ్ బై చెప్పేశారు.
ఆదాయ మార్గాలను సృష్టించుకోవడంలో విఫలమవడంతో చరమాంకంలో చాలానే ఇబ్బందిపడ్డారు. చివరకు తప్పని సరిపరిస్థితుల్లో కొంత కాలం వృద్ధాశ్రమంలో కూడా ఉన్నారు. ఇది గమనించిన కొంత మంది పాత స్నేహితులు రంగంలోకి దిగి సాయం చేయడంతో కొత్త వ్యాపారం ప్రారంభించారు. అమెరికాలో సెటిల్ అయిన కొంత మంది స్నేహితుల సాయం చేసినట్లు సమాచారం. వీళ్ల సాయంతో సాయంతోనే గోనె పచ్చళ్లు, గోనె పిండివంటలంటూ తన ఇంటి పేరునే బ్రాండ్ గా మార్చుకొని కొత్త వ్యాపారం ప్రారంభించారు. ఇలా తాను తయారు చేసిన పచ్చళ్లు పిండి వంటలను విదేశాల్లోని ఎన్నారైలకు సప్లై చేసేందుకు కొరియర్ సర్వీసు కూడా పెట్టేశారు.
ఓ మాజీ ఎమ్మెల్యే ఇలా పచ్చళ్లు అమ్ముకోవడం పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది. గోనె ప్రకాశ్ రావుకు ఎంతో విషయ పరిజ్ఞానం ఉన్నా… రాజకీయాల్లో ఎదగలేక చివరకు పచ్చళ్ల వ్యాపారం పెట్టుకోవడంతో చాలా మందిని బాధపెట్టింది. వయసులో ఉన్నప్పుడే అంతో ఇంతో పోగు చేసుకుంటే ఇప్పుడు ఆయనకు ఈ కష్టం వచ్చేది కాదని బాధపడిపోతున్నారు. సో ఇదండీ సంగతి రాజకీయాలు అందర్ని అచ్చిరావని మరోసారి రుజువు అయిపోయింది.