రేవంత్ రెడ్డి.. మళ్ళీ అదే తప్పు చేస్తే ఎలా?

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా తన తొలి ఏడాదిని పూర్తి చేసుకున్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన విజయోత్సవాలు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. అయితే, ఆయన పాలనలో ఇటీవల కొన్ని మార్పులు కనిపిస్తున్నాయనే విమర్శలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా ఆయన తీరు తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను పోలి ఉందని కొందరు విశ్లేషిస్తున్నారు.

కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు అందుబాటులో లేకపోవడం, పార్టీ నేతలతో సరైన కమ్యూనికేషన్ లేకపోవడం వంటి అంశాలు అప్పట్లో పెద్ద చర్చకు దారితీశాయి. ముఖ్యంగా, తనను కలిసేందుకు వచ్చిన నేతలకు సమయం కేటాయించకపోవడం, అపాయింట్‌మెంట్ ఇవ్వకపోవడం వంటి వాటితో పలువురు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇప్పుడు, రేవంత్ పాలనలో కూడా ఇలాంటి సరళి కనిపిస్తోందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

రేవంత్ తన అధికారంలో పటిష్టమైన సొంత టీమ్‌ను ఏర్పాటు చేయకపోవడం, విపక్షాల విమర్శలకు సమాధానం చెప్పేందుకు తగిన వ్యూహాన్ని రూపొందించకపోవడం వంటి అంశాలు ఆయన నాయకత్వానికి మైనస్‌గా మారుతాయని విశ్లేషకులు చెబుతున్నారు. అలాగే, పార్టీ నేతలు, ఇతర వర్గాల ప్రజలతో సమయాన్ని కేటాయించకపోవడం, అపాయింట్‌మెంట్‌ల కోసం గంటల తరబడి వేచి ఉండే పరిస్థితి కూడా వ్యతిరేకతను తెచ్చిపెడుతుందని అంటున్నారు.

కేసీఆర్ మాదిరిగా పాలన సాగించడం రేవంత్‌కు తగిన మార్క్ సాధించడానికి అవరోధంగా మారవచ్చని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. ప్రజలకు, పార్టీకి అందుబాటులో ఉండి సమస్యలను ప్రత్యక్షంగా అర్థం చేసుకోవడం, సమయం కేటాయించడం వంటి అంశాల్లో మార్పు తీసుకురావాల్సిన అవసరం ఉందని సూచిస్తున్నారు. ఒక ప్రత్యేకమైన నాయకత్వ శైలిని చూపడం రేవంత్‌కు అవసరమని రాజకీయ పండితులు అభిప్రాయపడుతున్నారు.