పాత పర్సులో బియ్యం గింజలు ఎందుకు వేయాలో తెలుసా.. వాస్తు శాస్త్రం చెప్పే నిజాలు ఇవే..!

డిజిటల్‌ యుగంలో మనం పర్సు తీసుకెళ్లడమే మానేశాం. క్యాష్‌ వినియోగం తగ్గిపోవడంతో చాలామంది వాలెట్‌ను ఖాళీగా ఉంచి తిరుగుతున్నారు. కానీ వాస్తు దృష్టిలో మాత్రం ఈ అలవాటు సాధారణం కాదు. ఖాళీ పర్సు అంటే మన దైనందిన జీవితంలో ఉన్న ఆర్థిక ప్రవాహానికి అడ్డుకట్ట పడుతుందని చెబుతున్నారు. అందులో ఒక్క నాణెం కూడా లేకపోతే.. అది ఆకర్షించేది సంపద కాదు, నెగిటివిటీ అని వాస్తు నిపుణులు చెబుతున్నారు.

వాస్తు ప్రకారం ఖాళీ పర్సు ‘శూన్యం’కి సంకేతం. ఆర్థిక రీతిలో ఇది లోటును సూచిస్తుందని నమ్మకం. చేతిలో ఎప్పుడూ డబ్బు లేకపోవడాన్ని గుర్తు చేస్తూ మనసును కుంగదీసే ఎనర్జీ పర్సులో నుంచే వస్తుందని అంటారు. నిండిన వాలెట్ ఇచ్చే పాజిటివ్ భావన, ఖాళీ పర్సు ఇవ్వదు. దాన్ని తెరిచిన ప్రతిసారీ “సంపద లేదు” అనే గుర్తింపు మనలోకి ప్రవేశించి మూడ్‌, ఆర్థిక నిర్ణయాలు, ధైర్యం వీటన్నిటినీ పాడు చేస్తాయని చెబుతున్నారు.

పండితుల అభిప్రాయం ప్రకారం.. లక్ష్మీదేవి కరుణ పొందాలంటే పర్సు ఎప్పుడూ పూర్తిగా ఖాళీగా ఉంచకూడదు. కనీసం ఒక్క రూపాయి నాణెన్నైనా పెట్టుకోవాలని పూజారులు, వాస్తు నిపుణులు చెప్పే మాట తరతరాలుగా వస్తోంది. ప్రత్యేకించి ఓ చిన్న కాయిన్‌కి ఎరుపు వస్త్రం చుట్టి పర్సులో ఉంచితే పాజిటివ్ ఎనర్జీ పెరిగి, ఆర్థిక అవకాశాలు మెరుగుపడతాయని విశ్వసిస్తారు. ఎరుపు రంగు శక్తికి, వేగానికి, లక్ష్మీ కరుణకు ప్రతీకగా భావించబడుతుంది.

పాత పర్సును కూడా ఖాళీగా పారేయడం వాస్తు ప్రకారం మంచిది కాదు. దానిలో రెండు మూడు బియ్యపు గింజలు ఉంచి, వాటిలో కొన్నింటిని కొత్త పర్సులో వేయాలి. ఇది “అదృష్టం ట్రాన్స్‌ఫర్” అవుతుందనే భావన. గిఫ్ట్‌గా పర్సు ఇస్తే కూడా ఖాళీగా ఇవ్వకూడదు. కొద్దిపాటి డబ్బు, లేకపోతే అక్షతలు అయినా వేయాలి. అలా చేస్తే, దాత.. గ్రహీత ఇద్దరికీ సంపద దోహదం అవుతుందని నమ్ముతారు.

ఇక చాలా మంది తమ పర్సులను పాత బిల్లులు, గడువు ముగిసిన కార్డులు, సేవలు తీసుకోని రసీదులు, ATM స్లిప్‌లతో నింపేస్తుంటారు. అలా అడ్డు పడే పేపర్ల వల్ల పర్సులో డబ్బు “స్థిరంగా ఉండదని”, సంపద ప్రవాహం అడ్డుకుపోతుందని వాస్తు చెబుతోంది. పర్సు ఎప్పుడూ శుభ్రంగా, సర్దుబాటు చేసి ఉండాలి. నేలపై, బాత్రూంలో, పరిశుభ్రత లేని చోట పెట్టడం కూడా నెగిటివ్ ఎనర్జీకి కారణమని నమ్ముతారు. చిరిగిన పర్సులు సంపద శక్తిని లీక్ చేస్తాయని, అందుకే వాటిని వెంటనే మార్చుకోవడం మంచిదని సూచనలు వస్తున్నాయి.

ఇన్నాళ్లు మనం పర్సును కేవలం డబ్బు పెట్టుకునే వస్తువుగా మాత్రమే చూశాం. కానీ వాస్తు దృష్టిలో అది మన ఆర్థిక ప్రవాహానికి చిన్న ‘మాగ్నెట్’ లాంటిదట. దాన్ని ఎలా ఉంచుతామో.. మన డబ్బు పరిస్థితి కూడా అలాగే ఉంటుందని విశ్వసించడం విశేషమే. మరి మీ పర్సు ఎలా ఉంది? ఖాళీగా ఉందా? లేక సంపదను ఆకర్షించేలా సిద్ధంగా ఉందా? అయితే వాస్తు చెబుతున్న ఈ చిన్నచిన్న మార్పులు.. మనసుకు ధైర్యం, జీవితానికి కొంత పాజిటివిటీ తీసుకురావడం మాత్రం నిజం.