ఎన్నికల తరుణం ముంచుకొస్తోంది. మరి కొద్ది రోజులే. వచ్చేనెల రెండో వారంలో సార్వత్రిక ఎన్నికల నోటిఫికేషన్ వెలువడే అవకాశాలు ఉన్నాయి. లోక్‌సభతో పాటు ఏపీ, ఒడిశా, మహారాష్ట్ర, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్, హర్యానా, జార్ఖండ్ అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు నిర్వహిస్తారు.
తెలంగాణ అసెంబ్లీకి కూడా ఈ ఏడాదే ఎన్నికలు జరగాల్సి ఉన్నప్పటికీ.. అసెంబ్లీని రద్దు చేయడం వల్ల ముందస్తు ఎన్నికల ప్రకియను చేపట్టారు. జమిలి ఎన్నికలు అయినందున మన రాష్ట్రంలో 175 అసెంబ్లీ, 25 లోక్‌సభ స్థానాలకు ఒకేసారి ఓటింగ్ ప్రక్రియ ఉంటుంది.
ఎన్ని దఫాల్లో నిర్వహిస్తారనేది ఇంకా తెలియాల్సి ఉంది. అధికార తెలుగుదేశం, ప్రతిపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీల మధ్యే ప్రధాన పోరు ఉంటుంది. తెలుగుదేశంతో పొత్తు లేకుండా జనసేన ఎన్నికల బరిలో నిలిస్తే- త్రిముఖ పోరు తప్పదు.
ఎన్నికల నోటిఫికేషన్ ఫిబ్రవరిలో వెలువడుతుందనే సమాచారం తెలిసే- ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వరుసబెట్టి శంకుస్థాపనలు చేస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. కడపజిల్లా కంభాలదిన్నెలో ఉక్కు పరిశ్రమ, కుప్పంలో విమానాశ్రయ నిర్మాణానికి శంకుస్థాపనలు చేయడం వెనుక ఉద్దేశం ఇదేనని అంటున్నారు.