పక్షవాతం… ఇది ఒక్కసారి వస్తే జీవితం మారిపోయే అవకాశం ఎక్కువ. ఇది ఒక్కసారిగా దాడి చేసే శత్రువులా మన శరీరాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తుంది. కానీ దీనిని ముందే గుర్తించి.. వేగంగా స్పందిస్తే ప్రమాదాన్ని తగ్గించుకోవచ్చు. ఈ రోజుల్లో యువత నుంచి వృద్ధుల వరకు ఈ సమస్యతో బాధపడుతున్నవారు ఎక్కువగా కనిపిస్తున్నారు. ముఖ్యంగా మెదడు, నరాలు, రక్తనాళాల్లో ఏర్పడే లోపాలే ఈ పరిస్థితికి కారణం.
పక్షవాతం వచ్చే ముందు శరీరం కొన్ని సంకేతాలు ఇస్తుంది. కానీ అవి సాధారణంగా పట్టించుకోకపోతే ప్రమాదం దగ్గరకు చేరుతుంది. అందుకే ఈ సంకేతాలను తెలుసుకొని, అవి కనిపించగానే తక్షణమే వైద్య సహాయం తీసుకోవడం చాలా అవసరం. పక్షవాతానికి ముఖ్యమైన లక్షణాల్లో ముఖం ఒకవైపు వాలిపోవడం, ఒక చేతిని కదిలించలేకపోవడం, స్పష్టంగా మాట్లాడలేకపోవడం ప్రధానంగా ఉన్నాయి. కొన్ని సందర్భాల్లో శరీర సమతుల్యత కోల్పోవడం, తడబడటం, తల తిరగడం, తల బరువుగా అనిపించడం, చూపు మసకబారడం, మూర్ఛ రావడం వంటి లక్షణాలు కూడా కనిపిస్తాయి.
ఈ లక్షణాల్ని గుర్తించేందుకు “FAST” అనే సూత్రాన్ని మెడికల్ రంగం సూచిస్తోంది.
F అంటే ముఖం చెక్ చేయండి.. నవ్వమని చెప్పినప్పుడు ముఖం ఒకవైపు వాలిపోతుందా..
A అంటే చేతులు రెండు చేతుల్ని పైకి లేపమంటే ఒకచేయి పడిపోతుందా?
S అంటే మాట స్పష్టంగా మాట్లాడలేకపోతున్నారా?
T అంటే టైం – ఈ లక్షణాలు కనిపించగానే సమయాన్ని వృథా చేయకుండా వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లాలి.
పక్షవాతం అనేది ఒక అత్యవసర పరిస్థితి. ప్రాథమిక లక్షణాలను పట్టించుకుని వెంటనే స్పందిస్తే ప్రాణాలు నిలిపే అవకాశం ఉంటుంది. ఆలస్యం చేయడం ప్రాణాంతకంగా మారవచ్చు. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలి.
