చివరి నిముషం వరకూ నువ్వా నేనా అన్నట్లు సాగిన దుబ్బాక ఉపఎన్నిక ఫలితం బీజేపీ స్వల్ప ఆధిక్యతతో నెగ్గడంతో ఉత్కంఠకు తెరపడింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత తన సిట్టింగ్ స్థానాన్ని కోల్పోవడం తెరాసకు ఇదే ప్రధమం. కేసీఆర్ పాలన మీద పెద్దగా వ్యతిరేకత లేకపోయినప్పటికీ, సానుభూతి కోణం అభ్యర్ధిమీద పనిచేయకపోవడం, ఉన్న స్థానాన్ని పోగొట్టుకోవడం నిజంగా తెరాస ఆత్మపరిశీలన చేసుకోవలసిన ఆవశ్యకతను స్పష్టం చేసింది.
అయితే బీజేపీ, కాంగ్రెస్ పరస్పరం విభేదించుకున్నట్లు పైపైకి డ్రామాలు ప్రదర్శించినప్పటికీ, లోలోపల సహకరించుకున్నాయని, కాంగ్రెస్ తన ఓట్లను బీజేపీకి మళ్లించిందని కొందరు తెరాస అభిమానులు, కార్యకర్తలు వాపోతున్నారు. రాజకీయమంటే కుళ్ళు, కుతంత్రాల మయం. ఎలా గెలిచావన్నది ముఖ్యం కాదు. గెలిచావా లేదా అన్నదే ముఖ్యం. ఈ విజయం రఘునందనరావు వ్యక్తిగతమా లేకా బీజేపీ ఖాతాలోకి వెళ్తుందా? పరాజయం సుజాతమ్మ వ్యక్తిగతమా లేకా టీఆరెస్ ఖాతాలోకి వెళ్తుందా అనేది ఇప్పుడు తేలాల్సిన అంశం. సుజాతమ్మ మీద ఒకరకమైన సానుభూతి ఉంటె రఘునందనరావు మీద మరొకరకమైన సానుభూతి ఉన్నది. ఆయన గతంలో ఓడిపోయాడనే సానుభూతి సుజాతమ్మ మీద ఉండాల్సిన సానుభూతిని అధిగమించింది. పైగా ఆయన విద్యాధికుడు కావడం, జనబాహుళ్యంలో పరిచయం ఉన్నవాడు కావడంతో సుజాతమ్మ ఆయనకు పోటీ కాలేకపోయారు.
అంతే కాకుండా పోలీసుల అతి ప్రవర్తన కూడా కొంతమేర రఘునందనరావుకు సానుభూతి కలిగేట్లు చేసింది. ఆయన ఇంటిమీద, బంధువుల మీద ఒకటికి రెండుసార్లు పోలీసులు దాడులు చేసి నోట్ల కట్టలు పట్టుకోవడం, ఆ పట్టుకున్నది కూడా పెద్ద మొత్తం కాకపోడంతో కేవలం ఆయన్ను అల్లరిపాలు చెయ్యడానికే పోలీసులు ఆ విధంగా ప్రవర్తించారన్న అభిప్రాయం ప్రజలకు కలిగిందని ఒక ప్రముఖ పాత్రికేయుడు విశ్లేషించారు. గత ఎన్నికల్లో కేవలం ఇరవై వేల ఓట్లు మాత్రమే సాధించిన బీజేపీ ఈసారి అరవై ఒక్కవేల ఓట్ల పైచిలుకు సాధించడం, గత ఎన్నికల్లో యాభై వేల ఓట్ల పైచిలుకు ఆధిక్యత సాధించిన టీఆరెస్ ఈసారి కేవలం అరవై వేల ఓట్లనే సాధించడం పార్టీలో అంతర్మధనానికి గురి చేసింది. ప్రచారభారం మొత్తాన్ని నెత్తిన వేసుకున్న హరీష్ రావు రాత్రింబవళ్లు కృషి చేసినా వైఫల్యం చెందటం పార్టీ శ్రేణులను ఆవేదనకు గురి చేస్తున్నది.
సాధారణంగా ఉపఎన్నికలో అధికారపార్టీ వైపు మొగ్గు ఉండటం సహజం. అందునా మరణించిన అభ్యర్థి ఇల్లాలే బరిలో ఉన్నప్పుడు సునాయాసంగా విజయం దక్కాలి. అలా కాకుండా ఓటమి ఎదురు కావడం టీఆరెస్ తన వ్యూహాలను మార్చుకోవాల్సిన అవసరాన్ని గుర్తు చేస్తున్నది. క్షేత్రస్థాయిలో సోషల్ మీడియాను సరిగ్గా వాడుకోలేదని, పార్టీకోసం పనిచేసేవారిని గుర్తించలేదని, బీజేపీ మాత్రం సోషల్ మీడియాలో చెలరేగిపోయిందని, యథేచ్ఛగా అబద్ధాలను ప్రచారం చేసిందని, కాంగ్రెస్ అభ్యర్థి తెరాసలో చేరిపోయాడని ఒక టీవీ ఛానెల్ పేరుతో ఫేక్ వార్తను ప్రసారం చేసినా బాధ్యులను పోలీసులు పట్టుకోలేదని, ఫలితంగా తమకు ఓటమి ఎదురైందని బాధపడుతున్నారు.
దానికితోడు కాంగ్రెస్ పార్టీ కూడా అంతర్గతంగా బీజేపీకి సహకరించిందని ఇక్కడ కొన్ని సూచనలు వ్యక్తం అయ్యాయి. చివరి క్షణం వరకు అభ్యర్థిని ప్రకటించకుండా, టీఆరెస్ నుంచి తమ పార్టీలో ఆఖరి క్షణంలో చేరిన శ్రీనివాసరెడ్డికి టికెట్ ఇవ్వడం ద్వారా కావాలనే బలహీనమైన వ్యక్తికీ టికెట్ ఇచ్చి పరోక్షంగా బీజేపీకి సహకరించింది అని ఇప్పుడు అందరూ సందేహిస్తున్నారు. అంతేకాకుండా కాంగ్రెస్ అభ్యర్థి గెలిచినా టీఆరెస్ లో చేరుతాడు అనే బీజేపీ ప్రచారం కూడా బాగానే పనిచేసినట్లుంది. కాంగ్రెస్ మూడో స్థానంలోకి వెళ్లడం ద్వారా తెలంగాణాలో టీఆరెస్, బీజేపీ మాత్రమే ఇకముందు అధికారం కోసం పోటీదారులు కాబోతున్నాయనే సంకేతాలు అందాయి. తమ ప్రత్యర్థిగా కాంగ్రెస్ పార్టీ అని భావిస్తున్న టీఆరెస్ ఇకమీదట తమ రాజకీయ ప్రత్యర్థి బీజేపీ మాత్రమే అని గుర్తించాలి. రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ఇమేజ్ ను దుబ్బాక ఫలితం పెంచింది అని చెప్పాలి.
విజయం సాధించిన బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావుకు తెలుగురాజ్యం అభినందనలు తెలియజేస్తోంది.
ఇలపావులూరి మురళీ మోహన రావు
సీనియర్ రాజకీయ విశ్లేషకులు