రాత్రి పార్టీ ముగిసిన తర్వాత అకస్మాత్తుగా ఫోన్ చేతిలోకి వచ్చేస్తుంది. స్క్రీన్‌పై పాత పేర్లు కనిపిస్తాయి. ఎన్నో సంవత్సరాలుగా విడిపోయిన ప్రేయసి లేదా దూరమైన స్నేహం.. ఒకసారి గుర్తుకు వస్తుంది. ఒకసారి కాల్ చేస్తే ఏవుతుంది, మెసేజ్ చేస్తే బాగున్ను అనిపిస్తుంది. మరుసటి రోజు ఉదయం కాల్ లాగ్ చూసి షాక్ అవ్వడం, పశ్చాత్తాపపడడం చాలా మందికి ఎదురైన అనుభవమే. దీనినే సరదాగా డ్రంక్ కాలింగ్ లేదా డ్రంక్ టెక్స్టింగ్ అంటాం. కానీ ఇది సరదా కంటే మెదడులో జరిగే శాస్త్రీయ మార్పుల ఫలితం అని నిపుణులు చెబుతున్నారు.
మద్యం శరీరంలోకి వెళ్లగానే మన మెదడులోని నియంత్రణ వ్యవస్థ ప్రభావితం అవుతుంది. సాధారణంగా మన మాటలు, చర్యలను నియంత్రించే భాగాన్ని ప్రిఫ్రంటల్ కార్టెక్స్ అంటారు. ఇదే మనకు ఇది చెప్పాలా” ఇలా చేస్తే ఏమవుతుంది అనే ఆలోచన ఇస్తుంది. కానీ ఆల్కహాల్ ప్రభావంతో ఈ భాగం నెమ్మదిస్తుంది. ఫలితంగా మనలోని ఆలోచనలకు బ్రేక్ పడదు. లోపల దాచుకున్న భావాలు నేరుగా బయటకు వచ్చేస్తాయి.
మద్యం తాగినప్పుడు మెదడులో డోపమైన్ అనే రసాయనం ఎక్కువగా విడుదలవుతుంది. దీనినే ‘ఫీల్ గుడ్ హార్మోన్’ అంటారు. ఇది మొదట ఆనందం, ధైర్యం, ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. అప్పుడు మనకు ఏం చేసినా పర్వాలేదు అన్న భావన కలుగుతుంది. సాధారణంగా తాగని సమయంలో చేయలేని పనులు కూడా తాగినప్పుడు సులువుగా చేయగలమన్న నమ్మకం ఏర్పడుతుంది. ఈ దశలోనే పాత జ్ఞాపకాలు, లోపలి బాధలు, ఒంటరితనం బలంగా బయటకు వస్తాయి.
ఇక్కడ మరో కీలక అంశం ఆల్కహాల్ మయోపియా. అంటే మద్యం తాగినప్పుడు మన ఆలోచన పరిధి చాలా చిన్నదిగా మారిపోతుంది. రేపు ఏమవుతుందో, ఈ కాల్ వల్ల సమస్యలు వస్తాయా అనే భవిష్యత్ ఆలోచన ఉండదు. ఆ క్షణంలో మనకు కలిగిన భావమే అన్నిటికంటే పెద్దదిగా అనిపిస్తుంది. అందుకే అప్పట్లో గుర్తొచ్చిన వ్యక్తికే ఫోన్ చేయాలనిపిస్తుంది. ఆ సమయంలో ఆపే శక్తి మన మెదడుకు ఉండదు.
మద్యం సామాజిక భయాన్ని కూడా తగ్గిస్తుంది. సాధారణంగా సిగ్గుపడే వారు, తమ మనసులోని మాటలు చెప్పలేని వారు తాగిన తర్వాత ఎక్కువగా మాట్లాడతారు. లోపల దాచుకున్న బాధ, కోపం, ప్రేమ, అసంతృప్తి అన్నీ బయటకు వస్తాయి. నిపుణుల మాటల్లో చెప్పాలంటే, మద్యం కొత్త భావాలను సృష్టించదు.. మనలో ఇప్పటికే ఉన్న భావాలను మాత్రమే ఎక్కువగా బయటపెడుతుంది.
ఇలాంటి పరిస్థితులు రాకుండా ఉండాలంటే ముందస్తు జాగ్రత్తలు అవసరం. తాగేముందే ఫోన్‌ను దూరంగా పెట్టడం, డేటా లేదా వైఫై ఆఫ్ చేయడం మంచిది. అవసరమైతే కొన్ని నంబర్లను తాత్కాలికంగా బ్లాక్ చేయడం కూడా ఉపయోగపడుతుంది. మొత్తానికి తాగినప్పుడు వచ్చే ఆ కాల్‌లు మన నిజమైన మనసు నిర్ణయాలా? లేక మద్యం ప్రభావమా? అని ఒక్క క్షణం ఆలోచిస్తే చాలా అనవసర పరిస్థితులను నివారించవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.
