ప్రజలు సంతృప్తిగా ఉన్నంత కాలం ప్రభుత్వాలకు వచ్చిన ఇబ్బందేమి లేదు. ప్రజలను సంతోష పెట్టినంత కాలం ప్రభువులు సాఫీగా నడిపించుకోవచ్చు. అయితే కారణాలు ఏమైనా కాని ప్రజలకు కష్టాలు పెరిగితే మాత్రం ప్రభుత్వాలకు తిప్పలు తప్పవు…. అట్లాంటిది ఓ వైపు కరోనా మరోవైపు హైదరాబాద్ ను వర్షాలు ముంచెత్తాయి. ఖజానా ఖాళీ అవడంతో కేసీఆర్ తప్పనిసరి పరిస్థితుల్లో ఎల్.ఆర్.ఎస్ వసూలు చేయాల్సి వస్తోంది. అసలే కష్టాల్లో ఉంటే వేలకు వేలు ఎలా చెల్లించేదంటూ మధ్యతరగతి ప్రజానీకం భగ్గుమంటున్నారు.
దీంతో ఇంత కాలం సవ్యంగా సాగిన కేసీఆర్ పాలనకు ఇప్పుడు పెద్ద ముప్పే వచ్చిపడింది. దీన్ని అదనుగా తీసుకొని కాంగ్రెస్ , బీజేపీ పార్టీలు కేసీఆర్ సర్కారుపై దుమ్మెత్తి పోస్తున్నాయి. సరిగ్గా ఈటైంలోనే దుబ్బాక ఉపఎన్నికలు రావడంతో మొత్తం వాతావరణం అంతా ఒక్క సారిగా వేడెక్కిపోయింది. మరి ఈ తరుణంలో కేసీఆర్ దుబ్బాక దంగల్ లోకి దిగుతారా. ఇప్పటి వరకు ఏ ఉపఎన్నిక అయినా సరే కేసీఆర్ ఎంటర్ అయిన తర్వాత మొత్తం వార్ వన్ సైడ్ గా మారిపోయింది. మరి ఈసారి ఈ సీన్ రిపీట్ అవుతుందా లేక దుబ్బాక సరికొత్త అధ్యాయానికి నాంది పలుకుతుందా అనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొని ఉంది.
హైదరాబాద్ ను వరదలు ముంచెత్తినా ఆ ప్రభావం దుబ్బాక ఉపఎన్నికలపై ఉండదని పార్టీ వర్గాలు కేసీఆర్ తేల్చిచెప్తున్నాయి. హైదరాబాద్ ను డల్లాస్ గా మారుస్తానంటూ గతంలో కేసీఆర్ చేసిన ప్రకటనలకు ఇప్పుడు నీట మునిగిన హైదరాబాద్ దృష్యాలను జోడిస్తూ కొంత మంది సోషల్ మీడియాలో తెగ ప్రచారం చేస్తున్నారు. అయితే ఈ ప్రభావం హైదరాబాద్ కు మాత్రమే పరిమితం అవుతుందని దుబ్బాకలో ఈ ఛాయలు కనబడవని పార్టీ వర్గాలు భరోసా ఇస్తున్నాయి.
దుబ్బాకలో ప్రచారానికి సంబంధించి పార్టీ నేతలతో కేసీఆర్ సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలుస్తోంది. దసరా తర్వాత ఇందుకు ముహూర్తం ఖరారు చేసే అవకాశం ఉంది. దుబ్బాకలో ఓటమిపాలైతే జనంలో వ్యతిరేకత మొదలైందన్న సంకేతాలు వెళ్తాయి కాబట్టి… ఎట్టి పరిస్థితుల్లోనూ అలా జరగకూడదని కేసీఆర్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. వరద బాధితులను పరామర్శించలేదన్న విమర్శలు ఇతరత్రా వాటిని పట్టించుకోకుండా… ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ప్రచారంలో పాల్గొనాలని సీఎం భావిస్తున్నారు. ఇప్పటివరకూ అన్ని అసెంబ్లీ ఉపఎన్నికల్లోనూ విజయం సాధిస్తూ వచ్చినట్లుగానే ఈ ఉపఎన్నికను కూడా కైవసం చేసుకుని… జనంలో తమపై ఏమాత్రం వ్యతిరేకత లేదని నిరూపించాలనుకుంటున్నారు.
దుబ్బాక ఉపఎన్నికలో గెలిస్తే ఇప్పుడిప్పుడే బలం పోగేసుకుంటున్న కాంగ్రెస్ ను మరోసారి చావుదెబ్బ తీయోచ్చని కేసీఆర్ భావిస్తున్నారు. జనామోదం ఇంకా తనకే ఉందని చాటిచెప్పినట్లు అవుతుందని అంచనా వేస్తున్నారు. ఈ కారణాల నేపథ్యంలో కేసీఆర్ దుబ్బాక దంగల్లో దిగుతారా లేదా అనేది హాట్ టాపిక్ గా మారిపోయింది. దసరా తర్వాత కేసీఆర్ ఎన్నికల ప్రచారంలో పాల్గొనే అవకాశాలు కనిపిస్తున్నాయి.
సవాలక్ష ప్రశ్నలకు ఒకే ఒక్క గెలుపుతో సమాధానం చెప్పడం కేసీఆర్ స్టైల్. అయితే మరి ఈ గెలుపును సాధించుకునేందుకు తాను స్వయంగా దుబ్బాక బరిలోకి దిగుతారా లేక హరీష్ రావుతో కథ నడిపిస్తారా అనేది ఇంకా తేలలేదు.