సనాతన ధర్మాన్ని మలేరియా, డెంగ్యూ, కరోనాలతో పోల్చుతూ తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ కుమారుడు, మంత్రి ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలపై దేశవ్యాప్తంగా రచ్చ జరుగుతున్న సంగతి తెలిసిందే. దీంతో దేశవ్యాప్తంగా ఈ విషయంపై బలమైన చర్చ జరుగుతుందని తెలుస్తుంది. ఈ క్రమంలో ఆయన వ్యాఖ్యలను కొందరు సమర్థిస్తుండగా మరికొందరు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.
తాజాగా ఈ సనాతన ధర్మం పై ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ పొలిటికల్ గేం స్టార్ట్ చేసిందనే కామెంట్లు వినిపిస్తున్నాయి. ఈ సమయంలో ఉదయనిధి ఒంటరివాడు కాదని చెప్పాలనుకున్నారో.. లేక, అధి అతనొక్కడి అభిప్రాయం కాదని నొక్కి వక్కానించాలనుకున్నారో తెలియదు కానీ… మరో నేత ఈ విషయంపై సంచలన వ్యాఖ్యలు చేశారు.
డీఎంకేకు చెందిన నీలగిరి ఎంపీ, మాజీ కేంద్ర మంత్రి ఎ.రాజా తాజగా సనాతన ధర్మంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇందులో భాగంగా ఉదయనిధి స్టాలిన్ సనాతన ధర్మం గురించి తక్కువ వ్యాఖ్యలు చేశారని అన్నారు. వాస్తవానికి సనాతన ధర్మం.. కుష్టు, హెచ్‌ఐవీ లాంటిదని, ఇంకా గట్టిగా చెప్పాలంటే హెచ్‌ఐవీ కంటే ప్రాణాంతకమైనదిగా అభివర్ణించారు రాజా.
ఇదే సమయంలో సనాతన ధర్మంపై ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, శంకరాచార్యులు ఇలా ఎవరైనా సరే తనతో చర్చకు రావాలని ఎ.రాజా సవాల్ విసిరారు. సనాతన ధర్మం అనేది అత్యంత భయంకరమైనదని ఆయన తెలిపారు. ఈ విషయంలో ఉదయనిధి తక్కువగానే మాట్లాడారని.. అంతకంటే ప్రమాదం అని స్పష్టం చేశారు.
దీంతో ఈ ప్రకటనపై బీజేపీ స్పందించింది. ఉదయనిధి తర్వాత రాజా సనాతన ధర్మాన్ని కించపరుస్తున్నారని బీజేపీ ఐటీ విభాగం చీఫ్ అమిత్ మాల్వియా పేర్కొన్నారు. ఇది సనాతన ధర్మాన్ని అనుసరిస్తున్న దేశంలోని 80 శాతం మందిని అవమానించడమేనని చెప్పుకొచ్చారు!
ఆ సంగతి అలా ఉంటే మరోవైపు తన కుమారుడు చేసిన వ్యాఖ్యలపై తమిళనాడు సీఎం స్టాలిన్ స్పందించారు. ఉదయనిధి ఏం మాట్లాడారో తెలుసుకోకుండా ప్రధానమంత్రి కామెంట్ చేయడం సరైందికాదని అన్నారు. బీజేపీ వక్రీకరించినట్లు “జాతి నిర్మూలన”కు పిలుపునివ్వలేదని కేవలం వివక్షకు వ్యతిరేకంగా మాత్రమే తన కొడుకు మాట్లాడారని సీఎం స్పష్టం చేశారు.
అణచివేతకు వ్యతిరేకంగా మాట్లాడినందుకు బీజేపీ అనుకూల శక్తులు తన కుమారుడి వైఖరిని సహించలేకపోతున్నాయని మండిపడిన స్టాలిన్… సనాతన ఆలోచనలు గల వ్యక్తులను నరమేధం చేయాలని ఉదయనిధి పిలుపునిచ్చాడంటూ తప్పుగా ప్రచారం చేస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది వారి కుసంస్కార రాజకీయాలకు నిదర్శనం అన్నట్లుగా స్టాలిన్ వ్యాఖ్యానించారని తెలుస్తుంది.
ఇదే క్రమంలో ఉదయనిధి తల తెస్తే రూ.10 కోట్లు ఇస్తానన్న స్వామీజీపై ఆ రాష్ట్ర ప్రభుత్వం కేసు ఎందుకు పెట్టలేదని నిలదీసిన స్టాలిన్… కొందరు వ్యక్తులు ఇప్పటికీ ఆధ్యాత్మిక వేదికలపై మహిళలను కించపరుస్తున్నారని మండిపడ్డారు. మానవ జాతిలో సగానికి పైగా ఉన్న స్త్రీలపై అణచివేతను కొనసాగించడానికి వారు “సనాతన” అనే పదాన్ని ఉపయోగిస్తున్నారని ఫైరయ్యారు! దీంతో తాజాగా స్టాలిన్ చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి!