కొత్త కలయిక: రేవంత్ తో దిల్ రాజు!

తెలంగాణలో ప్రతీ పార్టీ ఈ ఏడాది చివర్లో జరగబోయే సార్వత్రిక ఎన్నికలను లైఫ్ అండ్ డెత్ ఇష్యూగా తీసుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ విషయంలో రకరకాల ఎత్తులు, పైఎత్తులకు తోడు… సెలబ్రెటీలను పార్టీల్లోకి చేర్చుకునే పనుల్లో కూడా బిజీగా ఉంటున్నారు. అందుకు కలిసివచ్చే ఏ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటున్నారు. ఇందులో భాగంగా… తాజాగా రేవంత్ రెడ్డికి స్వాగతం పలికిన దిల్ రాజు కాంగ్రెస్ చేరిక గురించి చర్చ నడుస్తుంది!

గతకొన్ని రోజులుగా దిల్ రాజు రాజకీయ రంగప్రవేశంపై రకరకాల చర్చలు నడుస్తున్న సంగతి తెలిసిందే. త్వరలో దిల్ రాజు రాజకీయాల్లోకి రాబోతున్నారని.. బీఆరెస్స్ లో చేరబోతున్నారని.. నిజామాబాద్ నుంచి ఎంపీ స్థానానికి పోటీచేయబోతున్నారని కామెంట్లు వినిపించాయి. దిల్ రాజుతో పాటు ప్రకాశ్ రాజ్ కూడా బీఆరెస్ లో చేరబోతున్నారని.. వీరిద్దరి చేరికా దాదాపు ఒకేరోజు ఉండొచ్చని రకరకాల వార్తలు నెట్టింట హల్ చల్ చేసాయి. అయితే తాజాగా రేవంత్ – దిల్ రాజుల కలయిక తెరపైకి వచ్చింది.

తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి చేపట్టిన “హత్ సే హత్ జోడో యాత్ర” నిజామాబాద్‌ కున్న సందర్భంగా.. నర్సింగ్‌ పల్లిలోని వెంకటేశ్వరస్వామిని రేవంత్ రెడ్డి దర్శించుకున్నారు. అనంతరం.. ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు రేవంత్. ఈ సందర్భంగా ఆలయ అధికారులు రేవంత్ రెడ్డిని శాలువాతో ఘనంగా సన్మానించారు. అయితే… అంతకముందు రేవంత్ రెడ్డి నిజామాబాద్ లోకి ఎంటరవ్వగానే… ఆయన పాదయాత్ర బృందానికి ప్రముఖ సినీ నిర్మాత దిల్ రాజు స్వాగతం పలికారు. ఆ ఫొటోలను కాంగ్రెస్ శ్రేణులు సోషల్ మీడియాలో పోస్టు చేయగా.. అవి వైరల్ అవుతున్నాయి.

ఇదే సమయంలో ఈ ఫోటోలపై స్పందిస్తున్న నెటిజన్లు… దిల్ రాజు కాంగ్రెస్‌లో చేరబోతున్నారా? అని ప్రశ్నిస్తుండగా… దిల్ రాజు త్వరలో కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారని… రేవంత్ కు పలికిన స్వాగమే ఇందుకు హింట్ అని మరికొందరు కామెంట్ చేస్తున్నారు. కాగా, ఇటీవల “బలగం” సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ ను సిరిసిల్ల జిల్లాలో నిర్వహిస్తూ.. ఈ వేడుకకు మంత్రి కేటీఆర్‌ ను దిల్‌ రాజు చీఫ్ గెస్ట్‌ గా ఆహ్వానించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్, బీఆర్ఎస్ సర్కార్‌ పై కేటీఅర్ సమక్ష్యంలో ఆధ్వర్యంలో దిల్‌ రాజు ప్రశంసల జల్లు కురిపించారు. దీంతో దిల్‌ రాజ్ బీఆరెస్స్ లో చేరబోతున్నారంటూ కథనాలొచ్చాయి. ఈలోపు అనూహ్యంగా ఇవాళ దిల్‌ రాజు.. కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పాదయాత్రలో ప్రత్యక్షమవడం ఆసక్తికరంగా మారింది.

మరి ఈ విషయాలపై అటు రేవంత్ కానీ.. ఇటు దిల్ రాజు కానీ ఎప్పుడు స్పందిస్తారనేది ఆసక్తిగా మారింది!

YouTube video player