కాకినాడలో 79వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు శుక్రవారం అత్యంత వైభవంగా జరిగాయి. స్థానిక పోలీస్ పరేడ్ గ్రౌండ్స్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పాల్గొని జాతీయ పతాకాన్ని ఎగురవేసి వందనం సమర్పించారు. అంతకుముందు, ఆయన కవాతులో గౌరవ వందనం స్వీకరించారు.
ఈ సందర్భంగా ప్రజలనుద్దేశించి ప్రసంగించిన పవన్ కళ్యాణ్, రాష్ట్రంలో అమలవుతున్న పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను వివరించారు. రాష్ట్రంలోని 5 జిల్లాల్లో జల్ జీవన్ మిషన్ కింద రూ.7,900 కోట్ల విలువైన పనులు జరుగుతున్నాయని వెల్లడించారు. అదేవిధంగా, 2024 సంవత్సరంలో పిఠాపురంలో రూ.380 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టామని తెలిపారు.
రాష్ట్రంలో సుస్థిరమైన పాలన అందించే లక్ష్యంతోనే తమ కూటమి ప్రభుత్వం 15 ఏళ్ల పాటు అధికారంలో ఉండాలని ఆకాంక్షిస్తున్నామని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. పదవుల్లో ఉండి కేవలం అధికారాన్ని అనుభవించడం తమ ఉద్దేశం కాదని ఆయన స్పష్టం చేశారు.
ఇటీవల వెలువడిన పులివెందుల జెడ్పీటీసీ ఎన్నికల ఫలితాలపై కూడా పవన్ కళ్యాణ్ స్పందించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (YCP) గెలిస్తే అది ప్రజా తీర్పు అని, అదే కూటమి గెలిస్తే ఈవీఎంల తప్పిదం అంటూ ఆ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి చేస్తున్న విమర్శలను ఆయన ఎద్దేవా చేశారు.


