ఢిల్లీలో జరిగిన భయంకరమైన తొక్కిసలాట ఘటన 18 మంది ప్రాణాలను బలిగొంది. ప్రయాగ్ రాజ్ ఎక్స్‌ప్రెస్ రైలు ప్లాట్‌ఫాం మారిందనే వార్తతో ఒక్కసారిగా ప్రయాణికుల్లో గందరగోళం నెలకొంది. ప్లాట్‌ఫాం నెంబర్ 14 వద్ద ట్రైన్ కోసం వేచిచూస్తున్న ప్రజలు, రైలు మారినట్లు తెలిసిన వెంటనే ఒక్కసారిగా మెట్లవైపు పరుగులు తీశారు. రద్దీ ఎక్కువగా ఉండటంతో తోపులాట జరగ్గా, పలు మంది మహిళలు, చిన్నారులు కిందపడిపోయారు.
కిక్కిరిసిన జనంతో వారిని తొక్కుకుంటూ వెళ్లిపోవడంతో మరణాలు చోటుచేసుకున్నాయి. ఈ దుర్ఘటనలో 11 మంది మహిళలు, ఐదుగురు చిన్నారులు సహా 18 మంది మరణించగా, మరో 30 మంది తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదంపై కేంద్రం తీవ్ర విచారం వ్యక్తం చేస్తూ బాధిత కుటుంబాలకు రూ.10 లక్షల పరిహారం ప్రకటించింది. క్షతగాత్రులకు అత్యుత్తమ వైద్యం అందించే ఏర్పాట్లు చేస్తున్నట్లు వెల్లడించింది.
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్ర మోదీ, ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు. ఘటనకు ముందు రైల్వే అధికారులు ప్రయాగ్ రాజ్ ఎక్స్‌ప్రెస్ 14వ ప్లాట్‌ఫాం మీదకు వస్తుందని ప్రకటించారు. అయితే, రాత్రి 9:55 గంటలకు ఇది మరో ప్లాట్‌ఫాం వైపు మళ్లినట్లు ప్రచారం జరిగింది. ఇప్పటికే స్వతంత్రతా సేనాని ఎక్స్‌ప్రెస్, భువనేశ్వర్ రాజధాని ఎక్స్‌ప్రెస్ కోసం భారీ సంఖ్యలో ప్రయాణికులు ఉండగా, ఈ అనౌన్స్‌మెంట్ కలకలం రేపింది.
ట్రైన్ కోల్పోతామనే భయంతో ప్రయాణికులు ఒక్కసారిగా మెట్లవైపు వెళ్లటమే తొక్కిసలాటకు దారితీసింది. రైల్వే శాఖ ఈ ఘటనపై దర్యాప్తుకు ఆదేశాలు జారీ చేసింది. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా రైల్వే స్టేషన్లలో ప్రయాణికుల భద్రతను మెరుగుపరిచేందుకు చర్యలు తీసుకుంటామని అధికారులు పేర్కొన్నారు. వేగంగా మారే అనౌన్స్‌మెంట్లు, ప్లాట్‌ఫాం మార్పులపై ముందు జాగ్రత్త చర్యలు అవసరమని నిపుణులు సూచిస్తున్నారు.