న్యూఢిల్లీలో రైల్వే స్టేషన్‌లో చోటుచేసుకున్న తొక్కిసలాట తీవ్ర విషాదాన్ని మిగిల్చిన విషయం తెలిసిందే. ప్రయాగ్‌రాజ్ కుంభమేళాకు వెళ్లేందుకు భారీగా తరలివచ్చిన ప్రయాణికుల రద్దీ పెరగడంతో స్టేషన్‌లో గందరగోళం ఏర్పడింది. అనుకోని పరిస్థితుల్లో ట్రైన్ ప్లాట్‌ఫాం మారడంతో ఒక్కసారిగా ఉధృతంగా తోపులాట జరిగింది. ఈ ఘటనలో పదుల సంఖ్యలో ప్రాణాలు కోల్పోయారు.
ఈ ఘటనపై కేంద్ర రైల్వే శాఖ అత్యవసరంగా సమీక్ష నిర్వహించి, కీలక నిర్ణయాలు తీసుకుంది. రైల్వే స్టేషన్లలో అధిక రద్దీని నియంత్రించేందుకు ప్రత్యేక హోల్డింగ్ జోన్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. దేశవ్యాప్తంగా రద్దీ ఎక్కువగా ఉండే 60 రైల్వే స్టేషన్లలో శాశ్వత హోల్డింగ్ ప్రాంతాలను ఏర్పాటు చేయనున్నారు. అంతేకాదు, రద్దీ నియంత్రణ, ప్రయాణికుల భద్రత కోసం ఆధునిక సాంకేతికతను వినియోగించాలని నిర్ణయించారు.
ఈ క్రమంలో రైల్వే స్టేషన్లలో కృత్రిమ మేథ (ఏఐ) సాంకేతికతను ఉపయోగించేందుకు ప్రణాళిక సిద్ధమవుతోంది. స్థానిక రైల్వే అధికారులకు ప్రత్యేక శిక్షణ ఇవ్వడంతో పాటు ప్రయాణికుల కోసం మార్గదర్శకాలను రూపొందించనున్నారు. భవిష్యత్‌లో ఇలాంటి ప్రమాదాలు పునరావృతం కాకుండా రైల్వే శాఖ కీలక చర్యలు తీసుకుంటోంది. ప్రయాణికులకు ప్లాట్‌ఫాంపై ప్రత్యేక గుర్తులు, మార్గాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఈ చర్యలతో రైల్వే స్టేషన్లలో భద్రత మెరుగుపడుతుందన్న ఆశలు వ్యక్తమవుతున్నాయి.