రాజు తలచుకుంటే, కొరడా దెబ్బలకు కరువేంటి.? అన్నది వెనకటికి పెద్దలు చెప్పేమాట.! అంతే మరి, అప్పట్లో రాచరికం. ఇప్పుడేమో ప్రజాస్వామ్యం ముసుగులో రాజరికం.! పెద్దగా తేడా లేదు.!
పెద్ద నోట్ల రద్దు.. రాత్రికి రాత్రి ప్రధాని నరేంద్ర మోడీ తీసుకున్న నిర్ణయం. దేశంలో గొప్ప మార్పులు వచ్చేస్తాయ్.. నన్ను నమ్మండి.. అని నరేంద్ర మోడీ చెబితే, దేశ ప్రజలంతా విశ్వసించారు. పెట్రో ధరలు అదుపులోకి వచ్చేస్తాయ్.. పన్నులు తగ్గుతాయ్.. ఎందుకంటే, పెద్ద నోట్ల రద్దుతో నల్లధనమంతా బయటకు వచ్చేస్తుంది గనుక.. అన్నది అప్పట్లో కమలనాథులు చెప్పినమాట.
కానీ, ఏదీ అలా జరగలేదు. సర్వనాశనం.. అనేది చిన్నమాటే.! మళ్ళీ ఇప్పుడు ఇంకోసారి పెద్ద నోట్ల రద్దు అట. ప్రస్తుతానికైతే 2 వేల రూపాయల నోటు మాత్రమే రద్దవుతోంది. ముందు ముందు ఐదు వందల రూపాయల నోటు కూడా రద్దవ్వొచ్చు. ఆ తర్వాత రెండందల నోటు.. ఆ వెంటనే వంద రూపాయల నోటు.!
ప్రధాని నరేంద్ర మోడీ మదిలో ఏదన్నా మెదలితే.. యాభై రూపాయల నోటు కూడా రద్దయిపోవచ్చు.! భజన చేయడానికి కొంత బ్యాచ్ ఎప్పుడూ సిద్ధంగానే వుంటుంది. ఆ బ్యాచ్, దేశ వినాశనాన్ని కోరుకునేదే.. అనే విమర్శలూ లేకపోలేదు.
కర్నాటక అసెంబ్లీ ఎన్నికల్లో దెబ్బతిన్న బీజేపీ, ఎందుకు ఈ పెద్ద నోట్ల రద్దు ఆప్షన్ ఎంచుకుందన్నది ప్రస్తుతానికైతే ఎవరికీ అర్థం కావడంలేదు. ఇంతకీ, ఐదొందల నోటూ రద్దవుతుందా.? ఆ రద్దు వంద నోటుకీ సెగ పెడుతుందా.? వేచి చూడాల్సిందే.